నీటి బొట్టు.. ఒడిసి పట్టు | Maharashtra as Karnataka Construction of Check Dam on the Vams | Sakshi
Sakshi News home page

నీటి బొట్టు.. ఒడిసి పట్టు

Published Wed, Feb 13 2019 3:10 AM | Last Updated on Wed, Feb 13 2019 3:48 AM

Maharashtra as Karnataka Construction of Check Dam on the Vams - Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల తో చెరువులను అనుసంధానించే ప్రక్రియ ను నీటిపారుదలశాఖ వేగిరం చేసింది. ప్రాజెక్టుల కాల్వల నుంచి వచ్చే నీరు, వర్షం నీరు, రీజనరేటెడ్‌ నీళ్ల ద్వారా చెరువులను నింపేలా వ్యూహం ఖరారు చేస్తోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ రెండు బేసిన్‌లలో తెలం గాణలోని చెరువులకు ఇచ్చిన 265 టీఎంసీల కేటాయింపులను సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా నెల రోజులుగా కసరత్తు చేస్తున్న అధికారులు, రాష్ట్రంలో మొత్తం 3,488 క్లస్టర్లలో గొలుసుకట్టు చెరువులున్నాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 559 మండలాల పరిధిలో ప్రభు త్వ, ప్రైవేటు, అటవీ భూముల్లో కలిపి 48,843 చెరువులున్నాయి.

ఇందులో 12,154 గొలుసుకట్టు మార్గా లుండగా, వీటి పరిధిలో 27,814 చెరువులున్నాయి. మరో 16,771 గొలుసుకట్టు మార్గం లేని వివిక్త చెరు వులు. వీటిని వదిలేసి గొలుసుకట్టుగా ఉన్న చెరువుల మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. ఈ గొలుసుకట్టులో ఉన్న మొదటి చెరువును గుర్తించి, దాన్ని ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేసేలా మ్యాపింగ్‌ ప్రక్రియ చేస్తు న్నారు. ప్రాజెక్టుల కింద ఏ కాల్వ నుంచి ఏయే చెరువులను నింపవచ్చన్నది ఖరారు చేస్తున్నారు. రాబోయే నాలుగైదు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. జూన్‌నాటికి కాళే శ్వరం నీళ్లు వచ్చే అవకాశాల దృష్ట్యా ప్రాజెక్టు పరిధిలోని 500లకు పైగా చెరువులతో పాటు, ఎస్సారెస్పీ పరిధిలోని చెరువులన్నింటినీ నింపేలా పనులు కొనసాగాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

అనుసంధానం..ఆచరణీయం
కృష్ణా,గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే ప్రతి నీటిచుక్కను వినియోగంలోకి తేవడం, నీటి నిల్వలను పెంచడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. బేసిన్‌లోని ఉప నదుల్లో లభ్యత నీటిని ఎక్కడికక్కడ నిల్వ చేసేలా ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఏడాదంతా చెరువులు నీటితో కళకళలాడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలకు నీటిపారుదల శాఖ ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధంచేసి క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తోంది.

చెక్‌డ్యామ్‌లేశరణ్యం...
కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయగా, కర్ణాటక ఇదే తరహా వ్యూహంతో ముందుకు పోతోంది. ఈ రాష్ట్రాలనే అనుసరిస్తూ, చిన్నచిన్న వాగుల పరిధిలో ఎక్కడికక్కడ నీటిని ఒడిసి పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా బేసిన్‌ పరిధిలో 311 నీటి ప్రవాహ వాగులు (స్ట్రీమ్స్‌) ఉండగా, వాటి పొడవు 5,700 కిలోమీటర్లు ఉంది. వీటి పరిధిలో ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు, 156 ఆనకట్టలు ఉండగా, కొత్తగా 250 వరకు చెక్‌డ్యామ్‌లు నిర్మించే అంశంపై కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇక గోదావరి పరిధిలో 372 వాగులు 6,481 కి.మీ.ల పొడవున విస్తరించి ఉండగా, 229 చెక్‌డ్యామ్‌లు, 89 ఆనకట్టలు ఉన్నాయి.

ఇక్కడ 250 నుంచి 300 చెక్‌డ్యామ్‌లు కొత్తగా నిర్మించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో మూసీ, ఓకచెట్టి వాగు, పెద్దవాగు, బూగ వాగు, డిండి వాగు, గుడిపల్లి వాగు, కాగ్నా, కందుకూర వాగుల పరిధిలో, గోదావరి బేసిన్‌లోని మంజీర, మానేరు, తాలిపేరు, లెండి, పెన్‌గంగ, బొమ్మారావు వాగు, ఘనపూర్‌ వాగు, గొబ్బాల్‌ వాగు, కిన్నెరసాని, లోటు వాగుల పరిధిలో ఎక్కువగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేసుకునే అవకాశాలను గుర్తించారు. అయితే హైడ్రాలజీ లెక్కలు, నీటి లభ్యత ఆధారంగా ఎక్కడెక్కడ వీటి నిర్మాణం చేయొచ్చో అంచనా వేయాలని ఇప్పటికే జిల్లాల ఇంజనీర్లకు బాధ్యతలు కట్టబెట్టారు.

ప్రాజెక్టుల పరీవాహకంలో ఉన్న వాగులను ప్రథమ ప్రాధాన్యత కింద ఎంపిక చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న చెరువులు, జలాశయాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగినంత నీటి లభ్యతఉన్న వాగులపై చెక్‌డ్యామ్‌లను ప్రతిపాదించనున్నారు. చెక్‌డ్యామ్‌ల మధ్య దూరాన్ని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయించనుండగా, ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో షేక్‌హ్యాండ్‌ చెక్‌డ్యామ్‌లు ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తి చేయనున్నారు. 

కొత్త చెక్‌డ్యామ్‌లు
కృష్ణా బేసిన్‌ పరిధిలో250 

గోదావరి పరిధిలో 300

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement