ఎయిమ్స్ విజయవాడలోనే ఏర్పాటు చేయండి
- మాజీ మంత్రి సారథి డిమాండ్
ముస్తాబాద (గన్నవరం రూరల్) : ప్రతిష్టాత్మక వైద్య విద్యాసంస్థ ఎయిమ్స్‌ను విజయవాడలోనే ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారథి డిమాండ్‌చేశారు. శనివారం ముస్తాబాద వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ఖమ్మం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎయిమ్స్‌ను విజయవాడలో నెలకొల్పాలని కోరారు.
జిల్లాకు చెందిన వైద్య శాఖ మంత్రి గుంటూరులో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటిం చినా, మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించకపోవడం సరికాదన్నారు. గొల్లపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. రైతులకు విత్తనాలను గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు.
అనేక గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దళిత, గిరిజన సర్పంచ్‌లు తమ అధికారాలను వినియోగించుకోకుండా పంచాయతీ కార్యదర్శుల ద్వారా టీడీపీ నాయకులు పరిపాలన నడుపుతున్నారని విమర్శించారు. సర్పంచ్ హక్కులను కాపాడేందుకు, గ్రామాల అభివృద్ధికి పాటుపడేలా వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని సారథి ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఎం.బాబు, కూరేటి కుమారి, నాయకులు బి.వెంకట నర్సింహారెడ్డి పాల్గొన్నారు.