సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఒకవైపు ప్రచారంలో గులాబీ దళం దూసుకుపోతోంది. మరోవైపు ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్ ఇంకా టికెట్ల ఖరారు దగ్గరే ఆగిపోయింది. మహాకూటమి పొత్తుల వ్యవహారం తేలకపోవడంతో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటున్న టీడీపీ, సీపీఐలు కూడా ఎటూ నిర్ణయించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సిట్టింగులు ఉన్న చోట వారికే టికెట్ దక్కడం ఖాయమని తేలిపోయినా
మిగిలిన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 4వ తేదీన ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించి నల్లగొండలో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభలో ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణుల ర్యాలీలు, సన్నాహక సమావేశాలు, సభ విజయవంతం కోసం గ్రామాల వారీగా జరుగుతున్న ప్రచారంతో ఎక్కడ చూసినా గులాబీ పార్టీ కార్యకర్తల హడావుడే కనిపిస్తోంది. దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారు ఘట్టాన్ని కూడా ముగించలేక పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందరు సిట్టింగులకూ .. ఓకే !
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీ.పీసీసీ)లో ముఖ్య నాయకులంతా జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టీ ఈ జిల్లాపైనే ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న జిల్లాల్లో నల్లగొండ మొదటిది. దీంతో ఈసారి ఆ పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపనుంది ? టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పోటీ ఎలా ఉండబోతోంది ? అన్న ప్రశ్నల చుట్టూ ఆసక్తి నెలకొంది. కోదాడ, హుజూ ర్‌నగర్, నాగార్జున సాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో ఆ పార్టీ సిట్టింగులు పద్మావతిఉత్తమ్, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆయా స్థానాల్లో వారికే టికెట్లు ఖరారు అవుతాయన్న అభిప్రాయం ఉంది. ఇక, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన స్థానాల్లో సూర్యాపేట, ఆలేరు, నకిరేకల్ స్థానాల్లోనూ అక్కడి ఇన్‌చార్జులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్యలకూ టికెట్లు దాదాపు ఖరారు అయినట్లేనని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని పార్టీ వర్గాల సమాచారం.
ఐదు స్థానాలపై సస్పెన్స్
గత ఎన్నికల్లో పార్టీ గెలిచిన మిర్యాలగూడ, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ గెలిచిన దేవరకొండ, మునుగోడు, భువనగిరి, తుంగతుర్తి.. ఈ ఐదు నియోజకవర్గాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు మహా కూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీ కోరుతున్న నకిరేకల్, టీడీపీ కోరుతున్న కోదాడ స్థానాలపై ఒకింత అయోమయం ఉంది. ప్రధానంగా పై ఐదు స్థానాల్లో టికెట్ కోసం పోటీ బలంగా ఉండడం, ఇప్పటికే టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారికి దీటైన వారు ఎవరు అవుతారు అన్న వెదుకులాటలో పార్టీ నాయకత్వం ఉందని చెబుతున్నారు.
దేవరకొండలో పార్టీ ఇన్‌చార్జ్ జగన్‌లాల్ నాయక్, ఏడాదిన్నర కిందట టీడీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన బిల్యానాయక్, టీఆర్‌ఎస్‌లో భంగపడి నిన్నామొన్న తిరిగి సొంత గూటికి చేరిన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ తదితరులు టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మునుగోడులో గత ఎన్నికల్లో రెబల్‌గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీసీ, యువత కోటాలో తమకు అవకాశం ఇవ్వాలని పున్న కైలాష్ నేత, నారబోయిన రవి తదితరులు కూడా టికెట్ల ప్రయత్నాల్లో ఉన్నవారే. భువనగిరిలో కుంభం అనిల్, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ తదితరులు టికెట్లు కోరుతున్న వారే. మిర్యాలగూడలో జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి తనకు టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల లెక్కలు తేల్చే పనిలో నాయకత్వం ఉందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment