Lakes Works
-
మినీ ట్యాంక్‌బండ్‌తో మెదక్‌కు కొత్త అందాలు
రూ.10కోట్లతో రూపుదిద్దుకోనున్న పనులు మెదక్ : మెదక్ పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది. పట్టణాభివృద్ధికోసం భారీగా నిధులు మంజూరు కావడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.9.52కోట్ల నిధులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించారు. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పూర్తయితే సాయంత్రం వేళలో పట్టణ ప్రజలు సేదదీరేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండు చెరువు కట్టలపై ఫ్లైఓవర్ నిర్మించి, సందర్శకులు సేదతీరేందుకు అక్కడకక్కడా కుర్చీలు ఏర్పా టు చేయనున్నారు. ఇప్పటికే మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి, చరిత్రాత్మక కట్టడాలు గల ఖిల్లా, సమీపంలోనే పోచారం అభయారణ్యం ఉన్నాయి. మెదక్ పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో వారంతపు సెలవుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. చకచకా చెరువుల పనులు పట్టణంలోని మల్లం చెరువు, బంగ్లా చెరువుల అభివృద్ధికీ ప్రభుత్వం రూ.1.70కోట్ల నిధులు విడుదల చేసింది. మల్లం చెరువుకు 70 ఎకరాల ఆయకట్టు ఉండగా, చెరువు శిఖం చాలా వరకు ఆక్రమణకు గురైంది. అలాగే పట్టణ శివారులోని ఇందిరా కాలనీలోని బంగ్లా చెరువు కింద 18 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కట్టమీదుగానే మండలంలోని మక్తభూపతిపూర్, తిమ్మానగర్, శివ్వాయిపల్లి గ్రామాలకు ప్రజలు వేళ్లేందుకు ప్రధానదారి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చెరువు మరమ్మతులు, తూముల బలోపేతం, కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే మెదక్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. -
రెండో విడత ‘మిషన్’కు సర్వం సిద్ధం!
* సంక్రాంతి తర్వాత చెరువుల పనులు వేగవంతం * ఈసారి 10,355 చెరువుల పునరుద్ధరణ టార్గెట్ * ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి ఉమాభారతి రాక డౌటే! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత చెరువుల పునరుద్ధరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది. ‘మిషన్ కాకతీయ’ పథకం కింద చెరువుల పనులను చేపట్టేందుకు చిన్న నీటి పారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకున్న చెరువుల్లో సుమారు అరవై చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. ఈ నెల మూడో వారం ముగిసే నాటికి రెండు వేల చెరువులకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అనంతరం ప్రతి వారం 500కు పైగా చెరువులకు అనుమతులిస్తూ, అదే సమయంలో పనులు మొదలు పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. మిగిలిపోయినవాటితో కలిపి.. గతేడాది ‘మిషన్ కాకతీయ’ తొలి విడతలో భాగంగా 9,586 చెరువుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకోగా... అందులో 8,817 చెరువుల పనులను మాత్రమే చేపట్టగలిగారు. మిగతా 769 పనులను రెండో విడతలో కలపాలని నిర్ణయించారు. ఈ లెక్కన రెండో విడతలో మొత్తంగా 10,355 చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నారు. అయితే తొలి విడత పనుల్లో చెరువుల పూడికతీత ముగిసినా, కాలువల మరమ్మతులు, వియర్ల నిర్మాణం వంటివి ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అధికారుల లెక్కల మేరకు మొత్తంగా రూ. 2,200 కోట్ల పనుల్లో రూ. 1,200 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో రూ.వెయ్యి కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులన్నింటినీ మార్చి నాటికి వంద శాతం పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో విడతలో చెరువుల పునరుద్ధరణకు రూ.2,083 కోట్లు ఖర్చు చేయనున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏయే ప్రక్రియను ఎప్పట్లోగా పూర్తి చేయాలన్నది ఇప్పటికే నిర్ణయించారు. వాస్తవానికి రెండో విడతలో 40 శాతం పనులను జనవరి 7 నాటికి ప్రారంభించాలని భావించినా... మొదటి విడత పనుల్లో అధికారులు బిజీగా ఉండటంతో రెండో విడతపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం తొలివిడత పనులు ముగింపు దశకు రావడం, రెండో విడత చెరువుల అంచనాలు సైతం జిల్లాల నుంచి సీఈ కార్యాలయాలకు చేరుతుండటంతో వాటి పరిశీలన జరుగుతోంది. ఉమాభారతి వచ్చేనా..? ఈ నెల 16న రెండో విడత మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి ఉమాభారతి వస్తానని ఇంతకుముందే హామీ ఇచ్చారు. కానీ ఆమె ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల హడావుడి, అధికార టీఆర్ఎస్ ప్రధానంగా బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే తన పర్యటనను ఉమాభారతి రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కోటి దాటితే కొండెక్కినట్టే!
అంచనా విలువ రూ. కోటి దాటిన చెరువుల పనులు పక్కకు పెట్టే యోచన అంచనాల పరిశీలనకు సమయం లేకపోవడమే కారణమంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కోటి రూపాయల గరిష్ట అంచనావిలువ లు ఉండే పనులను పక్కనపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోటి ఆపైన ఉండే చెరువుల పనులకు ప్రస్తుత పరిస్థితిలో సూక్ష్మ పరిశీలన చేయడం సాధ్యంకాని దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన ను ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత నుంచి తొలగించింది. ఈ పనుల అంచనాలు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో వీటికి ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,545 చెరువులపై అధి కారులు సర్వే చేయగా 1917 చెరువులకు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో 1,209 చెరువులకు సంబంధించిన అంచనా నివేదికలు చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.632 కోట్లుగా ఉంది. చీఫ్ ఇంజనీర్ల కార్యాలయాలకు వచ్చిన అంచనాల నివేదికలను ఉన్నత స్థాయిలో పరిశీలన చేసి 500 చెరువుల అంచనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా ఇందులో 304 చెరువులకు టెండర్లు పిలిచే ప్రక్రియ ముగిసింది. అయితే క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న అంచనాల్లో చాలా చోట్ల లొసుగులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిపై పునఃపరిశీలకు ఆదేశించింది. ఇదిలా ఉండగా రూ.కోటికి మించి వచ్చే ప్రతిపాదనలపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయడం సాధ్యం కాని దృష్ట్యా వాటన్నింటినీ పక్కకు పెట్టేస్తున్నారు. దేవాదుల, జూరాల, ఎస్సారెస్పీ, మానేరు, ఏఎంఆర్పీ ప్రా జెక్టుల కింద నీటిని నింపిన పెద్ద చెరువులు వం దల్లో ఉన్నాయి. రూ.కోటి దాటిన అంచనాలతో 200 వరకు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మినీ ట్యాంక్‌బండ్‌లకు సంబంధించి మరో 50 నుంచి 100 వరకు ప్రతిపాదనలు రూ.కోటికి మించిన అంచనాలతో నీటిపారుదల శాఖకు చేరాయి. వీటన్నింటినీ అధికారులు పక్కనపెట్టేశారు. తొలి దశ పనులు మొదలయ్యాక జనవరి రెండో వారం తర్వాత వీటిపై పూర్తి స్థాయి పరి శీలన జరిపి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.