ఇరిగేషన్ ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధులు అరకొరే
కేంద్రమే ఇస్తుందంటూ పోలవరానికి రూ.4,873 కోట్లు కేటాయింపు
చింతలపూడి, వెలిగొండ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2లకు కేటాయింపులు తక్కువే
సాక్షి, అమరావతి: భారీ నీటిపారుదల శాఖలో పోలవరం మినహాయిస్తే ఇతర ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ.4,873 కోట్లు కేటాయించింది. వంశధార స్టేజ్–2, చింతలపూడి ఎత్తిపోతలు, వెలిగొండ, హంద్రీ–నీవాకు అరకొరగా నిధులే విదిల్చింది. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2024–25 బడ్జెట్‌లో భారీ నీటిపారుదల రంగానికి (మేజర్ ఇరిగేషన్) రూ.15,483.35 కోట్లు, చిన్న నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్) రంగానికి రూ.1,221.97 కోట్లు కలిపి మొత్తంగా జలవనరుల శాఖకు ప్రభుత్వం రూ.16,705.32 కోట్లు కేటాయించింది.
ఇప్పటికే పోలవరానికి రూ.2,807.68 కోట్లిచ్చిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టుకు 2024–25లో రూ.7,218.68 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రూ.4,841.93 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ.. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపి రూ.4,873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం ఇప్పటికే అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు, రీయింబర్స్‌మెంట్ రూపంలో రూ.459.68 కోట్లు వెరసి మొత్తం రూ.2,807.68 కోట్లను అక్టోబర్ 9న విడుదల చేసింది. ఇందులో 75 శాతం ఖర్చు చేసి, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపితేనే నిధులు విడుదల చేస్తామని షరతు విధించింది.
వీటికి అరకొర కేటాయింపులే
⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువకు లైనింగ్ పనులకు రూ.2,516 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.867.75 కోట్లను కేటాయించింది.
⇒ జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలంటే రూ.3,782 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదలు పంపారు. ప్రభుత్వం రూ.150 కోట్లనే కేటాయించింది.
⇒ గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి చేసి.. సాగర్ కుడి కాలువ ఆయకట్టును స్థిరీకరించాలంటే రూ.4,966.09 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.
⇒ వెలిగొండ తొలి దశ పనులకు రూ.1,458 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. రూ.393.49 కోట్లు కేటాయించింది.
⇒ వంశధార స్టేజ్–2లో మిగిలిన పనుల పూర్తికి రూ.134.32 కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌లో రూ.92.12 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.63.50 కోట్లు కేటాయించడం గమనార్హం.
ఉత్తరాంధ్ర, సీమకు తీవ్ర అన్యాయం
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. పోలవరం ఎడమ కాలువను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకముందే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలను తెస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. దీనికి కేవలం రూ.63 కోట్లే కేటాయించారు. ఇక రాయలసీమలో తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోపాటు తెలుగుగంగ, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment