సాక్షి, నెల్లూరు: జిల్లాలో పది నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటమి తప్పదని సర్వేలు తేల్చేశాయి. మరో వైపు రాజకీయ విశ్లేషకులు సైతం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎదురుగాలి తప్పదని తేల్చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీకి గట్టి పోటీ అయినా ఇవ్వాలన్న ఆశతో ఓటుకు నోట్లు పెట్టి కోనుగోలు చేస్తున్నారు. అభ్యర్థులు ఆర్థిక స్తోమతను బట్టి నగదు పంపకాలు చేస్తున్నారు.నెల్లూరు నగరంలో మాత్రం మంత్రి నారాయణ ఓటుకు రూ.2 వేలు వంతున బహిరంగంగానే పంపకాలు చేస్తున్నారు.
తమ విద్యాసంస్థల ఉద్యోగుల చేత నగదు పంపకాలు చేయిస్తూ ఉంటే వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే నెల్లూరు రూరల్‌లో రూ.1000 వంతున, ఆత్మకూరులో రూ.2 వేలు, కావలిలో రూ.1000, ఉదయగిరిలో రూ.1000, వెంకటగిరిలో రూ.2వేలు, సూళ్లూరుపేట, గూడూరులో రూ.1000 వంతున ఓటుకు నగదు పంచుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుకు నోటు ఇచ్చి టీడీపీ అభ్యర్థులు కొనుగోలు చేస్తున్నా పోలీసులు మాత్రం పట్టుకోలేకపోతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగదు స్వాహా..
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థులు వారికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులను తమ నియోజకవర్గంలో బదిలీలపై వేయించుకున్నారు. ఎన్నికల సమయంలో తామెన్ని అక్రమాలు చేసినా వారు చూసీ చూడనట్లుగా ముందుగానే ఒప్పందంతోనే వచ్చినట్లు ఆరోపణలున్నాయి.ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థులు బరితెగించి ఎన్నికల సమయంలో నిబంధనలు తుంగలో తొక్కినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఓటర్లకు పంపకాలు కోసం నియోజకవర్గాలకు తరలిస్తున్న నగదును పట్టుకున్న పోలీసులు అందులో వాటాలు పుచ్చుకుని వదలివేసిన సంఘటనలున్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలీసులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది.
ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం గువ్వాడి–కాంచెరువు రహదారి మధ్యలో మూడు రోజుల క్రితం టీడీపీ అభ్యర్థికి చెందిన రూ.కోటి నగదును ఓటర్లకు పంపకాల కోసం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం వెలుగులోకి రాకుండా స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పోలీసుల వద్ద పైరవీలు చేసి రూ.10 లక్షలు వారికి సమర్పించుకుని రూ.90 లక్షల తీసుకెళ్లినట్లు ప్రచారం జోరుగా ఉంది.
వరికుంటపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి వద్ద ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ టీడీపీ నేతలు నగదు పంపకాలు చేస్తుండగా పట్టుకుని వారి వద్ద నున్న రూ.1.5 లక్షలు తీసుకుని వెళ్లినట్లు ఆరోపణలున్నాయి.
ఆత్మకూరు నియోజకవర్గంలో అనంతసాగరం మండలంలో ఇటీవల టీడీపీ అభ్యర్థికి చెందిన సమీప బంధువు ఓటర్లకు నగదు పంపకాలు చేస్తున్న సమయంలో రూ.8.5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. అయితే అందులో రూ.7 లక్షల నగదు పక్కదారి పట్టించి రూ.1.5 లక్షలు పట్టుకున్నట్లుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉద్యోగులు వద్ద రూ.20 లక్షలు పట్టుబడినా పోలీసులు కొంత నగదు తీసుకుని వదలివేసినట్లు ప్రచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment