భూ సేకరణ నోటిఫికేషన్ సైతం ఉపసంహరణ.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
ఆ గ్రామాల్లోని అవే భూముల్లో బహుళార్థ సాధక పారిశ్రామిక పార్కు ఏర్పాటు!
పారిశ్రామిక పార్కుకు అవసరమైన భూముల సేకరణకు తాజాగా టీజీఐఐసీ ప్రతిపాదన
భూ సేకరణ అధికారిగా తాండూరు ఆర్డీవో నియామకం
‘దిలావర్‌పూర్ ఇథనాల్’కు అనుమతులపై సర్కారు ఆరా
గత ప్రభుత్వ కేబినెట్ భేటీకి సంబంధించిన పత్రాలు బహిర్గతం
ఇప్పటికే ఫ్యాక్టరీ పనుల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: కాలుష్య కారక పరిశ్రమలపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ‘లగచర్ల ఫార్మా విలేజ్’ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇప్పటికే విడుదల చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను సైతం రద్దు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల్ మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో భూ సేకరణ ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది.
అయితే అదే సమయంలో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఫార్మా విలేజ్ స్థానంలో బహుళార్ధ సాధక పారిశ్రామిక పార్కు (మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు) ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు తాజా భూ సేకరణ ప్రతిపాదనలను తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ).. ప్రభుత్వానికి సమర్పించింది. టీజీఐఐసీ ప్రతిపాదనలకు అనుగుణంగా తాండూరు ఆర్డీఓను భూ సేకరణ అధికారిగా నియమిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ప్రకటించారు.
ఫార్మా విలేజ్ స్థానంలో ఏర్పాటయ్యే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో గతంలో ప్రతిపాదించిన భూమిని సేకరించి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు ఇచ్చినట్లు టీజీఐఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. గతంలో పీఎంకే డిస్టిలేషన్స్ పొందిన అనుమతులపై ఆరా తీస్తోంది. గత ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి మరీ హడావుడిగా అనుమతులు ఇచ్చిందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రకారం కాకుండా 2006 డిస్టలరీస్ చట్టాన్ని సడలించి అనుమతులిచ్చారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
మళ్లీ అవే గ్రామాలు.. అవే భూములు
వికారాబాద్ జిల్లాలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో 1,358.37 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సేకరించి ఇవ్వాలని కోరుతూ టీజీఐఐసీ ఈ ఏడాది జూన్ 7న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ 28న తాండూరు ఆర్డీఓను భూ సేకరణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 11కు అనుగుణంగా పోలేపల్లిలోని సర్వే నంబర్ 67లో 71.39 ఎకరాలు, లగచర్లలో 632.26 ఎకరాల పట్టా భూమిని సేకరిస్తామంటూ ఈ ఏడాది ఆగస్టులో ఆర్డీఓ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.
అయితే ఫార్మా విలేజ్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారులపై దాడులు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా అవే భూముల్లో స్థానికులకు ఉపాధి కల్పించేలా కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో భూసేకరణకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని జిల్లా కలెక్టర్ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించారు.
దిలావర్‌పూర్ అనుమతుల వెనుక గందరగోళం!
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో పీఎంకే డిస్టిలేషన్స్ ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది. ‘తెలంగాణ డిస్టిలరీ (మాన్యుఫ్యాక్చర్ ఆఫ్ స్పిరిట్స్) నిబంధనలు 2006’ను సవరించి మరీ దిలావర్‌పూర్ ఇథనాల్ యూనిట్‌తో పాటు కొత్తగా రాష్ట్రంలోని ఏడు డిస్టిలరీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ– ప్రాథమిక అవగాహన ఒప్పందం) జారీ చేయడం వెనుక గందరగోళం జరిగిందని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని కుటుంబం కోసం ఆఘమేఘాల మీద గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు ఇవ్వడంపై దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టారని, రెడ్‌జోన్ కేటగిరీ ఫ్యాక్టరీకి అత్యవసరంగా అనుమతులు ఇవ్వడం వెనుక ఏదో మతలబు జరిగిందనే సందేహాలను ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ కేబినెట్ భేటీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేసింది.
కేబినెట్ ఆమోదం లేకుండానే..
కేబినెట్ ఆమోదం లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్‌కు 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండ్రస్టియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి ఎల్‌ఓఐ జారీ చేయడాన్ని, ఆ తర్వాత రెండు నెలలకు కేబినెట్ రాటిఫై చేయడాన్ని ప్రశ్నిస్తోంది. ఫ్యూయల్ ఇథనాల్ కోసం దరఖాస్తు చేసిన పీఎంకే డిస్టిలేషన్స్ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోకపోవడం, కంపెనీ స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఫ్యూయల్ ఇథనాల్ తయారీకి మాత్రమే అనుమతులు ఉండగా ఎల్‌ఓఐలో మిగతా ఉత్పత్తులను జోడించడాన్ని ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు వచ్చాయని, తమ ప్రభుత్వం ఎల్‌ఓఐ ఆధారంగా కేవలం నీటి కేటాయింపులు మాత్రమే జరిపిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment