బాబు ప్రతిపాదనపై కరుణ అభ్యంతరం
చెన్నై: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య ఏర్పడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. దీనివల్ల తమిళనాడులోని మూడు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని కరుణానిధి చెప్పారు. వేలూరు, తిరువళ్లూరు, కాంచీపూరం జిల్లాల ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడ్డారని అన్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కరుణానిధి స్పందించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా అప్పటి యూపీఏ భాగస్వామ్య పక్షాలు డీఎంకే, పీఎంకే వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారని కరుణానిధి గుర్తు చేశారు. 2008లో సుప్రీం కోర్టు ఈ కేసును విచారించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి సూచించిందని చెప్పారు. కేంద్ర జలసంఘం ఈ వివాదాన్ని పరిష్కరించేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లరాదని కేంద్రం సూచించిందని తెలిపారు. తమిళనాడు ప్రజల అంటే చంద్రబాబుకు అభిమానముందని, చెన్నై నగర వాసుల తాగునీటి కోసం తెలుగు గంగ ప్రాజెక్టును అభివృద్ధి చేశారని అన్నారు. చంద్రబాబు పాలార్ పై డ్యామ్ ప్రతిపాదన చేయడాన్ని నమ్మలేకపోతున్నాని కరుణనిధి చెప్పారు.