ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనుల టెండర్ల వ్యవహారమంతా అడ్డగోలుగా మారింది. పనులపై ప్రభుత్వ నజర్ లేకపోవడంతో జిల్లాల్లో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన అధిక ధరలకు కోట్ చేసి పనులు దక్కించుకుంటున్నారు. చాలా జిల్లాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో సిండికేట్‌గా మారుతున్నారు. ఎవ రికే పని దక్కాలో ముందుగానే నిర్ణయమైపోతోంది. అందుకనుగుణంగా 3 నుంచి 4% వరకు అధిక ధరలకు కోట్ చేసి పనులు చేజిక్కించుకుంటున్నారు. పలుచోట్ల కేవ లం 2 టెండర్లు మాత్రమే దాఖలు కావడం సిండికేట్ అయ్యారనడానికి నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 632 చెక్‌డ్యామ్‌లను రూ. 2,890 కోట్లతో చేపట్టాలని నిర్ణయించి ఇప్పటికే సాంకేతిక అనుమతుల ప్రక్రియ పూర్తిచేశారు. ఇందులో గోదావరి బేసిన్‌లో 444, కృష్ణాబేసిన్‌లో 188 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు 625 పనులకు టెండర్లు పిలవగా, 560 చెక్‌డ్యామ్‌ల టెండర్లు ఖరారు చేశారు. ఇందులో 450 చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి. అయితే టెండర్‌ల దాఖలు విషయంలో సంబంధిత జిల్లాలోని ప్రధాన కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి ఎక్సెస్ ధరలకు వాటిని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఒకే నది లేక వాగుపై ఉండే మూడు, నాలుగు చెక్‌డ్యామ్‌లను కలిపి ఒక క్లస్టర్‌గా చేశారు. ఇవన్నీ భారీ వ్యయంతో కూడుకున్నవి కావడంతో వాటన్నింటినీ ఎక్సెస్ ధరలకే దక్కించుకునేలా కాంట్రాక్టర్లు పావులు కదిపారు.
కరీంనగర్‌లో ‘రింగు’రింగా...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలివిడతలో 114 చెక్‌డ్యామ్‌లను రూ.854 కోట్లతో పూర్తిచేయాలని నిర్ణయించారు. ఇందులో గోదావరి ఉపనది మానేరులో ఏడాదంతా నీరు నిలిచి ఉండేలా 29 చెక్‌డ్యామ్‌లు, మూలవాగుపై 12 ప్రతిపాదించారు. వీటికి విడివిడిగా టెండర్లు పిలవాలని తొలుత భావించినా, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక నదిపై నిర్మించే చెక్‌డ్యామ్‌లన్నింటినీ ఒక క్లస్టర్‌గా చేసి వాటన్నింటికీ కలిపి ఒకే టెండర్ పిలిచారు. ఈ విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 పనులను 18 క్లస్టర్ల కింద చేర్చి రూ.380 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో అత్యధికంగా మానేరుపై కరీంనగర్ బ్రిడ్జికి సమీపంలో 5 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.75.48 కోట్లతో టెండర్లు పిలవగా దీనిని 2.34 శాతం ఎక్సెస్‌తో జిల్లా నేత దగ్గరి బంధువులు దక్కించుకున్నారు.
కరీంనగర్ మండల పరిధిలోనే ఇరుకుల్లవాగుపై 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి 15.40 కోట్లతో టెండర్లు పిలవగా, ఇక్కడ సైతం 4.50 శాతం ఎక్సెస్‌తో టెండర్ దక్కించుకున్నారు. ఈ రెండు చోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీతో పాటే మరో ఏజెన్సీ మాత్రమే టెండర్ వేయడం గమనార్హం. ఇక మంథని మండల పరిధిలో మానేరు వాగుపై మరో 3 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.42.38 కోట్లతో టెండర్లలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు ఇద్దరే టెండర్లలో పాల్గొనగా, 3.78 శాతం ఎక్సెస్‌తో స్థానిక నేత చెప్పిన ఏజెన్సీకే టెండర్ దక్కింది. ఇదే రీతిన మానుకొండూర్ నియోజకవర్గ పరిధిలో రూ.38.45 కోట్ల విలువైన రెండు చెక్‌డ్యామ్ పనులను 2.69శాతం, జమ్మికుంట మండల పరిధిలోని రూ.60.73 కోట్ల పనులకు (3 చెక్‌డ్యామ్‌లు) 2.88 శాతం అధికంగా టెండర్‌లు వేశారు.
కస్లర్‌ల పరిధిలో లేకుండా ఒక్కొక్కటిగా ఉన్న చెక్‌డ్యామ్‌ల టెండర్లు మాత్రం కనిష్టంగా ఒక శాతం నుంచి 18 శాతం వరకు లెస్ టెండర్లు దాఖలయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్‌కు రూ.60 కోట్లు, కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత బంధువు ఏజెన్సీకి రూ.70 కోట్లు, ఇదే జిల్లాలో ఓ ప్రధాన ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన మరో ఏజెన్సీకి రూ.75 కోట్లు, మరో ముఖ్య నేతకు చెందిన ఏజెన్సీకి రూ.75 కోట్ల పనులు దక్కాయి. మొత్తంగా ఎక్సెస్ దాఖలు చేసిన పనుల టెండర్‌ల విలువ రూ.380 కోట్లుగా ఉండగా, అధిక ధరలతో కోట్ చేయడంతో ప్రభుత్వంపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది.
నిజామాబాద్‌లో మూడు ఏజెన్సీలకే ...
ఇక నిజామాబాద్ జిల్లాలో అయితే చెక్‌డ్యామ్‌ల టెండర్లలో మరీ విపరీతంగా ప్రవర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 చెక్‌డ్యామ్ పనులకు ఇప్పటివరకు రూ.250 కోట్లతో టెండర్లు పిలవగా మూడు, నాలుగు ఏజెన్సీలకే మొత్తం పనులు పంచేశారు. జిల్లాలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులకు దగ్గరగా ఉన్న ఈ ఏజెన్సీలు ముందుగానే పర్సెంటేజీలు మాట్లాడుకొని అధిక ధరలకు టెండర్లు కోట్ చేసి పనులు దక్కించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం పనుల్లో రూ.100 కోట్లు, 60 కోట్లు, 50 కోట్లు విలువైన పనులను మూడు ఏజెన్సీలకే కట్టబెట్టారు. ఇవన్నీ ఎక్సెస్‌తోనే కావడం గమనార్హం. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే 47.59 కోట్ల పనులకు టెండర్లు పిలవగా, రెండే ఏజెన్సీలు టెండర్‌లు దాఖలు చేశాయి.
అయితే విచిత్రంగా ఈ రెండు ఏజెన్సీలు తమకు దక్కిన పనులను 3.99 శాతం ఎక్సెస్‌తోనే పొందాయి. ఇదే నియోజకవర్గంలో మరో 16 పనులను ఒకే క్లస్టర్ కిందకి చేర్చి 35 కోట్లతో టెండర్లు పిలవగా, 4.59 శాతం ఎక్సెస్‌తో ఓ ఏజెన్సీ టెండర్లు దక్కించుకుంది. ఇదే ఏజెన్సీకి పక్కనే ఉన్న జుక్కల్ నియోజకవర్గంలోని 53.43 కోట్ల పనులు, బాన్సువాడ నియోజకవర్గంలోని రూ.24.34 కోట్ల పనులు అదే 4.59 శాతం అధిక ధరలతో దక్కేలా జిల్లా కీలక నేతలేæ చక్రం తిప్పారు. జిల్లాకు చెందిన ముఖ్యనేతకు దగ్గరగా ఉండే మరో ఏజెన్సీకి సైతం ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని మొత్తం రూ.50 కోట్ల విలువ చేసే చెక్‌డ్యామ్‌లను కట్టబెట్టారు. మరికొన్ని చోట్ల చిన్న కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా, వారిపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలమైన స్థానిక కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టు ఇప్పించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇతర జిల్లాల్లోనూ ఇదే తంతు
ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే రీతిన స్థానిక ప్రజాప్రతినిధులు ముందుగానే ఏజెన్సీలతో మాట్లాడుకొని ఎక్సెస్ ధరలకు టెండర్లు వేయించారు. వరంగల్ జిల్లాలో ఓ కీలక నేత తన సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్‌కు రూ.52 కోట్ల విలువైన చెక్‌డ్యామ్‌ల పనులు ఇప్పించారు. నల్లగొండ జిల్లాలోనూ వరంగల్, కరీంనగర్‌కు చెందిన కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికే రూ.100 కోట్ల విలువైన పనులను 4 శాతానికి మించి ఎక్సెస్‌కు ఇప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment