యాచారం: వృథాగా పోయే నీటిని ఆపేందుకు.. భూగర్భ జలాలను పెంపొందించేందుకు రూ. లక్షల వ్యయంతో నిర్మించిన ఆన కట్టలు, చెక్‌డ్యాంలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. అవగాహన లోపంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం లేని చోట, అవసరం లేని చోట సైతం చెక్‌డ్యాంలు నిర్మించారు. మరికొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటే నిర్మించినప్పటికీ పనుల్లో నాణ్యత లోపం కారణంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లోని ఆనకట్టలు, చెక్‌డ్యాంలు కనిపించే పరిస్థితే లేకుండాపోయింది. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం మాత్రం శూన్యంగా మారింది.
రూ. 5 కోట్లకుపైగా వెచ్చించినా..
ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో గత నాలుగేళ్ల కాలంలో రూ.5 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసి ఈజీఎస్, నాబార్డు, మెగా వాటర్‌షెడ్ తదితర పథకాల కింద చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించారు. కొన్ని గ్రామాల్లో అవసరమున్న చోటనే చెక్‌డ్యాంలు, ఆనకట్టలు నిర్మించినప్పటికీ అవి నాణ్యతగా లేకపోవడంతో కొద్ది నెలల్లోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అవసరం లేని చోట నిర్మించడంతో పెద్దగా ప్రయోజనం లేకుండాపోయాయి.
ఇబ్రహీంపట్నం మండలంలోని కొన్ని గ్రామాలు మినహా యాచారం, మంచాల మండలాల్లో గుట్టలు, వాగులు, వంకలున్న ప్రాంతాలున్నాయి. వర్షం కొద్దిపాటిగా కురిసినా గుట్టల్లోంచి వరద నీరు వృథాగా పోతోంది. ఈ విషయం సంబంధితాధికారులకు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు తెలిసిందే. కానీ ఆయా చోట్ల తక్షణమే చెక్‌డ్యాంలు, ఆన కట్టలు నిర్మించకపోవడం శాపంలా పరిణమించింది.
నల్గొండ జిల్లాలోకి వరద నీరు..
యేటా కురిసే వర్షాలకు మంచాల, యాచారం మండలాల సరిహద్దులోని వెంకటేశ్వర తండా, నల్లవెల్లి తండాల సమీపంలోని గుట్టలోంచి ఉద్ధృతంగా వరదనీరు పారుతుంది. ఇక్కడ సమీపంలో గుట్టలు ఉండడంతో కొన్ని రోజుల పాటు జాలు నీరు పారుతూ ఉంటుంది. కొన్నేళ్లుగా నీటి వృథా స్థానిక ప్రజాప్రతిధులకు, అధికారులకు తెలిసినా అక్కడ మాత్రం పెద్ద కట్ట నిర్మించకపోవడంతో.. ఆ వరదనీరు నల్లొండ జిల్లాలోకి వెళుతోంది. తాడిపర్తి, కుర్మిద్ద అటవీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. యాచారం మండలంలోని మాల్, మంతన్‌గౌరెల్లి సమీప అటవీ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారి వరదనీరు పారే ప్రాంతాలను గుర్తించి చెక్‌డ్యాంలు, పెద్ద ఆనకట్టలు నిర్మిస్తే భూగర్భజలాల పెంపునకు అవకాశముంది.
వరద నీటిని ఒడిసిపట్టరేం!
Published Sun, Sep 14 2014 11:54 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM
Advertisement
Advertisement