Devineni Umamaheshwara Rao
-
‘ఉమా’ఉన్నంత కాలం నీళ్లు రావు
♦ మంత్రికి అవగాహన లేకే కృష్ణా బోర్డులో వాదన వినిపించలేదు ♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి కడప కార్పొరేషన్: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నంత కాలం రాయలసీమకు మేలు జరగదని, సాగునీరు రావడం కష్టమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలోని జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు నీరందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచాలని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉమా నాడు ధర్నా నిర్వహించారని, ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉన్నందున రాయలసీమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇక్కడి రైతుల్లో లేదన్నారు. నదీ జలాల విషయంలో ఎక్కువ శాతం నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటూ కూడా ఢిల్లీలో జరిగిన కృష్ణాబోర్డు ఎదుట తమకు అన్యాయం జరిగిందని వివరించిందన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు సమగ్ర అవగాహనతో బోర్డు మీటింగ్‌కు హాజరు కాగా, ఏపీ మంత్రి మాత్రం అవగాహన లేకుండా వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న జనాభా నిష్పత్తి ఆధారంగా డెరైక్టరేట్, సెక్రటేరియేట్‌లోని అన్ని శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి బోర్డు మీటింగ్‌లో ఒక్క మాట కూడా మాట్లాడకోవడం దారుణమన్నారు. అవే తప్పులు చేస్తున్న ప్రభుత్వం విభజన సమయంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఈనాటికీ ఆ ఊసే లేదని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి పాల్గొన్నారు. -
చెరువులకు మహర్దశ
రూ. 600 కోట్లతో అంచనాలు వచ్చే వేసవి నుంచే పనులు 17న మంత్రితో ఎస్ఈల సమావేశం గుంటూరు: రాష్ట్రంలోని చెరువులకు ప్రత్యేక మరమ్మతులు చేసేందుకు మైనర్ ఇరిగేషన్‌శాఖ చర్యలు తీసుకుంటోంది. శిధిలావస్థకు చేరిన చెరువుల మరమ్మతుకు రూ. 600 కోట్లతో అంచనాలు రూపొందించింది. ఈ నెల 17వ తేదీన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ఆ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో సమావేశమై తుది నిర్ణయానికి రానున్నారు. వచ్చే వేసవిలోనే చెరువుల మరమ్మతులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40 వేలకుపైనే చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన చెరువుల సంఖ్య 35,376 ఉంటే, అంతకంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 6,361 ఉన్నాయి. వీటి ద్వారా 17.64 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా జరిగేది. కొంతకాలంగా ఈ చెరువులకు మరమ్మతులు లేకపోవడంతో మేట వేసుకుపోయి ఆయకట్టు విస్తీర్ణం సగానికి పడిపోయింది. స్థానిక సంస్థల అలక్ష్యం కారణంగా అనేక చెరువులు ఆక్రమణలపాలయ్యూరుు. కొన్ని ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణాలే జరిగాయి. ఈ పరిస్ధితులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో చెరువులకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నెల రోజుల క్రితం వీటి అంచనాల రూపకల్పనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దాదాపు 10 సర్కిళ్ల ఇంజినీర్లు అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. వీటిపై ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ మహ్మద్ సాబ్జాన్ 12వ తేదీన సంబంధిత ఇంజినీర్లతో చర్చలు జరిపారు. 17 వ తేదీన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరగనున్న సమావేశానికి హైదరాబాద్ రావాలని ఆదేశించారు. గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 300 కోట్లతో చెరువులకు మరమ్మతులు చేసింది. ఈ మరమ్మతుల్లో మేట వేసిన మట్టిని తవ్వడం మినహా ఇతర పనులు జరగలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువుల గట్లు పటిష్టం చేసేందుకు రివిట్మెంట్లు, పశువుల వినియోగానికి అనువుగా ర్యాంపుల నిర్మాణాలు, గ్రీనరీ అభివృద్ధి, పరిరక్షణకు ఫెన్సింగ్ వంటివి అంచనాల్లో చేర్చారు. -
మంత్రా.. మజాకా..!
కృష్ణా తీరం వెంబడి ఆక్రమణలు ఇంతకుముందు తెలియదా? బడా భవనాల స్వాధీనం సాధ్యమేనా! సర్వే సకాలంలో పూర్తయ్యేనా! మంత్రి ఉమ తీరుపై సొంత పార్టీలోనే చర్చ విజయవాడ : ఆయనకు జిల్లాలో అణువణువూ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన తిరగని ప్రాంతం లేదు. తాగునీరు.. సాగునీరు.. అంటూ ప్రతి సమస్యపైనా ధర్నాలు చేశారు. రాష్ట్ర మంత్రి అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో జిల్లాలో అన్నీ తానై ముందుకుసాగుతున్నారు. అయితే, తాను కృష్ణా నది వెంబడి ఉన్న ఆక్రమణలను ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ ఆక్రమణలపై సర్వేచేసి సంక్రాంతిలోపు నివేదిక ఇవ్వాలని అధికారులను సైతం ఆదేశించారు. ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. ఆయనే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిజంగా తెలియదా..! కృష్ణా నదీ తీరంలో గుంటూరు జిల్లా వైపు 45, కృష్ణా జిల్లా వైపు 15 భారీ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వీటిల్లో కొన్ని నీటిపారుదల శాఖ భూములను ఆక్రమించుకుని నిర్మించినవి కాగా, మరికొన్ని ప్రైవేటు భూముల్లో తాత్కాలిక నిర్మాణాలకు అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భవనాలన్నీ ఒక్క రోజులో నిర్మాణం జరగలేదు. డిసెంబర్ 31వ తేదీన మంత్రి ఉమ విలేకరులను తీసుకుని కృష్ణానదిలో పర్యటిస్తూ ఈ భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వీటి గురించి సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాకు ఈ అక్రమ నిర్మాణాల గురించి ఇంతకుముందు తెలియదా.. గతంలో కృష్ణానది ఇసుక తిన్నెల్లో.. భవానీద్వీపంలో... ధర్నాలు నిర్వహించినప్పుడు ఈ భవనాలు కనిపించలేదా...అప్పట్లో వీటి గురించి ఎందుకు పట్టించుకోలేదు.. ఇప్పుడే వీటిపై దృష్టి సారించడంలో ఆంతర్యం ఏమిటీ.. అనే విషయాలపై అధికార పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది. పథకం ప్రకారమేనా... తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ భూముల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలపై మంత్రి ఉమా పథకం ప్రకారమే దృష్టిసారించారనే ప్రచారం జరుగుతోంది. అక్రమంగా నిర్మించిన భవనాలను సర్వే చేసి వాటి వివరాలను సేకరించే వరకే మంత్రి పరిమితమవుతారా.. లేక వాటిని స్వాధీనం చేసుకునే వరకు పట్టు బిగిస్తారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణంలోనే ప్రముఖుల బస! కృష్ణానది ఒడ్డున బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు గెస్ట్‌హౌస్ ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే. రాజకీయ ప్రముఖులు, ముఖ్య అధికారులు ఇక్కడకు తరచూ వచ్చి వెళ్తుంటారు. మంత్రి ఉమ హడావుడి చేసి పది రోజులు గడవకముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇదే గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ పదాధికారుల సమావేశం కూడా నిర్వహించారు. ఉమ హడావుడిని తగ్గించేందుకే గోకరాజు గంగరాజు తమ పార్టీ అగ్రనేతను ఇక్కడకు తీసుకొచ్చారా.. అనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు. నోటీ సులే ఇవ్వలేదట... ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు అనేక సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటి యజమానులకు ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ లంకభూముల్లో సుమారు ఆరువేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటి లీజు గడువు పూర్తయినా ఖాళీ చేయాలని లీజుదారులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. లీజు పూర్తవగానే వారే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, తాము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సకాలంలో సర్వే పూర్తి అనుమానమే... విలేకరులతో కలిసి కృష్ణానదిలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ఉమా అధికారులతో మాట్లాడుతూ సంక్రాంతిలోపు కృష్ణానదీ కరకట్టను సర్వే చేసి వందేళ్ల రికార్డు ఆధారంగా అక్రమ కట్టడాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ పూర్తి కాగానే కృష్ణా కరకట్ట ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన భవనాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అయితే మంత్రి చెప్పిన సమయంలో సర్వే పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. కరకట్ట ఆక్రమణలపై కృష్ణారివర్ కన్సర్వేటర్ ఆర్డీవోలకు లేఖ రాశారు. ఈ మేరకు ఆర్డీవోలు తహశీల్దార్లకు లేఖ రాశారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న రికార్డులను, ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న రికార్డులతోపాటు భవన యజమానుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, ఆ తర్వాత ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతే అక్రమ నిర్మాణాలను గుర్తించడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా అధికారులు రాజధాని నేపథ్యంలో ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల పూర్తిస్థాయిలో ఆక్రమణల గుర్తింపునకు మరో నెలరోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. ఈలోపు హడావుడి తగ్గి మళ్లీ యథాస్థితి నెలకొంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1,250 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పోలవరం, గూటాల మధ్య పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మా ణం అవసరమేనని మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిర్మాణం చేపట్టిన ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. శుక్రవా రం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. గోదావరిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ. 1,250 కోట్లు ఖర్చవుతుందని యనమల చెప్పారు. రాష్ర్టం విడిపోక ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ. 5,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. గతంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని తాము కోరినా కేంద్రం తిరస్కరించిందన్నారు. గోదావరి జలాల విషయంలో వైఎస్సార్సీపీ అనవరంగా రాజ కీయం చేస్తోందని విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు. -
పనితీరే కొలమానం
మాఫియా ఆగడాలను అరికట్టండి బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదు సమావేశంలో మంత్రి దేవినేని మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై అసహనం విజయవాడ : ఉద్యోగులంతా రాజీపడకుండా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఉద్యోగుల బదిలీలకు పనితీరే కొలమానమని, ఉద్యోగుల బదిలీ వ్యవహరంలో మంత్రుల జోక్యం ఉండదని సృష్టం చేశారు. బుధవారం స్థానిక నీటి పారుదల శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాలపై మంత్రులు సమావేశంలో చర్చించారు. శాఖల వారీగా అధికారులు ఆయా శాఖల గురించి సమావేశంలో వివరించగా మంత్రి దేవినేని పలు శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వక్తం చేశారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ఉద్యోగులు అవినీతికి దూరంగా పూర్తి పారదర్శకతతో పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని ఇక్కడే నిర్మితం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులు, ఇతర కార్యక్రమాల వివరాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై, ఇతర అభివృద్ధి పనులపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అధికారులంతా అవినీతికి దూరంగా పనిచేయాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో అందిన 5.40 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనికోసం అధికారులంతా పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖపై మాట్లాడుతూ సబ్-స్టేషన్ల నిర్మాణం, వీటీ పీఎస్ కొత్త విద్యుత్ లైన్‌కు అవసరమైన భూసేకరణ, ఇతర కార్యక్రమాలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌పై మాట్లాడుతూ 970 పంచాయతీలకుగానూ 400 మంది అధికారులు మాత్రమే ఉన్నారని, జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి పారదర్శకంగా వీఆర్వోల బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ జిల్లాలో 178 మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు గానూ 44 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఖాళీలున్న 534 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9 స్థానం వచ్చిందని, వచ్చే సంవత్సరం మెదటి మూడు స్థానాల్లో ఉండడానికి విశేషంగా కృషిచేయాలని సూచించారు జిల్లా పౌరసరఫరాలశాఖ,మార్కెటింగ్శాఖపై మాట్లాడారు. రైతులకు సుబాబుల బకాయిలు ఎగ్గొట్టిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ, వీజీటీఎం ఉడా, ఇతర విభాగాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడారు. కలెక్టర్ రఘు నందన్‌రావు మాట్లాడుతూ ఈపాస్ విధానంతో ఆధార్‌ను అనుసంధానం చేసి ప్రభుత్వ పథ కాలను ప్రజలకందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు , ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఎస్పీ విజయ్‌కుమార్, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లాముఖ్య ప్రణాళికాధికారి శర్మ, ఇరిగేషన చీఫ్ ఇంజినీర్ సుధాకర్, డ్వామా పీడీ మధులత, డీఎంహెచ్‌వో నాగ మల్లేశ్వరి, డీపీవో నాగరాజు వర్మ, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
‘కృష్ణా బోర్డు’కు ఫిర్యాదు చేస్తాం
ఏపీ మంత్రి దేవినేని ఉమ * తెలంగాణ సర్కార్ ఉల్లంఘనను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళతాం * రైతులను కాపాడాలన్న చిత్తశుద్ధి తెలంగాణ ప్రభుత్వానికి లేదు సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తికి నీటి వాడకంలో బోర్డు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడాన్ని కృష్ణానది యాజమాన్యబోర్డు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావుతో కలసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతితో ఢిల్లీ అక్బర్‌రోడ్డు-6లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఏపీ ప్రభుత్వం తరఫున పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని ఉమ, కంభంపాటి రామ్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే... కృష్ణానది యాజమాన్య బోర్డు ఇచ్చిన తీర్పు అమలు విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. సోమవారం తనను కలిసిన తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు అదే విషయాన్ని చెప్పినట్టు ఆమె మాతో చెప్పారు. అయితే విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతిచ్చిందంటూ తెలంగాణ మంత్రి హరీష్‌రావు చెప్పుకోవడం సరికాదు. పంతాలకు పోయి శ్రీశైలం నీటి మట్టాన్ని 854 అడుగుల కంటే తగ్గిస్తే ఎస్ఆర్బీసీకి నీరందించలేం. ఇదే జరిగితే రాయలసీమలోని రెండు లక్షల ఎకరాల పంట ఎండుతుంది. కేసీకెనాల్‌కు నీరు సరఫరా చేయలేము. రాయలసీమ ప్రాంతానికి మంచినీరు సైతం అందించలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో 60 టీఎంసీలు తక్కువగా ఉన్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తూ నీళ్లని సముద్రంలోకి వ దిలితే తెలంగాణ జిల్లాల్లో నల్లగొండ, ఖమ్మంతోపాటు కృష్ణ, ప్రకాశం జిల్లాలకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. నీటిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పెద్దమనసుతో తెలంగాణ 300 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వస్తే కేసీఆర్ అంగీకరించలేదు. కేసీఆర్ ఇచ్చిన ప్రతిపాదనలతోనే విభజన చట్టంలో కృష్ణానది యాజమాన్యబోర్డు అంశాన్ని యూపీఏ చేర్చింది. సీలేరు విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలని గోదావరి బోర్డు ఆర్డర్ ఇవ్వలేదు, అలా ఉంటే కేసీఆర్‌ని చూపించమనండి. -
నేటినుంచి మళ్లీ జన్మభూమి
విజయవాడ : జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. జన్మభూమి కార్యక్రమంపై శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమినిర్వహణపై సీఎం పలు సూచనలు చేశామని చెప్పారు. రేషన్, ఆధార్ కార్డులో వయస్సు తక్కువగా నమోదై పింఛన్లకు అర్హత కోల్పోయిన వారి వివరాలను సేకరించి గ్రామ, మండల, జిల్లా కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు పాల్గొన్నారు. -
శ్రీశైలంలో నీటిమట్టాన్ని కాపాడండి
గవర్నర్ నరసింహన్‌కు ఏపీ సర్కారు వినతి హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పడిపోతోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలోజోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నీటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్‌కు వివరించానని తెలిపారు. తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలంలో ఇప్పటికే నీటిమట్టం 856 అడుగులకు పడిపోయిందని.. కనీస నీటిమట్టం 854 అడుగులకు తగ్గితే రాయలసీమకు నీళ్లివ్వడం సాధ్యం కాదని వివరించానని చెప్పారు. గవర్నర్ స్పందన ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘వాస్తవాలను గవర్నర్‌కు వివరించాను. 69, 107 జీవోలను గవర్నర్ కూడా అధ్యయనం చేశారు’’ అని చెప్పారు. ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపు శ్రీశైలం ఎడమ గట్టున తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మళ్లీ విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం గల రెండు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన చేపట్టారు. -
నవంబర్ 15కల్లా సాగర్ 3వ జోన్‌కు నీరు
మంత్రి ఉమ పెనుగొలను(గంపలగూడెం) : రాష్ట్రంలో సాగర్ ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు అందేలా చూస్తామని భారీ నీటిపారుదలశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పెనుగొలను పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సభలో మాట్లాడారు. నవంబర్ 15 నాటికల్లా సాగర్ 3వ జోన్‌కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రెండో జోన్లో ప్రసుత్తం సరఫరా అవుతున్న నీరు టైలాండ్ భూములకు చేరేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాగు, తాగు నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ జలాల సరఫరా అయ్యేలా రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చిస్తానని వివరించారు. పేదలు నిర్మించుకునే ఇళ్లకు ఇకమీదట ప్రభుత్వం రూ.1.50లక్షలు మంజూరు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని బిల్లులు రానివారికి త్వరలో చెల్లిస్తామని తెలిపారు. గతంలో పింఛన్లు పొంది నూతన జాబితాలో రద్దయిన వారిలో అర్హులు ఉంటే కమిటీలలో చర్చించి పింఛను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైతు రుణ మాఫీ కోసం ఈనెల 22వ తేదీన రూ.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. అనంతరం తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధితో కలిసి పలువురికి పింఛన్లను పంపిణీ చేశారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, డీసీఎమ్మెస్ డెరైక్టర్ చెరుకూరి రాజేశ్వరావు,ఎంపీపీ కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిరిశాల కృష్టారావు, పలువురు సర్పంచిలు, అధికారులు పాల్గొన్నారు. త్వరలో మార్కెట్ యార్డులకు నూతన పాలకవర్గాలు మైలవరం : జిల్లాలోని మార్కెట్ యార్డులకు త్వరలో నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పొందుగల గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడూతూ.. ఏఎమ్‌సీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఎరువులు, పురుగు మందుల ఉంచుతామని చెప్పారు. కాగా గ్రామంలో యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఒక వ్యక్తి మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే అతడిని జాగ్రత్తగా బెల్టు షాపుల నిర్వాహకుల కంటబడకుండా ఇంటికి పంపించాల్సిందిగా పోలీసులకు చెప్పడంతో సభలో కొద్ది సేపు నవ్వులు విరిసాయి. -
సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం స్థానిక విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్ రూమ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ వెళ్లారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళీ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకట బాలవర్దనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. పూర్తిగా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి విమానాశ్రయం బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సన్మానం చేయించారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు మహిళలు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం మేరకు రుణాలను పూర్తిగా మాఫీ చేసి తమను అదుకోవాలని పలువురు మహిళలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. -
కృష్ణా నుంచి తాగునీరు విడుదల
త్వరలో సాగునీటి విడుదలకు ఏర్పాట్లు: మంత్రి దేవినేని విజయపురి సౌత్: ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను దశలవారీగా పూర్తి చేస్తామని నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడికాలువకు నీటిని విడుదల చేశారు. ఉదయం 11.20 గంటలకు స్విచ్ ఆన్ చేయగా గంటకు 500 క్యూ సెక్కుల చొప్పున పెంచుతూ సాయంత్రానికి 6,000 క్యూసెక్కు విడుదల చేస్తున్నారు. నీటి విడుదల అనంతరం మంత్రి రివర్ వ్యూ అతిథి గృహంలో మాట్లాడారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వల్ల తాగునీటి కోసం నీటిని విడుదల చేశామన్నారు. కృష్ణా డెల్టాకు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని.. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కుడికాలువకు 6,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రాయలసీమకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామన్నారు. -
ఉమా.. ఏంటీ డ్రామా!?
ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించే పనులపై ఆరా అభివృద్ధి పనుల గురించి తనకు తెలియాలని హుకుం మండిపడుతున్న ప్రజాప్రతినిధులు సాక్షి, విజయవాడ : జిల్లాపై పట్టు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం తరచూ వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అధికారులంతా తాను చెప్పినట్లే వినాలని ఉమా చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మిగిలిన ఇద్దరు మంత్రులకన్నా ముందుగానే స్పందిస్తూ మీడియాను ఉపయోగించుకుని హడావుడి చేస్తున్నారు. ఉమా వ్యవహారశైలి టీడీ పీ ప్రజాప్రతినిధులకే మింగుడు పడటం లేదు. బార్లు, ఇసుక రీచ్‌లు ఉమా అనుచరులకే..! బార్లు, ఇసుక రీచ్‌ల కేటాయింపు విషయంలో దేవినేని ఉమా కీలకంగా వ్యవహరించారని సమాచారం. తనకు అనుకూలంగా ఉండే వారికే బార్లు దక్కేవిధంగా అధికారులకు పలు సూచ న లు చేసినట్లు తెలిసింది. ఇంద్రకీలాద్రి, రైతుబజార్లు వంటి ఆదాయాలు వచ్చే విభాగాల కార్యకలాపాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మండిపడుతున్నారు. నియోజకవర్గాలపై పట్టు కోసం తహతహ ! జిల్లాలో ఎమ్మెల్యేలు సూచించే పనులను తనకు చెప్పకుండా చేయవద్దంటూ మంత్రి ఉమా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం పసిగట్టిన నగరానికి సమీపంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకరు తన సహచర శాసనసభ్యుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అక్కడ వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పిన తర్వాత మళ్లీ మంత్రి సమీక్షించడం ఎంతవరకు సమంజసమంటూ కొత్తగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోవడంతో ఆ నియోజకవర్గంపై ఉమా పూర్తిగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే ప్రభాకర్ కుమార్తె రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఉమా మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెటు వచ్చేలా పావులుకదుపుతున్నట్లు సమాచారం. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలవడంతో అక్కడ జరిగే అభివృద్ధి పనులన్నీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కేశినేని నానికి చెక్! ఎన్నికలకు ముందు నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), మంత్రి దేవినేని ఉమా మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఇప్పుడు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడంపై కేశినేని నాని రెండు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకోగా, ఇటీవల జరిగిన ఇరిగేషన్ అధికారులు సమావేశంలో ఫ్లై ఓవర్ గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మళ్లీ దేవినేని ఉమా ఆదే శాలు జారీచేశారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఫ్లై ఓవర్ వంటి కీలక విషయాల్లోనే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఐక్యత లేకపోవడం చర్చనీయాశంగా మారింది. ఉమా వ ర్గీయులకు నామినేటేడ్ పదవులు దక్కుతాయా! ప్రస్తుతం ఉన్న పలు పాలకవర్గాలను రద్దు చేసి కొత్తగా కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ దశలో జిల్లాపై దేవినేని ఉమా పట్టు కోసం పాకులాడటం మిగిలిన ప్రజా ప్రతినిధులకు రుచించడం లేదు. ఉమా సూచించిన వ్యక్తులకే కీలక పదవులు దక్కితే, తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించే నాటికి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఉమాకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గాన్ని తయారుచేయాలని వారు చర్చించుకుంటున్నారు. -
ఎయిమ్స్ విజయవాడలోనే ఏర్పాటు చేయండి
మాజీ మంత్రి సారథి డిమాండ్ ముస్తాబాద (గన్నవరం రూరల్) : ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థ ఎయిమ్స్‌ను విజయవాడలోనే ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి డిమాండ్‌చేశారు. శనివారం ముస్తాబాద వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ఖమ్మం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎయిమ్స్‌ను విజయవాడలో నెలకొల్పాలని కోరారు. జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి గుంటూరులో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చినా, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించకపోవడం సరికాదన్నారు. గొల్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. రైతులకు విత్తనాలను గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత, గిరిజన సర్పంచ్‌లు తమ అధికారాలను వినియోగించుకోకుండా పంచాయతీ కార్యదర్శుల ద్వారా టీడీపీ నాయకులు పరిపాలన నడుపుతున్నారని విమర్శించారు. సర్పంచ్ హక్కులను కాపాడేందుకు, గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని సారథి ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎం.బాబు, కూరేటి కుమారి, నాయకులు బి.వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు.