ప్రజలను మభ్యపెట్టొద్దు
- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, కె.పి.సారథి
విజయవాడ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా టీడీపీ నేతలు కొందరు అనవసర ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీమంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత కేసును ఉదహరిస్తూ తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు దురుద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని చెప్పారు.
కోర్టులో పెండింగులో ఉన్న కేసు విషయంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాబోయే తీర్పు తమకు ముందుగా తెలిసినట్లుగా, లేదా తాము తీర్పును ప్రభావితం చేయగలమనే ధైర్యంతో వారు మాట్లాడడం శోచనీయమన్నారు. ఓ మంత్రి జగన్‌కు 6 వేల సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని, మరో మంత్రి వేల కోట్లు జరిమానా వేస్తారని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఏదో జరుగుతుందనే భావన ప్రజల్లో కల్పించే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
కోర్టు కేసులన్నింటిలో ఒకే తరహాలో శిక్షలు పడవని పార్థసారథి అన్నారు. ఒక కేసుకు.. మరో కేసుకు సంబంధం ఉండదని, ఆయా కేసుల్లో సాక్ష్యాధారాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు వస్తుంటాయన్నారు. వాస్తవాన్ని వక్రీకరించి చట్టం, న్యాయం అంతా తమకే తెలిసినట్లుగా కొందరు టీడీపీ నేతలు జగన్‌పై బురదజల్లే విధంగా దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు రాజ్యాంగబద్ధమెన పదవిని నిర్వహించలేదన్నారు.
చంద్రబాబునాయుడు దేశంలోనే ఎక్కువ సంవత్సరాలు రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవించారన్నారు. చంద్రబాబు తన పాలనలో వ్యక్తిగతంగా వచ్చిన ఏలేరు స్కాం, మద్యం స్కాం, ఐఎంజీ భూముల కుంభకోణం వంటి కేసుల్లో వచ్చిన ఫిర్యాదులపై సుప్రీం కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, లక్ష్మీపార్వతి చంద్రబాబుపై వేసిన కేసులపై చంద్రబాబు ఎందుకు విచారణకు సిద్ధం కాలేదన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ లేదా మరే దర్యాప్తు సంస్థతోనూ చంద్రబాబు విచారణ జరిపించుకోకుండా, కనీసం కోర్టులలో కూడా విచారణ జరుగకుండా చేసుకున్నారని చెప్పారు. ఎవరైనా తమ నాయకుడిపై కేసులు తిరగదోడుతారనే ఆందోళన వారిలో కనపడుతోందని సారథి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌నే చెప్పులతో కొట్టించిన ఘనత ఉన్న బాబు సినీ నటుడు బాలకృష్ణ తన అల్లుడి సాయంతో అదే పని చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోందన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు అసత్య ప్రచారాన్ని మానుకోవాలని సారథి హితవు పలికారు.