check dams
-
AP: ‘ప్రాజెక్ట్ జలధార’.. అద్భుత ఫలితాలు
సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు. ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది. భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది. ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్షెడ్లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి. ఇదీచదవండి.. వేడెక్కిన ఏపీ రాజకీయం -
‘చెక్’లేని డ్యామ్‌లు.. నీరుగారుతున్న లక్ష్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో వట్టిపోయిన వాగులు, వంకలకు తిరిగి జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. శరవేగంగా సాగుతున్న కాళేశ్వరం పనులు ముగిసే నాటికి వివిధ వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చాలాచోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో నాణ్యత లోపించి మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. కొన్ని జిల్లాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలున్న ప్రజాప్రతినిధులు ఈ పనులు చేపట్టారు. మరికొందరు బినామీలకు కట్టబెట్టారు. అయితే, చాలాచోట్ల నాణ్యత లోపించి చెక్‌డ్యామ్‌లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు రెండేళ్లలో 1,200 చెక్‌డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.3,825 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వీటి నిర్మాణం తర్వాత సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని, పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలూ మెరుగుపడతాయని ప్రభుత్వం భావించింది. 2020–21 సంవత్సరంలో రూ.2,847.71కోట్లు కేటాయించింది. చిన్న వాగులపై చేపట్టే నిర్మాణాలకు కనిష్టంగా రూ.2.50లక్షలు, పెద్ద వాగులు, ఉప నదులపై కట్టడాలకు గరిష్టంగా రూ.11 కోట్లు ఇచ్చారు. 600 చెక్‌డ్యాంల కోసం టెండర్లు పిలవగా.. 91 నియోజకవర్గాల్లో 596 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఖరారయ్యాయి. పలు జిల్లాల్లో నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పోటీపడి టెండర్లు సాధించారు. చాలాచోట్ల అంచనా కన్నా తక్కువకు టెండర్లు దక్కించుకున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో నాయకులు తమ అనుకూలురుకి పనులు దక్కేలా చూసుకున్నారు. అయితే, చాలాచోట్ల నిర్మాణంలో నాణ్యతను గాలికొదిలేశారు. దీంతో ప్రభుత్వ సమున్నత లక్ష్యం నీరుగారిపోతోంది. ఉదాహరణలెన్నో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 50 చెక్‌డ్యాంలు మంజూరు కాగా.. ఇందులో ఆదిలాబాద్‌లో 20 పూర్తి కాగా, నిర్మల్‌లో 21, ఆసిఫాబాద్‌లో రెండు పూర్తయ్యాయి. ఇక మంచిర్యాలలో పనులు చాలాచోట్ల సగమే పూర్తయ్యాయి. ఎక్కువచోట్ల వానాకాలంలో నిర్మాణ దశలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. అటవీ ప్రాంతంలో వరదకు కొన్నిచోట్ల కొట్టుకుపోవడంతో మళ్లీ మరమ్మతు పనులు చేపట్టారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల కోట్ల నిధులు వృథా అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారు మానేరు వాగుపై చెక్‌డ్యాం నాసిరకంగా నిర్మించడంతో రెండు ముక్కలైంది. రూ.14.46 కోట్లకు టెండర్ ఆహ్వానించగా, కాంట్రాక్టర్ రూ.10.93 కోట్లకే దక్కించుకున్నారు. ప్రవాహానికి అనుగుణంగా డిజైన్ లేకపోవడం ప్రధాన లోపం కాగా, వానాకాలం ఆరంభంలో వరదలకు డ్యాం మధ్యభాగం రెండుగా విడిపోగా.. రెండోసారి వచ్చిన వరదకు రెండు వైపులా గోడల పక్కన మట్టి భారీగా కోతకు గురైంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోర గ్రామ సమీపంలో కప్పలవాగుపై రూ.5.75 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యాం కట్ట వరదకు కొట్టుకుపోయింది. ఇరువైపులా వింగ్ వాల్స్ పక్కన మట్టి కోతకు గురైంది. చివరకు వాగు విస్తీర్ణం మేరకు రెండువైపులా గోడలు కట్టాల్సి ఉండగా.. వాగు లోపలి భాగంలోనే నిర్మించారని, నిర్మాణంలో నాణ్యత, డిజైన్‌లో లోపాలున్నాయని గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల–మణుగూరు మార్గంలో మల్లన్నవాగుపై ఈ ఏడాదే నిర్మించిన చెక్‌డ్యాం కొద్దిపాటి వర్షాలు, వరదలకు కోతకు గురైంది. వాగు ఉధృతిని అంచనా వేయకుండా రెండువైపులా గట్లను కలుపుతూ డ్యాం కట్టారు. ఇప్పుడు వింగ్ వాల్స్‌కు ముప్పు ఏర్పడి మొత్తం నిర్మాణమే ప్రమాదంలో పడింది. జనగామ జిల్లాలో చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు అధికారుల పర్యవేక్షణా లోపంతో నాణ్యత లోపించింది. దేవరుప్పుల, గొల్లపల్లి, మున్పహాడ్ శివారులోని వాగు ప్రాంతంలో ఏడాది క్రితం రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన చెక్‌డ్యాంల సైట్ కట్టలు ఒక్క వర్షాకాలంలోనే బీటలువారి తెగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తిసదగోడు వద్ద దుందుబీ వాగుపై రూ.6.78కోట్ల నిధులతో నిర్మిస్తున్న చెక్‌డ్యాం 60% పూర్తయింది. గత ఆగస్టు 31న వచ్చిన దుందుబీ ప్రవాహానికి కుంగింది. చెక్‌డ్యాం దిమ్మె పగుళ్లు ఏర్పడి ఇసుకలోకి కూరుకుపోయింది. ముక్కలైన రిటైనింగ్ వాల్ మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగంగా కరీంనగర్ తీగల వంతెన దిగువన నిర్మించిన చెక్‌డ్యామ్ రిటైనింగ్ వాల్ పరిస్థితి ఇది. వరద ఉధృతికి ఇలా కొట్టుకుపోయింది. దీంతో రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. కరీంనగర్ నుంచి మాన కొండూర్ మండలం వేగురుపల్లి వరకు నీరు నిల్వ ఉండేలా రూ.12 కోట్ల వ్యయంతో చెక్‌డ్యామ్ నీళ్లు పక్కకు వెళ్లకుండా రిటైనింగ్ వాల్ కడుతుండగా ఎల్ఎండీ నుంచి నీళ్లు విడుదల చేయడంతో ఆ రిటైనింగ్ వాల్ ముక్కలైంది. రూ. 9.66 కోట్లు దండగ.. ములుగు జిల్లా మేడారం జంపన్నవాగులో నాలుగు చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. పడిగాపురం సమీపంలో రూ.4.51 కోట్లతో, రెడ్డిగూడెంలో రూ.2.88 కోట్లు, మేడారంలో రూ.2.75కోట్లు, ఊరట్టంలో రూ.3.42 కోట్లతో నిర్మించారు. కానీ, వాగులో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పడిగాపురం చెక్‌డ్యాం మినహా మిగిలిన మూడు చెక్‌డ్యామ్‌లను కూల్చాలని నిర్ణయించారు. మూడింటి నిర్మాణానికి రూ.9.05కోట్లు వెచ్చించారు. కూల్చివేతకు మరో రూ.61 లక్షలు ఖర్చుచేశారు. అధికారులకు ముందుచూపు లేని కారణంగా రూ. 9.66 కోట్ల ప్రజాధనం నీళ్లపాలైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే.. నందిగడ్డ ప్రాంతంలో దుందుబీ వాగులో నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణంలో ఉండగానే కుంగిపోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వరద ఉధృతికి చెక్‌డ్యాం తట్టుకోలేక కుంగిపోయి రైతుల పొలాలు కోతకు గురయ్యాయి. రూ.కోట్ల నిధులు వృథా అవుతున్నా అధికారులకు పట్టడం లేదు. – అంతిరెడ్డి, రైతు, జప్తిసదగోడు, ఉప్పునుంతల మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా వారి ఆదేశాల మేరకే.. మేడారం జంపన్నవాగులో నీటిని నిల్వ చేసేందుకు మూడు చెక్‌డ్యాంలను నిర్మించారు. కానీ, నిల్వ ఉన్న నీటిలోపడి భక్తులు మరణిస్తుండటం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ, కమిషనర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క లేఖలు, ఆదేశాల మేరకు కూల్చివేత పనులు చేపట్టాం. వాటి కూల్చివేతకు రూ.61 లక్షలు కేటాయించారు. -సదయ్య, డీఈఈ, జలవనరుల శాఖ, తాడ్వాయి నిర్లక్ష్యంగా నిర్మాణం ప్రభుత్వం చెక్‌డ్యాంల కోసం నిధులిస్తే అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – బక్కురి మోహన్, రైతు, సుంకెట్, నిజామాబాద్ జిల్లా -
టీడీపీ హయాంలో ఫైబర్ చెక్ డ్యామ్‌ల్లో భారీ దోపిడీ
జిల్లా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను అవినీతి పాపం వెంటాడుతోంది. టీడీపీ హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో చేపట్టిన ఫైబర్ చెక్ డ్యామ్‌లు తెలుగు తమ్ముళ్ల దోపిడీ అడ్డాగా నిలిచాయి. అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఆ ఊబిలో కూరుకుపోయారు. తిలాపాపం.. తలా పిడికెడు చందంగా అధికార యంత్రాంగం అవినీతిలో భాగస్వామ్యం అయింది. రూ.కోట్ల వెచ్చించి చేపట్టిన చెక్ డ్యామ్‌లతో ప్రజోపయోగం లేకపోగా, నాసిరకంగా మిగిలిపోయాయి. ఆ నాటి అవినీతి పాపాల చిట్టా బయటకొస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ ఐదేళ్లు అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. జిల్లాలో చెక్ డ్యామ్‌ల్లో అవినీతి వరద పారించారు. ఆ అవినీతిలో భాగస్వామ్యం అయిన జిల్లాలో 21 మంది ఇంజినీరింగ్ అధికారుల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.కోట్ల దోపిడీకి బాధ్యులై యంత్రాంగంపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా అధునాతన టెక్నాలజీ ఫైబర్ చెక్ డ్యామ్‌లు అంటూ అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు హడావుడి చేశారు. అయితే పూర్తిగా నాసిరకం మెటీరియల్ వినియోగించిన తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఓ పక్క నిర్మాణం పూర్తికాకుండానే వాటి డొల్లతనం బహిర్గతమైంది. మరో పక్క దెబ్బతిన్న డ్యామ్‌లు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. నిర్మించిన కొద్ది నెలలకే నీటి ఉధృతిని తట్టుకోలేక కొన్ని కొట్టుకుపోతే.. మరికొన్ని చోట్ల లీకేజీలతో నీటిని నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. వెరసి ఫైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మించి ఉపయోగం లేని విధంగా మారింది. జిల్లాలో ఇరిగేషన్ శాఖలో రూ.818 కోట్ల విలువైన దాదాపు 9 వేల పనులు చేపట్టారు. అత్యధికంగా ఉదయగిరి నియోజకవర్గంలో రూ.68 కోట్లు విలువైన 208 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. నీరు–చెట్టు పథకం ద్వారా చెక్ డ్యామ్‌లన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేతలే కాంట్రాక్టర్లుగా పనులు మొత్తం నిర్వహించారు. అప్పట్లో నేతలు స్థాయి, హోదాను బట్టి అందిన మేరకు దండుకున్నారు. ఫైబర్ చెక్‌డ్యామ్.. అదో మాయ జిల్లాలో ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది. నీరు–చెట్టు దోపిడీ ఒక ఎత్తు అయితే ఫైబర్ చెక్ డ్యామ్‌ల అవినీతి మరో ఎత్తు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫైబర్ చెక్ డ్యాంలు నిర్మించారు. వాస్తవానికి రూ.2 లక్షల నుంచి రూ.45 లక్షలు విలువ చేసే ఫైబర్ చెక్ డ్యామ్‌లకు రూ.70 లక్షలపైనే వెచ్చించారు. అవసరమైన చోట్లతో పాటు అవసరం లేని చోట్ల కూడా కేవలం బిల్లుల కోసం వీటిని నిర్మించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో నీరు–చెట్టు కింద 8 మండలాల్లో రూ. 39 కోట్లతో 126 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. 2017–18లో రూ.29 కోట్లతో 78 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు మండలాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల్లో కేవలం నెలల్లోనే వాల్వ్‌ల లీకేజీలు, పైప్‌లు లీకులతో నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఫైబర్ చెక్ డ్యామ్‌లు ఎక్కడా లేవు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాయి. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన అప్పటి ఎమ్మెల్యే తన సన్నిహితులకు చెందిన కంపెనీల నుంచి మెటీరియల్ దిగుమతి చేసుకోని ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ నిధులు భారీగా స్వాహాకు ఆస్కారం ఏర్పడినట్లు గుర్తించారు. విజిలెన్స్ విచారణలో బహిర్గతం జిల్లాలో నీరు–చెట్టు పథకంలో అవినీతి వరద పారిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేటతెల్లమైంది. ఫైబర్ చెక్‌డ్యామ్‌ల నాణ్యత, వాటి పనితీరు, కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న వైనం, వాస్తవ విలువ, ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పూడిక తీత పనులు చేయకుండానే చెక్‌డ్యాంల నిర్మాణం, అవసరం లేని చోట్ల ఏర్పాటు, చేపట్టినవి కూడా నాసిరకంగా ఉన్నాయని నిర్ధారించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనులు చేపట్టినట్లు రుజువైంది. ఆ మేరకు జిల్లాలో 21 మంది అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో 13 మంది ఏఈలు, నలుగురు డీఈలు, ఇద్దరు ఈఈలు, ఎస్ఈ, సీఈలను బాధ్యులను చేస్తూ తాఖీదులు జారీ చేస్తున్నట్లు సమాచారం. -
పెంచేసి.. పంచుకున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనుల టెండర్ల వ్యవహారమంతా అడ్డగోలుగా మారింది. పనులపై ప్రభుత్వ నజర్ లేకపోవడంతో జిల్లాల్లో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన అధిక ధరలకు కోట్ చేసి పనులు దక్కించుకుంటున్నారు. చాలా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో సిండికేట్‌గా మారుతున్నారు. ఎవ రికే పని దక్కాలో ముందుగానే నిర్ణయమైపోతోంది. అందుకనుగుణంగా 3 నుంచి 4% వరకు అధిక ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారు. పలుచోట్ల కేవ లం 2 టెండర్లు మాత్రమే దాఖలు కావడం సిండికేట్ అయ్యారనడానికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 632 చెక్‌డ్యామ్‌లను రూ. 2,890 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తిచేశారు. ఇందులో గోదావరి బేసిన్లో 444, కృష్ణాబేసిన్‌లో 188 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 625 పనులకు టెండర్లు పిలవగా, 560 చెక్‌డ్యామ్‌ల టెండర్లు ఖరారు చేశారు. ఇందులో 450 చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే టెండర్ల దాఖలు విషయంలో సంబంధిత జిల్లాలోని ప్రధాన కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి ఎక్సెస్ ధరలకు వాటిని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఒకే నది లేక వాగుపై ఉండే మూడు, నాలుగు చెక్‌డ్యామ్‌లను కలిపి ఒక క్లస్టర్‌గా చేశారు. ఇవన్నీ భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంతో వాటన్నింటినీ ఎక్సెస్ ధరలకే దక్కించుకునేలా కాంట్రాక్టర్లు పావులు కదిపారు. కరీంనగర్లో ‘రింగు’రింగా... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 114 చెక్‌డ్యామ్‌లను రూ.854 కోట్లతో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందులో గోదావరి ఉపనది మానేరులో ఏడాదంతా నీరు నిలిచి ఉండేలా 29 చెక్‌డ్యామ్‌లు, మూలవాగుపై 12 ప్రతిపాదించారు. వీటికి విడివిడిగా టెండర్లు పిలవాలని తొలుత భావించినా, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక నదిపై నిర్మించే చెక్డ్యామ్లన్నింటినీ ఒక క్లస్టర్‌గా చేసి వాటన్నింటికీ కలిపి ఒకే టెండర్ పిలిచారు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 పనులను 18 క్లస్టర్ల కింద చేర్చి రూ.380 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో అత్యధికంగా మానేరుపై కరీంనగర్ బ్రిడ్జికి సమీపంలో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.75.48 కోట్లతో టెండర్లు పిలవగా దీనిని 2.34 శాతం ఎక్సెస్‌తో జిల్లా నేత దగ్గరి బంధువులు దక్కించుకున్నారు. కరీంనగర్ మండల పరిధిలోనే ఇరుకుల్లవాగుపై 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 15.40 కోట్లతో టెండర్లు పిలవగా, ఇక్కడ సైతం 4.50 శాతం ఎక్సెస్‌తో టెండర్ దక్కించుకున్నారు. ఈ రెండు చోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీతో పాటే మరో ఏజెన్సీ మాత్రమే టెండర్ వేయడం గమనార్హం. ఇక మంథని మండల పరిధిలో మానేరు వాగుపై మరో 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.42.38 కోట్లతో టెండర్లలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు ఇద్దరే టెండర్లలో పాల్గొనగా, 3.78 శాతం ఎక్సెస్‌తో స్థానిక నేత చెప్పిన ఏజెన్సీకే టెండర్ దక్కింది. ఇదే రీతిన మానుకొండూర్ నియోజకవర్గ పరిధిలో రూ.38.45 కోట్ల విలువైన రెండు చెక్‌డ్యామ్ పనులను 2.69శాతం, జమ్మికుంట మండల పరిధిలోని రూ.60.73 కోట్ల పనులకు (3 చెక్‌డ్యామ్‌లు) 2.88 శాతం అధికంగా టెండర్లు వేశారు. కస్లర్ల పరిధిలో లేకుండా ఒక్కొక్కటిగా ఉన్న చెక్‌డ్యామ్‌ల టెండర్లు మాత్రం కనిష్టంగా ఒక శాతం నుంచి 18 శాతం వరకు లెస్ టెండర్లు దాఖలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్‌కు రూ.60 కోట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత బంధువు ఏజెన్సీకి రూ.70 కోట్లు, ఇదే జిల్లాలో ఓ ప్రధాన ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన మరో ఏజెన్సీకి రూ.75 కోట్లు, మరో ముఖ్య నేతకు చెందిన ఏజెన్సీకి రూ.75 కోట్ల పనులు దక్కాయి. మొత్తంగా ఎక్సెస్ దాఖలు చేసిన పనుల టెండర్ల విలువ రూ.380 కోట్లుగా ఉండగా, అధిక ధరలతో కోట్ చేయడంతో ప్రభుత్వంపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. నిజామాబాద్‌లో మూడు ఏజెన్సీలకే ... ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే చెక్‌డ్యామ్‌ల టెండర్లలో మరీ విపరీతంగా ప్రవర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 చెక్‌డ్యామ్ పనులకు ఇప్పటివరకు రూ.250 కోట్లతో టెండర్లు పిలవగా మూడు, నాలుగు ఏజెన్సీలకే మొత్తం పనులు పంచేశారు. జిల్లాలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న ఈ ఏజెన్సీలు ముందుగానే పర్సెంటేజీలు మాట్లాడుకొని అధిక ధరలకు టెండర్లు కోట్ చేసి పనులు దక్కించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం పనుల్లో రూ.100 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు విలువైన పనులను మూడు ఏజెన్సీలకే కట్టబెట్టారు. ఇవన్నీ ఎక్సెస్తోనే కావడం గమనార్హం. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే 47.59 కోట్ల పనులకు టెండర్లు పిలవగా, రెండే ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే విచిత్రంగా ఈ రెండు ఏజెన్సీలు తమకు దక్కిన పనులను 3.99 శాతం ఎక్సెస్తోనే పొందాయి. ఇదే నియోజకవర్గంలో మరో 16 పనులను ఒకే క్లస్టర్ కిందకి చేర్చి 35 కోట్లతో టెండర్లు పిలవగా, 4.59 శాతం ఎక్సెస్‌తో ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. ఇదే ఏజెన్సీకి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని 53.43 కోట్ల పనులు, బాన్సువాడ నియోజకవర్గంలోని రూ.24.34 కోట్ల పనులు అదే 4.59 శాతం అధిక ధరలతో దక్కేలా జిల్లా కీలక నేతలేæ చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన ముఖ్యనేతకు దగ్గరగా ఉండే మరో ఏజెన్సీకి సైతం ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని మొత్తం రూ.50 కోట్ల విలువ చేసే చెక్‌డ్యామ్‌లను కట్టబెట్టారు. మరికొన్ని చోట్ల చిన్న కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా, వారిపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలమైన స్థానిక కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టు ఇప్పించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే రీతిన స్థానిక ప్రజాప్రతినిధులు ముందుగానే ఏజెన్సీలతో మాట్లాడుకొని ఎక్సెస్ ధరలకు టెండర్లు వేయించారు. వరంగల్ జిల్లాలో ఓ కీలక నేత తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్‌కు రూ.52 కోట్ల విలువైన చెక్‌డ్యామ్‌ల పనులు ఇప్పించారు. నల్లగొండ జిల్లాలోనూ వరంగల్, కరీంనగర్‌కు చెందిన కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికే రూ.100 కోట్ల విలువైన పనులను 4 శాతానికి మించి ఎక్సెస్‌కు ఇప్పించుకున్నారు. -
జూన్‌కు చెప్పలేం... నవంబర్‌కు ఏమో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వీటి నిర్మాణ పనులు వర్షాకాలం ఆరంభానికి జూన్‌కు ముందే పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు కనీసం పూర్తిస్థాయి టెండర్లకు నోచుకోలేదు. అవి పూర్తయిన చోట్ల సైతం పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా, కార్మికులు, ఇసుక, సిమెంట్ కొరత, రవాణాలో జాప్యం ఆ పనులకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఆరు నెలల సమయం అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 400, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను రూ.2,681కోట్లతో చేపట్టాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తి చేశారు. అనుమతులిచ్చిన వాటిలో గోదావరి బేసిన్ పరిధిలో ఇప్పటివరకు 359 చెక్‌డ్యామ్‌లకు టెండర్లు పిలవగా, 40 చెక్‌డ్యామ్‌లపై ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగాయి. అవి జరగకున్నా, కొన్ని చోట్ల టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలకు పనులు కొనసాగించేందుకు అనుమతించడంతో మొత్తంగా 46చోట్ల మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. కృష్ణా బేసిన్లోనూ కేవలం 132 చోట్ల టెండర్లు పిలవగా, 25చోట్ల ఒప్పందాలు జరిగి, 18 చోట్ల పనులు ఆరంభించారు. మొత్తంగా 64చోట్ల పనులు ఆరంభమైనా అవి ప్రారంభ దశలోనే ఉన్నా యి. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యం లో పనులు వేగిరం చేసినా, కనిష్టంగా వీటిని పూర్తి చేసేందుకు 6 నెలలు.. అంటే నవంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వానాకాలం వర్షాలు తీవ్రంగా ఉండి ఉధృత ప్రవాహాలు కొనసాగితే చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కష్టతరమే కానుంది. దీంతో మళ్లీ వేసవి వస్తేకానీ పనులు పూర్తి చచేసే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలే చెబుతున్నాయి. సీజన్లో సందేహమే... ఇక పనులు ఆరంభించిన చాలా చోట్ల మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కొత్త కూలీలు దొరకడం గగనంగానే ఉంది. దీనికి తోడు ఇసుక లభ్యత తగ్గిపోయింది. లభ్యత ఉన్నా, వాటి ధరలు అధికంగా ఉండటం కాంట్రాక్టర్లకు కష్టాలు తెస్తోంది. దీంతో పాటే మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా సిమెంట్ బస్తాపై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచి బస్తా రూ.450 వరకు విక్రయిస్తున్నారు. ఇది కూడా పనుల కొనసాగింపునకు పెద్ద సమస్యగా మారిందని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఈ సీజన్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పనులు వేగిరం చేసే అంశమై శనివారం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ శాఖ ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. పనుల వేగిరంపై మార్గదర్శనం చేయనున్నారు. -
చెక్‌డ్యామ్‌లతో 15 టీఎంసీల నిల్వ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టే లక్ష్యంతో అన్ని వాగులు, వంకలపై రూ.3,825 కోట్లతో 1,200ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తొలి విడతగా 600 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించా రు. ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో 15 టీఎంసీ నీటి నిల్వ పెరగనుందని, 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని తెలిపారు. శనివారం టీఆర్ఎస్ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, సంకె రవిశంకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని, అవసరమైన ప్రతిచోటా వీటి నిర్మాణాలు జరుగుతాయన్నారు. 6.62 లక్షల మందికి పింఛన్లు: ఎర్రబెల్లి ఆసరా పింఛన్లపై ప్రభుత్వం రూ.11,758 కోట్లు ఖర్చు చేయనుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రస్తుత వార్షిక ఏడాదిలో ఖర్చు చేస్తున్న దానికంటే వచ్చే ఏడాది రూ.2,355 కోట్లు అదనంగా ఖర్చు చేస్తామని వెల్లడించారు. 57 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్ నుంచి పింఛన్లు అమలు ఇస్తామన్నా రు. ఇప్పటికే కొత్తగా 6.62 లక్షల లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఆ పింఛన్లలో కేంద్రం వాటా కేవలం రూ.203 కోట్లుగా ఉందనిన్నారు. దివ్యాంగులకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో సదరన్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. సభ్యులు చల్ల ధర్మారెడ్డి, కోరుకంటి చంద్రు లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దోమలు ప్రబలకుండా చర్యలు: ఈటల జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ జ్వరంతో 7 మంది మాత్రమే చనిపోయారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూసీ నది పరీవాహకంలోంచే దోమల వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఆయా ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టమన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిం చిందన్నారు. బీజేపీ సభ్యుడు రాజాసింగ్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, నగరంలో 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటికే 122 దవాఖానాలు పనిచేస్తున్నాయన్నారు. ఇక హరిప్రియ నాయక్ అడిగిన మరో ప్రశ్నకు.. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటికే 6.47లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. -
జల కట్టడికి మిషన్-2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరివాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను చెరువులకు మళ్లించి వాటికి జలకళను సంతరించే లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ తొలి విడత ప్రయోగం విజయవంతం కావడంతో ప్రభుత్వం రెండో విడత ‘మిషన్’ను ప్రారంభించింది. ఈ దఫాలో ప్రాజెక్టుల కాల్వల నుంచి, ఇతర వాగులు, వంకల నుంచి పారే నీటిని వృథాగా పోనివ్వకుండా ఎక్కడికక్కడే కట్టడి చేసేలా చెక్‌డ్యామ్‌లు, కాల్వల నీళ్లు చెరువుల్లోకి మళ్లేలా తూముల నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రక్రియను సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నీటిపారుదల శాఖ ప్రారంభించనుంది. ఇప్పటికే సిద్ధం చేసిన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణానికి ఆయా జిల్లాల్లోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి, టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. దీనిపై ఇప్పటికే చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. 8,350 చెరువులు, 1,200 చెక్‌డ్యామ్‌లు తొలి విడత మిషన్ కాకతీయ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,531 చెరువుల్లో 27వేలకు పైగా చెరువులను పునరుద్ధరించారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, వాటికి అనుబంధంగా తూముల నిర్మాణం, వీలైనన్ని ఎక్కువ చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహకంలో చిన్న నీటి వనరుల కింద కేటాయించిన 265 టీఎంసీల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడంతోపాటే రాష్ట్ర పరివా హకంలో కురిసే వర్షపు ప్రతి నీటిబొట్టు ఎక్కడికక్కడే నిల్వచేసి నీటి లభ్యత పెంచాలని సూచనలు చేశారు. దీని ద్వారా గరిష్ట ఆయకట్టు పారేలా చూడాలని సూచించారు. దీనికి అనుగుణంగా చెక్‌డ్యామ్, తూముల నిర్మాణానికి రూ.4,200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా.. ముందుగా ప్రాజెక్టుల పరివాహకం పరిధిలోని 8,350 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ గుర్తించిన చెరువుల్లోకి నీటిని మళ్లించేలా 3వేల తూముల నిర్మాణం చేయనున్నారు. ఈ తూముల నిర్మాణానికి రూ.410 కోట్లు మేర ఖర్చు చేయనున్నారు. ఇక కృష్ణా పరివాహకంలో 400, గోదావరి పరివాహకంలో 800 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రాంతాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. వీటికి రూ.3,790 కోట్లు ఖర్చు చేయనున్నారు. చెక్‌డ్యాంలకు కనిష్టంగా రూ.3కోట్ల నంచి గరిష్టంగా రూ.8కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఈ చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణాలకు ఒక్కోదానికి ప్రభుత్వ పరంగా పరిపాలనా అనుమతులు ఇస్తే తీవ్ర జాప్యం జరిగే అవకాశాల దృష్ట్యా, నేరుగా ఆయా పరిధిలోని ఇంజనీర్లే సాంకేతిక అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం అనుమతించింది. దీని ప్రకారం జిల్లా ఇంజనీర్లే వీటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలను పరిశీలించి అనుమతులిస్తారు. ఆవెంటనే టెండర్లు పిలుస్తారు. వారం రోజుల్లోనే టెండర్లు ముగించి పనులు ఆరంభిస్తారు. తూముల నిర్మాణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని నిబంధన పెట్టగా, చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 9 నెలల గడువు విధించారు. ఇప్పటికే అంచనాలు సిధ్దమైన చోట్ల జిల్లాల వారీగా సోమవారం నుంచి టెండర్ల ప్రక్రియ ఆరంభం కానుంది. టెండర్ల ప్రక్రియ ముగించి ఈ నెల 20 నుంచి అన్నిచోట్లా పనులు మొదలవ్వాలని ఇప్పటికే ఇంజనీర్లకు ఆదేశాలు వెళ్లాయి. కాళేశ్వరం నీళ్లతోనే 3,011 చెరువులు ఈ ఖరీఫ్‌లోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయనున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే ప్రాజెక్టు కాల్వలను చెరువులకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం కాల్వల పరిధిలో మొత్తంగా 3,011 చెరువులను గోదావరి నీటితో నింపేలా ప్రస్తుతానికి ప్రణాళిక వేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం కడెం కింద 62 చెరువులు, ఎస్సారెస్పీ సరస్వతి కెనాల్ కింద 38, సదర్మట్ బ్యారేజీ కింద 7, ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 396, స్టేజ్–2 కింద 182, దేవాదుల కింద 286, ఎస్సారెస్పీ కింద నేరుగా 1,200, ఎల్లంపల్లి కింద 124, మిడ్‌మానేరు పరిధిలో 12, వరద కాల్వల కింద 17, అప్పర్ మానేరు కింద 22, కాళేశ్వరం పరిధిలో ఇతర ప్యాకేజీల కింద 266, నిజాంసాగర్ కింద 399 చెరువులను నింపేలా ఇప్పటికే ప్రణాళిక సిధ్ధం చేశారు. ఈ చెరువుల్లో చేరే నీటి సామర్థ్యం సుమారుగా 37.37 టీఎంసీలుగా ఉంటుందని లెక్కగట్టారు. ఈ చెరువుల కింద మొత్తంగా 2,89,038 ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుందని గుర్తించారు. ఈ చెరువులను నింపేలా ఎక్కడెక్కడ తూముల నిర్మాణం చేయాలన్నది ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వల పరిధిలో 278 చెరువులను నింపేందుకు కొత్తగా 201 తూముల నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు. ఈ తూమల నిర్మాణానికి 7.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. -
చెక్‌డ్యాంలతో సత్ఫలితాలు
సాక్షి, బాలానగర్: మండలంలోని గుండేడ్–బాలానగర్, మాచారం – నందారం, పెద్దాయపల్లి–బోడజానంపేట, కేతిరెడ్డిపల్లి గ్రామాల శివారులోని దుందుబీ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు పడితే చెక్‌డ్యాం లు నిండి పరిసర గ్రామాల్లో నీటి కష్టాలు తీరను న్నాయి. ఏళ్లుగా గ్రామాల్లో నీటికష్టాలు మిన్నంటి నా గతంలో దుందుబీ నదిపై నిర్మించిన చెక్‌డ్యాం లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మరిన్ని చెక్‌డ్యాంల నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మండలంలోని గుండేడ్ శివారులో రూ.కోటి 4 లక్షలతో రెండు, బోడాజానంపేట శివారులో రూ.29 లక్షలతో మరొకటి మొత్తం మూడు చెక్‌డ్యాంలు నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తిచేశారు. ప్రస్తుత చెక్‌డ్యాంలు సత్ఫలితాలు మండల కేంద్రంతోపాటు, పెద్దాయపల్లి, గౌతా పూర్ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌డ్యాంలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత వర్షాకాలంలో చెక్‌డ్యాంలు నిండి భూగర్భజలాలు పెరిగి వ్యవసా య బోర్లలో నీరు సంవృద్ధిగా లభించింది. వ్యవసాయ బోర్లలో నీరు సంవృద్ధిగా లభ్యమై బోరు మోటార్లు కాలిపోయే పరిస్థితి తప్పుతుంది. అంతేకాకుండా గతేడాదితో పోల్చితే తాగునీటి సమస్య పెద్దగా రాలేదు. పశువులకు తాగునీరు కొరత లేకపోవడమే కాకుండా సాగు విస్తీర్ణం పెరిగింది. గ్రామాలకు ప్రయోజనాలు మండలంలోని గుండేడ్, బోడజానంపేట శివారులో దుందుబీ నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తయితే చెక్‌డ్యాంల పరిసర గ్రామాలైన మాచారం, నందారం, గుండేడ్, బాలానగర్, చెన్నంగులగడ్డ తండా, పెద్దాయపల్లి, గౌతాపూర్, సేరిగూడ, బోడజానంపేట, గాలిగూడ గ్రామాలకు ప్రయోజనం లభించనుంది. ఆయా గ్రామాల శివారులలో భూగర్భజలాలు పెరిగి తాగునీటితోపాటు, వ్యవసాయానికి సైతం నీరు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
