మంత్రా.. మజాకా..!
కృష్ణా తీరం వెంబడి ఆక్రమణలు
ఇంతకుముందు తెలియదా?
బడా భవనాల స్వాధీనం సాధ్యమేనా!
సర్వే సకాలంలో పూర్తయ్యేనా!
మంత్రి ఉమ తీరుపై సొంత పార్టీలోనే చర్చ
విజయవాడ : ఆయనకు జిల్లాలో అణువణువూ తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన తిరగని ప్రాంతం లేదు. తాగునీరు.. సాగునీరు.. అంటూ ప్రతి సమస్యపైనా ధర్నాలు చేశారు. రాష్ట్ర మంత్రి అయిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో జిల్లాలో అన్నీ తానై ముందుకుసాగుతున్నారు. అయితే, తాను కృష్ణా నది వెంబడి ఉన్న ఆక్రమణలను ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ ఆక్రమణలపై సర్వేచేసి సంక్రాంతిలోపు నివేదిక ఇవ్వాలని అధికారులను సైతం ఆదేశించారు. ఎవరా మంత్రి అనుకుంటున్నారా.. ఆయనే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నిజంగా తెలియదా..!
కృష్ణా నదీ తీరంలో గుంటూరు జిల్లా వైపు 45, కృష్ణా జిల్లా వైపు 15 భారీ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వీటిల్లో కొన్ని నీటిపారుదల శాఖ భూములను ఆక్రమించుకుని నిర్మించినవి కాగా, మరికొన్ని ప్రైవేటు భూముల్లో తాత్కాలిక నిర్మాణాలకు అనుమతులు తీసుకుని బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భవనాలన్నీ ఒక్క రోజులో నిర్మాణం జరగలేదు. డిసెంబర్ 31వ తేదీన మంత్రి ఉమ విలేకరులను తీసుకుని కృష్ణానదిలో పర్యటిస్తూ ఈ భవనాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వీటి గురించి సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమాకు ఈ అక్రమ నిర్మాణాల గురించి ఇంతకుముందు తెలియదా.. గతంలో కృష్ణానది ఇసుక తిన్నెల్లో.. భవానీద్వీపంలో... ధర్నాలు నిర్వహించినప్పుడు ఈ భవనాలు కనిపించలేదా...అప్పట్లో వీటి గురించి ఎందుకు పట్టించుకోలేదు.. ఇప్పుడే వీటిపై దృష్టి సారించడంలో ఆంతర్యం ఏమిటీ.. అనే విషయాలపై అధికార పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది.
పథకం ప్రకారమేనా...
తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ భూముల రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలపై మంత్రి ఉమా పథకం ప్రకారమే దృష్టిసారించారనే ప్రచారం జరుగుతోంది. అక్రమంగా నిర్మించిన భవనాలను సర్వే చేసి వాటి వివరాలను సేకరించే వరకే మంత్రి పరిమితమవుతారా.. లేక వాటిని స్వాధీనం చేసుకునే వరకు పట్టు బిగిస్తారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణంలోనే ప్రముఖుల బస!
కృష్ణానది ఒడ్డున బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు గెస్ట్‌హౌస్ ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినదే. రాజకీయ ప్రముఖులు, ముఖ్య అధికారులు ఇక్కడకు తరచూ వచ్చి వెళ్తుంటారు. మంత్రి ఉమ హడావుడి చేసి పది రోజులు గడవకముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇదే గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ పదాధికారుల సమావేశం కూడా నిర్వహించారు. ఉమ హడావుడిని తగ్గించేందుకే గోకరాజు గంగరాజు తమ పార్టీ అగ్రనేతను ఇక్కడకు తీసుకొచ్చారా.. అనే అనుమానాలను పలువురు వ్యక్తంచేస్తున్నారు.
నోటీ సులే ఇవ్వలేదట...
ప్రకాశం బ్యారేజీ నుంచి వైకుంఠపురం వరకు అనేక సంవత్సరాలుగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటి యజమానులకు ఇప్పటి వరకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ లంకభూముల్లో సుమారు ఆరువేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటి లీజు గడువు పూర్తయినా ఖాళీ చేయాలని లీజుదారులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. లీజు పూర్తవగానే వారే స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, తాము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
సకాలంలో సర్వే పూర్తి అనుమానమే...
విలేకరులతో కలిసి కృష్ణానదిలో పర్యటిస్తున్న సమయంలో మంత్రి ఉమా అధికారులతో మాట్లాడుతూ సంక్రాంతిలోపు కృష్ణానదీ కరకట్టను సర్వే చేసి వందేళ్ల రికార్డు ఆధారంగా అక్రమ కట్టడాలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంక్రాంతి పండుగ పూర్తి కాగానే కృష్ణా కరకట్ట ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి నిబంధనలు అతిక్రమించిన భవనాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అయితే మంత్రి చెప్పిన సమయంలో సర్వే పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. కరకట్ట ఆక్రమణలపై కృష్ణారివర్ కన్సర్వేటర్ ఆర్డీవోలకు లేఖ రాశారు. ఈ మేరకు ఆర్డీవోలు తహశీల్దార్‌లకు లేఖ రాశారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో ఉన్న రికార్డులను, ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్న రికార్డులతోపాటు భవన యజమానుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి, ఆ తర్వాత ఫీల్డ్ సర్వే చేసిన తర్వాతే అక్రమ నిర్మాణాలను గుర్తించడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా అధికారులు రాజధాని నేపథ్యంలో ఇతర పనుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల పూర్తిస్థాయిలో ఆక్రమణల గుర్తింపునకు మరో నెలరోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. ఈలోపు హడావుడి తగ్గి మళ్లీ యథాస్థితి నెలకొంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.