భూగర్భజలాలను కాపాడండి
► భావితరాల కోసం నీటిని సంరక్షించండి
► సుదర్శన్, రిటైర్డు రీజినల్ డెరైక్టర్ సీజీడబ్ల్యూబీ
హుస్నాబాద్‌రూరల్ : ‘భూగర్భజలాలు కాపాడండి.. భావితరాలకు నీటిని సంరక్షించండి.. చినుకు చినుకు కలిస్తే చెరువు నిండునే.. చెరువు కళకళలాడితే బావులు నిండునే.. ’ అనే నినాదంతో కేంద్ర భూగర్భ జలబోర్డు దక్షణ క్షేత్రం హైదరాబాద్ వారు నీటి పొదుపు భూగర్భజలాల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అతి నీటి వినియోగం, భూగర్భజల సమస్యలు, భాగస్వామ్య పద్ధతులపై వివరిస్తున్నారు. మొదటి రోజు సదస్సును కేంద్ర భూగర్భజల బోర్డు సీనియర్ శాస్త్రవేత్త పి.నాగేశ్వర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర భూగర్భజల బోర్డు రిటైర్డు రీజినల్ డెరైక్టర్ జి.సుదర్శన్ వర్షపు నీరు పొదుపు పై అధికారులకు అవగాహన కల్పించారు.
జిల్లాలో అతిగా బోర్లు, బావుల ద్వారా నీటి వినియోగం జరుగుతోందని, ఫలితంగా 20 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడుగుంతలు, నీటికుంటలు, కాంటూర్ కందకాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచిం చారు. పంటలకు అతిగా నీటిని వినియోగిస్తున్నారని, అలాకాకుండా మైక్రోఇరిగేషన్ వైపు దృష్టి సారించాలని సూచించారు. బిందు, తుంపుర సేద్యం ద్వారా సాగు చేస్తే నీరు పొదుపు అవుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు వృథా నీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి, హరికుమార్ ఏడీఏ మహేష్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సుభాష్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.