కోలారు : రాష్ట్ర వ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వచ్చే చెరువులలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖా మంత్రి శివరాజ్ తంగడిగి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ చెరువులలో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆక్రమణ దారులు ఎంతటి స్థానంలో ఉన్నా ఉపేక్షించబోమని అన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి త్వరలో తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదని ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కోలారు జిల్లాలో ఆగిన చెరువుల ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
కోలారు చెరువులకు నీటిని తీసుకు వచ్చే విషయంపై డిపిఆర్ సిద్ధమవుతోందని, ఈ నెల 16వ తేదీ తరువాత ముఖ్యమంత్రితో సమావేశమై టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కోలారుకు చల్లఘట్ట, లేదా ఎలెమల్లప్ప చెరువు నుంచి నీరు తీసుకు రావాలా అనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బెంగుళూరు వచ్చిన సమయంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కాంగ్రెస్ రహిత కర్ణాటకగా మారుస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ నాయకులు కలలు కంటున్నారని అది ఎప్పటికి సాధ్యం కాదన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తరువాత ఆరు నెలల్లో చేసిందేమి లేదని విమర్శించారు.
చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తాం
Published Wed, Jan 7 2015 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement