తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొన్నింటిలో...
ప్రపంచబ్యాంకును కోరిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కొన్నింటిలో భాగస్వామ్యం పంచుకునేందుకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొత్త విద్యుత్తు ప్లాంట్లపై తమ ఆసక్తిని కనబరిచింది. అందుకు అవసరమైన నిధుల సమీకరణకు తమ సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది.
బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మతో ప్రపంచ బ్యాంకు అధికారి అంకుర్‌శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, ప్లానింగ్ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు... ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను సీఎస్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఉన్నాయని.. అందుకే 14వ ఆర్థిక సంఘం రెవెన్యూ మిగులు రాష్ట్రంగా గుర్తించిందని తెలిపారు. కానీ.. కొత్త రాష్ట్రం కావటంతో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు నిధుల సర్దుబాటు అవసరాన్ని అంశాల వారీగా విశ్లేషించారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, విద్యుత్తు ప్లాంట్లతో సిద్ధించే భవిష్యత్తు ప్రయోజనాలు.. ఆర్థిక లాభనష్టాలను చర్చించారు.
ప్రపంచబ్యాంకు మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టులకు ఆర్థికంగా సాయం అందించాలని అధికారులు కోరారు. ఈ చర్చల సందర్భంగా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి ప్రపంచబ్యాంకు నుంచి రుణసాయం కోరినట్లు అధికారులు వివరించారు. కాగా, రాష్ట్రంలోని గిరిజనులు, ఇతర అట్టడుగువర్గాల అభ్యున్నతికి వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ బృందం త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, ఉట్నూరు, నల్లగొండ జిల్లాలోని చందంపేట, దేవరకొండ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయనుంది.