అసమ్మతిచిచ్చు
మంత్రులు లేకుండా సీఎల్పీ సమావేశం నిర్వాహించాలన్న ఎమ్మెల్యేలు
శీతాకాల సమావేశాల తర్వాత సమస్యలు
వినడానికి ఓ వారం కేటాయిస్తానని సీఎం బుజ్జగింపు
దీంతో వెనక్కు తగ్గిన ఎమ్మెల్యేలు
రామనాథ్ రై, అంబరీష్‌లే ప్రధాన టార్గెట్లుగాఎమ్మెల్యేల విమర్శలు
అర్ధాంతరంగా బయటకు వెళ్లిన మంత్రి రామనాథ్ రై
బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం తగ్గడం లేదు. వారం వ్యవధిలో రెండు సార్లు శాసనసభ పక్ష సమావేశాలు (సీఎల్పీ) జరిపినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా మంత్రులు లేకుండానే సీఎల్పీ నిర్వహించాలని ఎమ్మెల్యేలు పట్టుపట్టడం, సమావేశం నుంచి అర్ధాంతరంగా అమాత్యులు బయటకు రావాడం వంటి విషయాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ఆ పార్టీ నాయకులే పేర్కొనడం గమనార్హం. బెళగావిలోని సువర్ణ విధాన సౌధాలో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సభ ప్రారంభమైన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. తమ నియోజక వర్గ పరిధిలో మంత్రులు పెత్తనాలు చెలాయిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా సీఎల్పీ సమావేశాల్లో మంత్రులపై ఆరోపణలు చేస్తున్నామనే విషయం మనసులో పెట్టుకుని తమ నియోజక వర్గంలోని సమస్యల పట్ల వారు స్పందించడం లేదన్నారు.
అంతేకాకుండా అభివృద్ధి పనులకు నిధుల విడుదల్లో కూడా మోకాలడ్డుతున్నారని వాపోయారు. అందువల్ల వెంటనే మంత్రులను సీఎల్పీ సమావేశం నుంచి బయటకు పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న సీఎం సిద్ధరామయ్య శాసనసభ్యులకు సర్ధిచెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ‘మంత్రులు లేకుండా సీఎల్పీ నిర్వహిస్తే విపక్షాలతో పాటు ప్రజల దృష్టిలో కూడా చులకన కావాల్సి వస్తుంది. అందువల్ల కొంత సహనం వహించండి. మీ సమస్యలు వినడానికి బెంగళూరులో వచ్చే సోమవారం నుంచి వారం రోజులు నాతోపాటు మంత్రులు సైతం మీకు ప్రత్యేక సమయం కేటాయిస్తారు.’ అని సర్ధి చెప్పడంతో ఎమ్మెల్యేలు వెనక్కుతగ్గారు.
అంబరీష్, రామనాథరై లే టార్గెట్లు ...
శాసనసభాపక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్, అటవీ శాఖ మంత్రి రామనాథరైలను టార్గెట్ చేసుకొని ఎమ్మెల్యేలు విమర్శలు కురిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా ‘ఆశ్రయ’ పథకం కింద పేదలకు ఇళ్లను కేటాయించే విషయంలో ఎమ్మెల్యేలకు కాక స్థానిక పంచాయతీలు లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా నిబంధనలు రూపొందిస్తూ అంబరీష్ తమకు విలువ లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోయారు. ఇలా అయితే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి శరాఘాతం తప్పదని ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేశారు. అంబరీష్ సమాధానం కోసం సీఎం సిద్ధుతో పాటు మిగిలిన వారు ఎదురుచూడగా అసలు సభలో అంబరీష్ లేరనే తెలియడంతో అందరూ అవాక్కయ్యారు.
తర్వాత కొద్ది సేపటికి నింపాదిగా అంబరీష్ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అటవీశాఖ మంత్రి రామనాథరై పై మరోసారి పలువురు శాసనసభ్యులు ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి రామనాథరై అర్ధాంతరంగా బయటికి వచ్చేశారు. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం రెండో రోజున (ఈనెల 10న) ఎమ్మెల్యే శంకుంతలా శెట్టి ‘రై’ కార్యవైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చిన విషయం ఇక్కడ గమనార్హం.