చెక్‌డ్యామ్‌లు.. తూముల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టిన మాదిరే ఈ ఐదేళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 35వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ పూర్తయిన దృష్ట్యా, ఇకపై ప్రతినీటి బొట్టును చెరువుకు మళ్లించేలా ప్రాజెక్టు కాల్వల నుంచి తూముల నిర్మాణం, అవసరమైన చోట్ల వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా అధికారులకు మాస్టర్ ప్లాన్ వివరించగా, ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం వర్క్‌షాప్‌లు నిర్వహించి రాష్ట్రంలో చెక్‌డ్యామ్, తూముల నిర్మాణంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు. కృష్ణా బేసిన్లో 250 చెక్‌డ్యామ్‌లకు చాన్స్ కృష్ణా బేసిన్లో 311 నీటి ప్రవాహ వాగులపై ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు ఇప్పటికే ఉండగా, మరో 250 వరకు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇక ఇదే బేసిన్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతుండగా, ఆ ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలను, సమీప చెరువులకు అనుసంధానించి, ఇందుకు అవసరమైన చోట తూముల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టుల కాల్వల నుంచి సుమారు 3 వేల చెరువులను నింపే అవకాశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక గోదావరి బేసిన్లో ఇప్పటికే 372 ప్రధాన వాగులను గుర్తించగా, వీటిపై 229 చెక్‌డ్యామ్‌లు ఉండగా, మరో 200 నుంచి 300 కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో 19 తూములకు ఓకే.. ఇక కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీ, వరద కాల్వ ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో కొత్తగా 19 తూముల నిర్మాణానికి లైన్‌క్లియర్ అయింది. మిగతా చోట్ల తూముల నిర్మాణంపై సర్వే జరుగుతోంది. 15 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి బడ్జెట్లో ఈ పనులకే రూ.వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం లేని పక్షంలో భారీ ప్రాజెక్టులకు తీసుకుంటున్న మాదిరే బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. -
నీటి బొట్టు.. ఒడిసి పట్టు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల తో చెరువులను అనుసంధానించే ప్రక్రియ ను నీటిపారుదలశాఖ వేగిరం చేసింది. ప్రాజెక్టుల కాల్వల నుంచి వచ్చే నీరు, వర్షం నీరు, రీజనరేటెడ్ నీళ్ల ద్వారా చెరువులను నింపేలా వ్యూహం ఖరారు చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ రెండు బేసిన్లలో తెలం గాణలోని చెరువులకు ఇచ్చిన 265 టీఎంసీల కేటాయింపులను సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో మొత్తం 3,488 క్లస్టర్లలో గొలుసుకట్టు చెరువులున్నాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 559 మండలాల పరిధిలో ప్రభు త్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో కలిపి 48,843 చెరువులున్నాయి. ఇందులో 12,154 గొలుసుకట్టు మార్గా లుండగా, వీటి పరిధిలో 27,814 చెరువులున్నాయి. మరో 16,771 గొలుసుకట్టు మార్గం లేని వివిక్త చెరు వులు. వీటిని వదిలేసి గొలుసుకట్టుగా ఉన్న చెరువుల మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. ఈ గొలుసుకట్టులో ఉన్న మొదటి చెరువును గుర్తించి, దాన్ని ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేసేలా మ్యాపింగ్ ప్రక్రియ చేస్తు న్నారు. ప్రాజెక్టుల కింద ఏ కాల్వ నుంచి ఏయే చెరువులను నింపవచ్చన్నది ఖరారు చేస్తున్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. జూన్‌నాటికి కాళే శ్వరం నీళ్లు వచ్చే అవకాశాల దృష్ట్యా ప్రాజెక్టు పరిధిలోని 500లకు పైగా చెరువులతో పాటు, ఎస్సారెస్పీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపేలా పనులు కొనసాగాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనుసంధానం..ఆచరణీయం కృష్ణా,గోదావరి బేసిన్లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. బేసిన్‌లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసేలా ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు నీటిపారుదల శాఖ ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధంచేసి క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తోంది. చెక్‌డ్యామ్‌లేశరణ్యం... కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఇదే తరహా వ్యూహంతో ముందుకు పోతోంది. ఈ రాష్ట్రాలనే అనుసరిస్తూ, చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా బేసిన్ పరిధిలో 311 నీటి ప్రవాహ వాగులు (స్ట్రీమ్స్) ఉండగా, వాటి పొడవు 5,700 కిలోమీటర్లు ఉంది. వీటి పరిధిలో ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు, 156 ఆనకట్టలు ఉండగా, కొత్తగా 250 వరకు చెక్‌డ్యామ్‌లు నిర్మించే అంశంపై కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇక గోదావరి పరిధిలో 372 వాగులు 6,481 కి.మీ.ల పొడవున విస్తరించి ఉండగా, 229 చెక్‌డ్యామ్‌లు, 89 ఆనకట్టలు ఉన్నాయి. ఇక్కడ 250 నుంచి 300 చెక్‌డ్యామ్‌లు కొత్తగా నిర్మించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కృష్ణా బేసిన్లో మూసీ, ఓకచెట్టి వాగు, పెద్దవాగు, బూగ వాగు, డిండి వాగు, గుడిపల్లి వాగు, కాగ్నా, కందుకూర వాగుల పరిధిలో, గోదావరి బేసిన్‌లోని మంజీర, మానేరు, తాలిపేరు, లెండి, పెన్‌గంగ, బొమ్మారావు వాగు, ఘనపూర్ వాగు, గొబ్బాల్ వాగు, కిన్నెరసాని, లోటు వాగుల పరిధిలో ఎక్కువగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేసుకునే అవకాశాలను గుర్తించారు. అయితే హైడ్రాలజీ లెక్కలు, నీటి లభ్యత ఆధారంగా ఎక్కడెక్కడ వీటి నిర్మాణం చేయొచ్చో అంచనా వేయాలని ఇప్పటికే జిల్లాల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు. ప్రాజెక్టుల పరీవాహకంలో ఉన్న వాగులను ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న చెరువులు, జలాశయాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యతఉన్న వాగులపై చెక్‌డ్యామ్‌లను ప్రతిపాదించనున్నారు. చెక్‌డ్యామ్‌ల మధ్య దూరాన్ని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించనుండగా, ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో షేక్‌హ్యాండ్ చెక్‌డ్యామ్‌లు ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. కొత్త చెక్‌డ్యామ్‌లు కృష్ణా బేసిన్ పరిధిలో250 గోదావరి పరిధిలో 300 -
కృష్ణా, గోదావరిపై చెక్‌డ్యాంలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. దీంతో ఎక్కడికక్కడ నీటిని కట్టడి చేసి వీలున్నంత మేర ఎక్కువ జలాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని నదులు, వాగుల పునరుజ్జీవం కోసం అనువైన చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించాలని, ఇందుకు అవసరమైన సాంకేతికాంశాలను పరిశీలించి అంచ నా వ్యయంతో నివేదికను తయారు చేయాలని సీఎం కేసీఆర్ గతంలో నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో రిటైర్డ్ ఈఎన్సీ విజయ్‌ప్రకాశ్ నేతృత్వంలోని బృందం పలు అంశాలను అధ్యయనం చేసింది. ఆ అంశాలను క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లకు వివరించడానికి సోమవారం జలసౌధలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్రస్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారులకు వరకు హాజరైన ఈ వర్క్‌షాప్‌లో లక్ష్యాలను, సీఎం సూచనలను ఇంజనీర్లకు ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ వివరించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. అనంతరం వర్క్‌షాప్‌నకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ ఇంజనీర్లనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైందని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక చాలా కాలం క్రితమే ప్రధాన నదులు, వాటి ఉపనదులపై చెక్‌డ్యాంలు, ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగం చేసుకుంటున్నాయని తెలిపారు. జహీరాబాద్ ప్రాంతంలోని గొట్టిగానిపల్లె గ్రామంలో ఉన్న ఒకే ఒక్క వాగుపై 12 చెక్‌డ్యాంలు నిర్మించారని, దీంతో గ్రామంలో నీటి వనరుల లభ్యత పెరిగి ఏటా 2 పంటలు పండిస్తున్నారని తెలిపారు. మ్యాప్‌ల ద్వారా వివరణ: రిటైర్డ్ ఈఎన్సీ విజయ్‌ప్రకాశ్ తన అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఇంజనీర్లకు వివరించారు. చెక్‌డ్యాంల నిర్మాణాలకు ఎంపిక చేయాల్సిన వాగులను ఎలా గుర్తించాలి, అందులో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్ఆర్ఎస్ఏ రూపొందించిన మ్యాప్‌ల ద్వారా వాగుల ఎంపికపై చర్చించారు. రాష్ట్రంలోని నదులు, వాగులను మొత్తం 8 స్థాయిల్లో వర్గీకరించామని, నదులు, ఉపనదులు, వాగుల సామర్థ్యాలను బట్టి చెక్‌డ్యాంల నిర్మాణానికి 4 లేదా ఆపైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. గోదావరి బేసిన్‌లోని 6,500 కిలోమీటర్ల పొడవులో ఇప్పటికే ఆనకట్టలు, చెక్‌డ్యాంలు, కత్వా లు, బంధాలు మొత్తం కలిపి 319 ఉన్నాయని, కృష్ణా బేసిన్‌లోని 5,700 కిలోమీటర్ల పొడవున్న వాగులపై 466 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఇందులో అత్యధికంగా చిన్నస్థాయి వాగులపై ఉన్నాయని, పెద్ద వాగులపై ఇప్పుడు చెక్‌డ్యాంలు నిర్మించే అవకాశం ఉందన్నారు. మంచి రాతి పునాది గల స్థలాలను ఎంపిక చేయాలన్నారు. చెక్‌డ్యాంల ప్రతిపాదనలలో మొదటి నుంచీ భూగర్భ జలశాఖతో టచ్‌లో ఉండాలని సూచించారు. 3 మీటర్ల లోతున జలం అందుబాటులో ఉంటే అక్కడ చెక్‌డ్యాంలను ప్రతిపాదించవద్దని చెప్పారు. ఇప్పటికే విధ్వంసానికి గురైన గ్రామాలకు ప్రాధాన్యం కల్పించాలని భూగర్భ జల శాఖ డైరెక్టర్ పండిత్ సూచించారు. ఈ వర్క్‌షాప్‌లో వోఎస్డీ శ్రీధర్ రావు దేశ్‌పాండే, మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భజలాలను కాపాడండి
► భావితరాల కోసం నీటిని సంరక్షించండి ► సుదర్శన్, రిటైర్డు రీజినల్ డెరైక్టర్ సీజీడబ్ల్యూబీ హుస్నాబాద్‌రూరల్ : ‘భూగర్భజలాలు కాపాడండి.. భావితరాలకు నీటిని సంరక్షించండి.. చినుకు చినుకు కలిస్తే చెరువు నిండునే.. చెరువు కళకళలాడితే బావులు నిండునే.. ’ అనే నినాదంతో కేంద్ర భూగర్భ జలబోర్డు దక్షణ క్షేత్రం హైదరాబాద్ వారు నీటి పొదుపు భూగర్భజలాల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అతి నీటి వినియోగం, భూగర్భజల సమస్యలు, భాగస్వామ్య పద్ధతులపై వివరిస్తున్నారు. మొదటి రోజు సదస్సును కేంద్ర భూగర్భజల బోర్డు సీనియర్ శాస్త్రవేత్త పి.నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర భూగర్భజల బోర్డు రిటైర్డు రీజినల్ డెరైక్టర్ జి.సుదర్శన్ వర్షపు నీరు పొదుపు పై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో అతిగా బోర్లు, బావుల ద్వారా నీటి వినియోగం జరుగుతోందని, ఫలితంగా 20 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడుగుంతలు, నీటికుంటలు, కాంటూర్ కందకాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచిం చారు. పంటలకు అతిగా నీటిని వినియోగిస్తున్నారని, అలాకాకుండా మైక్రోఇరిగేషన్ వైపు దృష్టి సారించాలని సూచించారు. బిందు, తుంపుర సేద్యం ద్వారా సాగు చేస్తే నీరు పొదుపు అవుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు వృథా నీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి, హరికుమార్ ఏడీఏ మహేష్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సుభాష్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
చెరువులు, చెక్ డ్యాంలకు నీరందిస్తాం
మంత్రి పరిటాల సునీత వెల్లడి రాప్తాడు : పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ధర్మవరం కుడికాలువ కింద ఉన్న 49 చెరువులతో పాటు 100 చెక్ డ్యాంలను పూర్తి స్థాయిలో నీటితో నింపుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ధర్మవరం కుడికాలువలో ఉన్న ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలను శ్రమదానం ద్వారా తొలగించారు. మంత్రి సునీతతో పాటు అధికారులు, టీడీపీ నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ఉపాధి కూలీలు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయని, వరుస కరువుతో అల్లాడుతున్న ప్రజలు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరి కోటా నీరు వారికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువకు నీటిని విడుదల చేయగానే రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కాలువ దగ్గర కాపలాగా ఉండి ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కమిటీని ఏర్పాటు చేసి ఒకచెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీటిని అందిస్తామన్నారు. అక్టోబర్ 15 నుంచి అన్ని చెరువులకూ నీటిని విడుదల చేస్తామని ఇదివరకు చెప్పామని, అయితే ప్రస్తుతం పీఏబీఆర్ లో ఒక టీఎంసీ మాత్రమే ఉందని, ఆ నీటిని విడుదల చేస్తే కాలువకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. మరో పది రోజులు ఆలస్యమైనా హంద్రీనీవా నీటిని జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా డ్యాంలోకి మరొక రెండు టీఎంసీల నీటిని తీసుకొచ్చి తాగునీటి కోసం అన్ని చెరువులకూ నింపుతామని, రెండో విడతలో సాగుకు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి నారాయణస్వామి, తహశీల్దార్ హరికుమార్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా ఏపీడీ నాగభూషణం, ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, వైస్ ఎంపీపీ గవ్వల పరంధామ, హెచ్చెల్సీ డీఈలు పాండురంగారావు, జేఈలు శివశంకర్, మండల కన్వీనర్ సాకే నారాయణస్వామి పాల్గొన్నారు. -
వరద నీటిని ఒడిసిపట్టరేం!
యాచారం: వృథాగా పోయే నీటిని ఆపేందుకు.. భూగర్భ జలాలను పెంపొందించేందుకు రూ. లక్షల వ్యయంతో నిర్మించిన ఆన కట్టలు, చెక్‌డ్యాంలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అవగాహన లోపంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం లేని చోట, అవసరం లేని చోట సైతం చెక్‌డ్యాంలు నిర్మించారు. మరికొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటే నిర్మించినప్పటికీ పనుల్లో నాణ్యత లోపం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లోని ఆనకట్టలు, చెక్‌డ్యాంలు కనిపించే పరిస్థితే లేకుండాపోయింది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యంగా మారింది. రూ. 5 కోట్లకుపైగా వెచ్చించినా.. ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో గత నాలుగేళ్ల కాలంలో రూ.5 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసి ఈజీఎస్, నాబార్డు, మెగా వాటర్‌షెడ్ తదితర పథకాల కింద చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించారు. కొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటనే చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించినప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో కొద్ది నెలల్లోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అవసరం లేని చోట నిర్మించడంతో పెద్దగా ప్రయోజనం లేకుండాపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని కొన్ని గ్రామాలు మినహా యాచారం, మంచాల మండలాల్లో గుట్టలు, వాగులు, వంకలున్న ప్రాంతాలున్నాయి. వర్షం కొద్దిపాటిగా కురిసినా గుట్టల్లోంచి వరద నీరు వృథాగా పోతోంది. ఈ విషయం సంబంధితాధికారులకు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలిసిందే. కానీ ఆయా చోట్ల తక్షణమే చెక్‌డ్యాంలు, ఆన కట్టలు నిర్మించకపోవడం శాపంలా పరిణమించింది. నల్గొండ జిల్లాలోకి వరద నీరు.. యేటా కురిసే వర్షాలకు మంచాల, యాచారం మండలాల సరిహద్దులోని వెంకటేశ్వర తండా, నల్లవెల్లి తండాల సమీపంలోని గుట్టలోంచి ఉద్ధృతంగా వరదనీరు పారుతుంది. ఇక్కడ సమీపంలో గుట్టలు ఉండడంతో కొన్ని రోజుల పాటు జాలు నీరు పారుతూ ఉంటుంది. కొన్నేళ్లుగా నీటి వృథా స్థానిక ప్రజాప్రతిధులకు, అధికారులకు తెలిసినా అక్కడ మాత్రం పెద్ద కట్ట నిర్మించకపోవడంతో.. ఆ వరదనీరు నల్లొండ జిల్లాలోకి వెళుతోంది. తాడిపర్తి, కుర్మిద్ద అటవీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. యాచారం మండలంలోని మాల్, మంతన్‌గౌరెల్లి సమీప అటవీ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారి వరదనీరు పారే ప్రాంతాలను గుర్తించి చెక్‌డ్యాంలు, పెద్ద ఆనకట్టలు నిర్మిస్తే భూగర్భజలాల పెంపునకు అవకాశముంది. -
బాబు ప్రతిపాదనపై కరుణ అభ్యంతరం
చెన్నై: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య ఏర్పడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. దీనివల్ల తమిళనాడులోని మూడు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని కరుణానిధి చెప్పారు. వేలూరు, తిరువళ్లూరు, కాంచీపూరం జిల్లాల ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడ్డారని అన్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కరుణానిధి స్పందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా అప్పటి యూపీఏ భాగస్వామ్య పక్షాలు డీఎంకే, పీఎంకే వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారని కరుణానిధి గుర్తు చేశారు. 2008లో సుప్రీం కోర్టు ఈ కేసును విచారించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి సూచించిందని చెప్పారు. కేంద్ర జలసంఘం ఈ వివాదాన్ని పరిష్కరించేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లరాదని కేంద్రం సూచించిందని తెలిపారు. తమిళనాడు ప్రజల అంటే చంద్రబాబుకు అభిమానముందని, చెన్నై నగర వాసుల తాగునీటి కోసం తెలుగు గంగ ప్రాజెక్టును అభివృద్ధి చేశారని అన్నారు. చంద్రబాబు పాలార్ పై డ్యామ్ ప్రతిపాదన చేయడాన్ని నమ్మలేకపోతున్నాని కరుణనిధి చెప్పారు.