సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ చేపట్టిన మాదిరే ఈ ఐదేళ్ల కాలంలో యుద్ధ ప్రాతిపదికన చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 35వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ పూర్తయిన దృష్ట్యా, ఇకపై ప్రతినీటి బొట్టును చెరువుకు మళ్లించేలా ప్రాజెక్టు కాల్వల నుంచి తూముల నిర్మాణం, అవసరమైన చోట్ల వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండు దఫాలుగా అధికారులకు మాస్టర్ ప్లాన్ వివరించగా, ఇరిగేషన్ ఇంజనీర్లు సైతం వర్క్‌షాప్‌లు నిర్వహించి రాష్ట్రంలో చెక్‌డ్యామ్, తూముల నిర్మాణంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తున్నారు.
కృష్ణా బేసిన్‌లో 250 చెక్‌డ్యామ్‌లకు చాన్స్
కృష్ణా బేసిన్‌లో 311 నీటి ప్రవాహ వాగులపై ఇప్పటికే 281 చెక్‌డ్యామ్‌లు ఇప్పటికే ఉండగా, మరో 250 వరకు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇక ఇదే బేసిన్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతుండగా, ఆ ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలను, సమీప చెరువులకు అనుసంధానించి, ఇందుకు అవసరమైన చోట తూముల నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టుల కాల్వల నుంచి సుమారు 3 వేల చెరువులను నింపే అవకాశాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక గోదావరి బేసిన్‌లో ఇప్పటికే 372 ప్రధాన వాగులను గుర్తించగా, వీటిపై 229 చెక్‌డ్యామ్‌లు ఉండగా, మరో 200 నుంచి 300 కొత్త చెక్‌డ్యామ్‌లు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఎస్సారెస్పీ పరిధిలో 19 తూములకు ఓకే..
ఇక కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీ, వరద కాల్వ ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే ఎస్సారెస్పీ పరిధిలో కొత్తగా 19 తూముల నిర్మాణానికి లైన్‌క్లియర్ అయింది. మిగతా చోట్ల తూముల నిర్మాణంపై సర్వే జరుగుతోంది. 15 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి బడ్జెట్‌లో ఈ పనులకే రూ.వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాన్ని బట్టి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం లేని పక్షంలో భారీ ప్రాజెక్టులకు తీసుకుంటున్న మాదిరే బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి.
చెక్‌డ్యామ్‌లు.. తూముల నిర్మాణం
Published Wed, Feb 20 2019 2:34 AM | Last Updated on Wed, Feb 20 2019 2:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment