టీఆర్‌ఎస్‌లో చేదు అనుభవం.. సొంతగూటికి కీలక నేత! | Balu naik to Rejoin congress | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 22 2018 10:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Balu naik to Rejoin congress - Sakshi

టీఆర్‌ఎస్‌లో ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకుని.. తిరిగి తన సొంత గూటికి చేరుకునేందుకు జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారా..? ఈ ఎన్నికల్లో దేవరకొండనుంచే మరోసారి కాంగ్రెస్‌ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారా..? అంటే, ఆయన దగ్గరి అనుచరులు, కాంగ్రెస్‌ వర్గాలనుంచి అవుననే సమాధానం వస్తోంది. హస్తం పార్టీలోఆయన  చేరిక దాదాపుగా ఖాయమని తెలుస్తోంది. ఈ నెల 26న ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం.

సాక్షిప్రతినిధి, నల్లగొండ :  జెడ్పీచైర్మన్‌ బాలునాయక్‌  ‘హస్తం’ గూటికి చేరేందుకు  ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో దేవరకొండ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలునాయక్, ఎమ్మెల్యేగా ఆ పదవిలో ఉండగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కానీ, కొన్నాళ్లకే రాష్ట్రంలో అధికారం చేతులు మారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో ఆయన గులాబీ గూటికి చేరారు. 2019 ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం టికెట్‌ ఆశించే ఆయన పార్టీ మారారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గత ఎన్నికల్లో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్‌ కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటిదాకా దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన బాలు ప్రాధాన్యం పార్టీలో తగ్గిందన్న అభిప్రాయం ఉంది. రవీంద్ర కుమార్‌ చేరికతో దేవరకొండలో రెండు అధికార కేంద్రాలు తయారయ్యాయి. ఈ ఇద్దరు నాయకులు ఏనాడూ కలిసి పనిచేయలేదు. పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున కానీ ఏ కార్యక్రమం జరిగినా ఇద్దరు వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఇక్కడ రెండు గ్రూపులు పోటాపోటీగా పనిచేశాయి. కానీ, టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సిట్టింగ్‌ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కే అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో  బాలునాయక్‌కు అవకాశం దక్కకుండా పోయింది.

కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు
మూడేళ్ల కిందట వదిలి వచ్చిన తన సొంత పార్టీ కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి రెండు వారాలుగా బాలునాయక్‌ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. సీనియర్‌ నేత జానారెడ్డికి దగ్గరి అనుచరుడిగా ఉండిన ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతో జానాకు దూరమయ్యారు. ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గిం చుకుని అటు జానాతో, ఇటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో టచ్‌లోకి వెళ్లారని చెబుతున్నారు. కానీ, ఇక్కడా ఆయనకు కొంత ప్రతికూలత వ్యక్తమైనట్లు ప్రచా రం జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన అప్పటి నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు బిల్యానాయక్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఏడా ది కిందట ఆయన టికెట్‌ హామీపైనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారన్న అభిప్రాయంఉంది.

ఇప్పుడు బాలునాయక్‌ ఇదే స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తూ.. కాంగ్రెస్‌లోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇది అడ్డంకిగా మారిందని చెబుతున్నారు. మరోవైపు మహాకూటమిలో భాగంగా పొత్తులు ఖరారు అయితే, సీపీఐ దేవరకొండను కోరనుండడం కూ డా బాలుకు ప్రతికూల అంశంగా పేర్కొంటున్నారు. గత ఎన్ని కల్లో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉన్నా, పొత్తులో భాగంగా సీపీఐకి దేవరకొండను వదిలేశారు. కానీ, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారడంతో, ఇప్పుడు సీపీఐలో రాష్ట్ర నాయకత్వం స్థాయిలో పనిచేస్తున్న ఓ నాయకుడిని బరిలోకి దింపేందుకు దేవరకొండను మళ్లీ అడుగుతోందని తెలుస్తోంది. పార్టీ నాయకత్వంతో తనకు గతంలో ఉన్న పరిచయాలను వాడుకుంటూ కాంగ్రెస్‌ గూటికి చేరే ము హూర్తం కూడా పెట్టుకున్నారని తెలిసింది. ఈనెల 26వ తేదీన ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది. గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement