చెరువులు, చెక్ డ్యాంలకు నీరందిస్తాం
మంత్రి పరిటాల సునీత వెల్లడి
రాప్తాడు :
పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ధర్మవరం కుడికాలువ కింద ఉన్న 49 చెరువులతో పాటు 100 చెక్ డ్యాంలను పూర్తి స్థాయిలో నీటితో నింపుతామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ధర్మవరం కుడికాలువలో ఉన్న ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలను శ్రమదానం ద్వారా తొలగించారు. మంత్రి సునీతతో పాటు అధికారులు, టీడీపీ నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ఉపాధి కూలీలు స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావం వల్ల భూగర్భజలాలు అడుగంటాయని, వరుస కరువుతో అల్లాడుతున్న ప్రజలు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరి కోటా నీరు వారికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువకు నీటిని విడుదల చేయగానే రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కాలువ దగ్గర కాపలాగా ఉండి ఘర్షణలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. కమిటీని ఏర్పాటు చేసి ఒకచెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీటిని అందిస్తామన్నారు.
అక్టోబర్ 15 నుంచి అన్ని చెరువులకూ నీటిని విడుదల చేస్తామని ఇదివరకు చెప్పామని, అయితే ప్రస్తుతం పీఏబీఆర్ లో ఒక టీఎంసీ మాత్రమే ఉందని, ఆ నీటిని విడుదల చేస్తే కాలువకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. మరో పది రోజులు ఆలస్యమైనా హంద్రీనీవా నీటిని జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా డ్యాంలోకి మరొక రెండు టీఎంసీల నీటిని తీసుకొచ్చి తాగునీటి కోసం అన్ని చెరువులకూ నింపుతామని, రెండో విడతలో సాగుకు అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి నారాయణస్వామి, తహశీల్దార్ హరికుమార్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, డ్వామా ఏపీడీ నాగభూషణం, ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, వైస్ ఎంపీపీ గవ్వల పరంధామ, హెచ్చెల్సీ డీఈలు పాండురంగారావు, జేఈలు శివశంకర్, మండల కన్వీనర్ సాకే నారాయణస్వామి పాల్గొన్నారు.