చెరువులకు మహర్దశ
రూ. 600 కోట్లతో అంచనాలు
వచ్చే వేసవి నుంచే పనులు
17న మంత్రితో ఎస్‌ఈల సమావేశం
గుంటూరు: రాష్ట్రంలోని చెరువులకు ప్రత్యేక మరమ్మతులు చేసేందుకు మైనర్ ఇరిగేషన్‌శాఖ చర్యలు తీసుకుంటోంది. శిధిలావస్థకు చేరిన చెరువుల మరమ్మతుకు రూ. 600 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ నెల 17వ తేదీన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సమావేశమై తుది నిర్ణయానికి రానున్నారు. వచ్చే వేసవిలోనే చెరువుల మరమ్మతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 వేలకుపైనే చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన చెరువుల సంఖ్య 35,376 ఉంటే, అంతకంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 6,361 ఉన్నాయి. వీటి ద్వారా 17.64 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరిగేది. కొంతకాలంగా ఈ చెరువులకు మరమ్మతులు లేకపోవడంతో మేట వేసుకుపోయి ఆయకట్టు విస్తీర్ణం సగానికి పడిపోయింది. స్థానిక సంస్థల అలక్ష్యం కారణంగా అనేక చెరువులు ఆక్రమణలపాలయ్యూరుు.
కొన్ని ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణాలే జరిగాయి. ఈ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువులకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల రోజుల క్రితం వీటి అంచనాల రూపకల్పనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దాదాపు 10 సర్కిళ్ల ఇంజినీర్లు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. వీటిపై ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ మహ్మద్ సాబ్జాన్ 12వ తేదీన సంబంధిత ఇంజినీర్లతో చర్చలు జరిపారు. 17 వ తేదీన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హైదరాబాద్ రావాలని ఆదేశించారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 300 కోట్లతో చెరువులకు మరమ్మతులు చేసింది. ఈ మరమ్మతుల్లో మేట వేసిన మట్టిని తవ్వడం మినహా ఇతర పనులు జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువుల గట్లు పటిష్టం చేసేందుకు రివిట్‌మెంట్లు, పశువుల వినియోగానికి అనువుగా ర్యాంపుల నిర్మాణాలు, గ్రీనరీ అభివృద్ధి, పరిరక్షణకు ఫెన్సింగ్ వంటివి అంచనాల్లో చేర్చారు.