జిల్లా ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను అవినీతి పాపం వెంటాడుతోంది. టీడీపీ హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పేరుతో చేపట్టిన ఫైబర్ చెక్ డ్యామ్‌లు తెలుగు తమ్ముళ్ల దోపిడీ అడ్డాగా నిలిచాయి. అవినీతిని అడ్డుకోవాల్సిన అధికారులు ఆ ఊబిలో కూరుకుపోయారు. తిలాపాపం.. తలా పిడికెడు చందంగా అధికార యంత్రాంగం అవినీతిలో భాగస్వామ్యం అయింది. రూ.కోట్ల వెచ్చించి చేపట్టిన చెక్ డ్యామ్‌లతో ప్రజోపయోగం లేకపోగా, నాసిరకంగా మిగిలిపోయాయి. ఆ నాటి అవినీతి పాపాల చిట్టా బయటకొస్తోంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆ ఐదేళ్లు అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. జిల్లాలో చెక్ డ్యామ్‌ల్లో అవినీతి వరద పారించారు. ఆ అవినీతిలో భాగస్వామ్యం అయిన జిల్లాలో 21 మంది ఇంజినీరింగ్ అధికారుల మెడకు ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.కోట్ల దోపిడీకి బాధ్యులై యంత్రాంగంపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా అధునాతన టెక్నాలజీ ఫైబర్ చెక్ డ్యామ్‌లు అంటూ అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు హడావుడి చేశారు. అయితే పూర్తిగా నాసిరకం మెటీరియల్ వినియోగించిన తెలుగు తమ్ముళ్లు రూ.కోట్లు కొల్లగొట్టారు. ఓ పక్క నిర్మాణం పూర్తికాకుండానే వాటి డొల్లతనం బహిర్గతమైంది. మరో పక్క దెబ్బతిన్న డ్యామ్‌లు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి.
నిర్మించిన కొద్ది నెలలకే నీటి ఉధృతిని తట్టుకోలేక కొన్ని కొట్టుకుపోతే.. మరికొన్ని చోట్ల లీకేజీలతో నీటిని నిలబెట్టలేని పరిస్థితి నెలకొంది. వెరసి ఫైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మించి ఉపయోగం లేని విధంగా మారింది. జిల్లాలో ఇరిగేషన్ శాఖలో రూ.818 కోట్ల విలువైన దాదాపు 9 వేల పనులు చేపట్టారు. అత్యధికంగా ఉదయగిరి నియోజకవర్గంలో రూ.68 కోట్లు విలువైన 208 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. నీరు–చెట్టు పథకం ద్వారా చెక్ డ్యామ్‌లన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, టీడీపీ నేతలే కాంట్రాక్టర్లుగా పనులు మొత్తం నిర్వహించారు. అప్పట్లో నేతలు స్థాయి, హోదాను బట్టి అందిన మేరకు దండుకున్నారు.
ఫైబర్ చెక్‌డ్యామ్.. అదో మాయ
జిల్లాలో ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పేరిట యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది. నీరు–చెట్టు దోపిడీ ఒక ఎత్తు అయితే ఫైబర్ చెక్ డ్యామ్‌ల అవినీతి మరో ఎత్తు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఫైబర్ చెక్ డ్యాంలు నిర్మించారు. వాస్తవానికి రూ.2 లక్షల నుంచి రూ.45 లక్షలు విలువ చేసే ఫైబర్ చెక్ డ్యామ్‌లకు రూ.70 లక్షలపైనే వెచ్చించారు. అవసరమైన చోట్లతో పాటు అవసరం లేని చోట్ల కూడా కేవలం బిల్లుల కోసం వీటిని నిర్మించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో నీరు–చెట్టు కింద 8 మండలాల్లో రూ. 39 కోట్లతో 126 చెక్ డ్యామ్‌లు నిర్మించారు.
2017–18లో రూ.29 కోట్లతో 78 చెక్ డ్యామ్‌లు నిర్మించారు. ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు మండలాల్లో నిర్మించిన చెక్ డ్యామ్‌ల్లో కేవలం నెలల్లోనే వాల్వ్‌ల లీకేజీలు, పైప్‌లు లీకులతో నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఫైబర్ చెక్ డ్యామ్‌లు ఎక్కడా లేవు. కేవలం ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాయి. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన అప్పటి ఎమ్మెల్యే తన సన్నిహితులకు చెందిన కంపెనీల నుంచి మెటీరియల్ దిగుమతి చేసుకోని ఫైబర్ చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ నిధులు భారీగా స్వాహాకు ఆస్కారం ఏర్పడినట్లు గుర్తించారు.
విజిలెన్స్ విచారణలో బహిర్గతం
జిల్లాలో నీరు–చెట్టు పథకంలో అవినీతి వరద పారిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేటతెల్లమైంది. ఫైబర్ చెక్‌డ్యామ్‌ల నాణ్యత, వాటి పనితీరు, కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న వైనం, వాస్తవ విలువ, ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీన వైఖరి తదితర అంశాలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పూడిక తీత పనులు చేయకుండానే చెక్‌డ్యాంల నిర్మాణం, అవసరం లేని చోట్ల ఏర్పాటు, చేపట్టినవి కూడా నాసిరకంగా ఉన్నాయని నిర్ధారించినట్లు సమాచారం. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనులు చేపట్టినట్లు రుజువైంది. ఆ మేరకు జిల్లాలో 21 మంది అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో 13 మంది ఏఈలు, నలుగురు డీఈలు, ఇద్దరు ఈఈలు, ఎస్‌ఈ, సీఈలను బాధ్యులను చేస్తూ తాఖీదులు జారీ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment