అదే అసమ్మతి
సీఎల్పీ సమావేశంలో మంత్రులపై విరుచుకుపడిన శాసనసభ్యులు
మంత్రిమండలిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్
విమర్శలకు కలత చెంది బయటికి వచ్చిన మంత్రి శివరాజ్ తంగడి
బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా అసమ్మతి తగ్గలేదు. శాసనసభ్యులకు, మంత్రుల మధ్య ఉన్న భేదాలు శాసనసభాపక్షం సాక్షిగా మరోసారి శుక్రవారం బయటపడ్డాయి. మంత్రిమండలిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించి సమర్థులైన నాయకులకు పదవులు కట్టబెట్టాలనే డిమాండ్‌పై ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి విధానసౌధాలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సమావేశం ప్రారంభమైన వెంటనే విప్ పీఎం అశోక్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మాత్రమే సమావేశంలో చర్చించాల్సిందిగా కోరారు. శాసనసభ్యులు ఎవరూ మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయకూడదని సూచించారు. ఇందుకు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ అభిప్రాయలకు విలువనివ్వకుండా ‘మీరు చెప్పడానికి మేం వినడానికి’ అన్నట్లు సీఎల్పీ నిర్వహించడం ఎందుకు అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన సీఎం సిద్ధు ప్రతి సభ్యున్ని మాట్లాడటానికి అవకాశం కల్పిస్తామని.. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా తమ అభిప్రాయాలను సూటిగా చెప్పాలని సూచించారు.
దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ...‘ఎన్ని సీఎల్పీ సమావేశాలు జరిగినా మంత్రుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అభివృద్ధి పనుల కేటాయింపు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులకు ఇచ్చిన మర్యాద కూడా స్వపక్షనాయకులైన మాకు ఇవ్వడం లేదు. వెంటనే మంత్రి మండలిలో ప్రక్షాలన చేపట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలకు అందుబాటులోలేని మంత్రులను తొలగించి సమర్థులైన నాయకులను మంత్రి మండలిలో స్థానం కల్పించాలి. లేదంటే పార్టీ మనుగడ కష్టం’ అని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన సీఎల్పీ సమావేశం వలే తాజా సమావేశంలో కూడా చిన్ననీటిపారుదలశాఖ మంత్రి శివరాజ్‌తంగడిపై యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్‌తోపాటు పలువురు నాయకులు విరుచుకుపడ్డారు. ఆయన ప్రతి పనికీ కమిషన్ వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సభ నుంచి కొద్ది సేపు బయటకు వచ్చిన ఆయన దాదాపు అరగంట తర్వాత తిరిగి సీఎల్పీకు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో దార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేలా వివాదాస్పద బిల్లు రూపొందించి న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి వ్యతిరేకత మూటగట్టించారిని...గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ, ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.
ఇదిలా ఉండగా గ్రామపంచాయతీల పునర్వవస్థీకరణకు సంబంధించి నంజయ్యమఠ్, రామేష్‌కుమార్ కమిటీలు ప్రభుత్వానికి అందజేసిన నివేదికల ప్రకారం అధికార వికేంద్రీకరణకు గ్రామపంచాయతీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చాలా మంది నాయకులు అభిప్రాయడ్డారు. ప్రతి ఐదు కిలోమీరటర్ల పరిధిలో ఒక గ్రామపంచాయతీ ఉండటంతో పాటు సగటున 5,375 మంది జనాభా ఉండటం ఉత్తమమని తెలిపారు. దీని వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5,629 గ్రామపంచాయతీల సంఖ్య 6,068కు పెరుగుతుందని అందువల్ల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో పారదర్శకత పెరుగుతుందని కోళివాడ, మాలకరెడ్డి వంటి సీనియర్‌నాయకులతో పాటు మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.