మళ్లీ కసరత్తు | Nominated Recruitment | Sakshi
Sakshi News home page

మళ్లీ కసరత్తు

Published Mon, Dec 1 2014 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

మళ్లీ కసరత్తు - Sakshi

మళ్లీ కసరత్తు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఢిల్లీ పెద్దల సూచన
నివేదిక కోరిన దిగ్విజయ్
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా
హైకమాండ్ ముందస్తు చర్యలు

 
బెంగళూరు: మండళ్లు, కార్పోరేషన్లకు సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షుల (నామినేటెడ్ పోస్టుల) భర్తీ వల్ల ఏర్పడిన అసమ్మతిని తగ్గించే చర్యలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముమ్మరం చేసింది. అందులోభాగంగా చాలా ఈ సంస్థల డెరైక్టర్ పోస్టులతోపాటు పాలనాపరమైన సభ్యుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాల్సిందిగా ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్లకు సూచించినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో చాలా మంది పదవులపై కన్నేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయన గుల్బర్గాలో జరిగిన మంత్రి మండలి సమవేశానికి మంత్రి అంబరీష్ డుమ్మాకొట్టారు. మరికొంతమంది నాయకులు బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కగా కొంతమంది కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.

ఈ క్రమంలో పార్టీలో అసమ్మతి ఇలాగా ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందని భావించిన పార్టీ హైకమాండ్ చక్కదిద్దే కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా బీడీఏ, గృహ మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మురికివాడల అభివృద్ధి మండలి తదితర సంస్థల డెరైక్టర్ స్థానాలకే కాకుండా సాధారణ సభ్యుల స్థానాలకు కూడా చాలా మంది పోటీపడుతున్నారు. దీంతో ఆయా పోస్టుల  ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాలని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై చివరి వారంలోపు తనకు నివేదిక అందజేయాలని ఆయన ఇరువురునాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్చిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘డెరైక్టర్ పోస్టుతోపాటు సాధారణ సభ్యుల ఎంపిక ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలనేది సీఎం సిద్ధు ఆలోచన, అయితే హైకమాండ్ ఇందుకు ఒప్పుకోలేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీలో ఏర్పడిన అసమ్మతిని కనిష్టానికి తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement