మినీ ట్యాంక్‌బండ్‌తో మెదక్‌కు కొత్త అందాలు
రూ.10కోట్లతో రూపుదిద్దుకోనున్న పనులు
మెదక్ : మెదక్ పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది. పట్టణాభివృద్ధికోసం భారీగా నిధులు మంజూరు కావడంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులను మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.9.52కోట్ల నిధులను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మంజూరు చేయించారు. దీంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పూర్తయితే సాయంత్రం వేళలో పట్టణ ప్రజలు సేదదీరేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండు చెరువు కట్టలపై ఫ్లైఓవర్ నిర్మించి, సందర్శకులు సేదతీరేందుకు అక్కడకక్కడా కుర్చీలు ఏర్పా టు చేయనున్నారు.
ఇప్పటికే మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్‌ఐ చర్చి, చరిత్రాత్మక కట్టడాలు గల ఖిల్లా, సమీపంలోనే పోచారం అభయారణ్యం ఉన్నాయి. మెదక్ పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో వారంతపు సెలవుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు.
చకచకా చెరువుల పనులు
పట్టణంలోని మల్లం చెరువు, బంగ్లా చెరువుల అభివృద్ధికీ ప్రభుత్వం రూ.1.70కోట్ల నిధులు విడుదల చేసింది. మల్లం చెరువుకు 70 ఎకరాల ఆయకట్టు ఉండగా, చెరువు శిఖం చాలా వరకు ఆక్రమణకు గురైంది. అలాగే పట్టణ శివారులోని ఇందిరా కాలనీలోని బంగ్లా చెరువు కింద 18 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు కట్టమీదుగానే మండలంలోని మక్తభూపతిపూర్, తిమ్మానగర్, శివ్వాయిపల్లి గ్రామాలకు ప్రజలు వేళ్లేందుకు ప్రధానదారి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చెరువు మరమ్మతులు, తూముల బలోపేతం, కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణాలు పూర్తయితే మెదక్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.