సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి గళాలకు తాళం పడినట్టేనా..? దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులను పిలిపించుకుని మాట్లాడిన రాష్ట్ర నాయకత్వం తాయిలాలతో వారికి ముకుతాడు వేసిందా..? తాజా పరిణామాలను పరిశీలిస్తే.. పై ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. ప్రతి పక్ష పార్టీల అభ్యర్థులు తేలక ముందే ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులకు చెక్ పెట్టడంలో పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు సత్ఫలితాలు ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఒక్క మిర్యాలగూడలో తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులను, రాజకీయాలను దారిలోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరిగ్గా నెల రోజుల కిందట ఇదే రోజున (సెప్టెంబరు 6వ తేదీ) టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను 10 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు.
కోదాడ, హుజూర్‌నగర్‌ల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఎనిమిది స్థానాల్లో అసమ్మతి భగ్గుమంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ అసమ్మతి నామమాత్రంగానే ఉండగా, మరికొన్ని చోట్ల తారాస్థాయికి చేరింది. అభ్యర్థులను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, దేవరకొండ వంటి చోట టికెట్ ఆశించిన భంగపడిన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పార్టీ మారారు.
మునుగోడులో అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. ఆలేరులో అసమ్మతిపై నీళ్లు చల్లగా, భువనగిరిలో చేతులు కలిపించారు. తుంగతుర్తిలో కూడా మందలింపులతో సరిపెట్టారు. నాగార్జున సాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో పార్టీ అధినాయకత్వం కల్పించుకోవాల్సి వచ్చింది. మిర్యాలగూడలో మాత్రం ‘తారక’ మంత్రం ఫలించలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడానికి వివిధ మార్గాలను ఆశ్రయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నల్లగొండలో ఒక విధంగా పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉండిన మాజీ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకు శాసన మండలి సభ్యత్వం ఇస్తామన్న హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయన గురువారం నాటి అపద్ధర్మ సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారని సమాచారం. నాగార్జున సాగర్‌లో అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబట్టిన అసమ్మతి నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, ఆయన అనుచర నాయకులు, ఇతర ముఖ్యులను కూడా హైదరాబాద్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మంత్రులు కె.తారక రామారావు (కేటీఆర్), జగదీశ్‌రెడ్డి బుజ్జగించారు.
సుదర్ఘీ మంతనాల అనంతరం అభ్యర్థి నోముల నర్సింహయ్యతో, ఎంసీ కోటిరెడ్డి చేతులను కలిపించారు. దానికి ముందు ఎంసీ కోటిరెడ్డికి కూడా శాసన మండలి సభ్యత్వం ఇస్తారన్న హామీని పార్టీ నాయకత్వం ఇచ్చిందని సమాచారం. తుంగతుర్తిలో అసమ్మతి నాయకుడు మందుల సామేలుకు ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నందున ఒప్పించారని అంటున్నారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిల మధ్యా సయోధ్య కుదిర్చారు.
పనిచేయని బుజ్జగింపులు
మిర్యాలగూడలో పార్టీ మాజీ ఇన్‌చార్జి, అసమ్మతి నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి విషయంలో బుజ్జగింపులు పనిచేయలేదని చెబుతున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. అన్నీ అనుకూలించి కాంగ్రెస్ టికెట్ వస్తే ఆ పార్టీ తరఫున, లేదంటే ఇండిపెండెంట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారని పేర్కొంటున్నారు. మరో వైపు మంత్రి కేటీఆర్ ఒకసారి పిలిపించి మాట్లాడినా, నిర్ణయం మార్చుకోకుండా నల్లగొండ మాజీ ఇన్‌చార్జి చకిలం అనిల్ కుమార్ పోటీలో ఉంటానని ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులుగౌడ్ కూడా నల్లగొండ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేసిన వారే. అధిష్టానం అభ్యర్థి మార్పు ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో వారిద్దరూ తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు అనుచర కౌన్సిలర్లతో కలిసి తమ సొంత గూడు కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతికి దాదాపు తెరపడినట్టేనని పేర్కొంటున్నారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడలో ఇన్‌చార్జి శశిధర్ రెడ్డి, హుజూర్‌నగర్ ఇన్‌చార్జి శంకరమ్మ ఇంకా బెట్టు వీడడం లేదంటున్నారు. ఇక్కడ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ రెండు చోట్లా అసమ్మతి పొగ గుప్పుమనే అవకాశాల్లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment