ఉమా.. ఏంటీ డ్రామా!?
- ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించే పనులపై ఆరా
- అభివృద్ధి పనుల గురించి తనకు తెలియాలని హుకుం
- మండిపడుతున్న ప్రజాప్రతినిధులు
సాక్షి, విజయవాడ : జిల్లాపై పట్టు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం తరచూ వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అధికారులంతా తాను చెప్పినట్లే వినాలని ఉమా చెబుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని సమస్యలపై మిగిలిన ఇద్దరు మంత్రులకన్నా ముందుగానే స్పందిస్తూ మీడియాను ఉపయోగించుకుని హడావుడి చేస్తున్నారు. ఉమా వ్యవహారశైలి టీడీ పీ ప్రజాప్రతినిధులకే మింగుడు పడటం లేదు.
బార్‌లు, ఇసుక రీచ్‌లు ఉమా అనుచరులకే..!
బార్‌లు, ఇసుక రీచ్‌ల కేటాయింపు విషయంలో దేవినేని ఉమా కీలకంగా వ్యవహరించారని సమాచారం. తనకు అనుకూలంగా ఉండే వారికే బార్‌లు దక్కేవిధంగా అధికారులకు పలు సూచ న లు చేసినట్లు తెలిసింది. ఇంద్రకీలాద్రి, రైతుబజార్లు వంటి ఆదాయాలు వచ్చే విభాగాల కార్యకలాపాల గురించి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మండిపడుతున్నారు.
నియోజకవర్గాలపై పట్టు కోసం తహతహ !
జిల్లాలో ఎమ్మెల్యేలు సూచించే పనులను తనకు చెప్పకుండా చేయవద్దంటూ మంత్రి ఉమా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం పసిగట్టిన నగరానికి సమీపంలో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఒకరు తన సహచర శాసనసభ్యుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా తాము ప్రజల్లోకి వెళ్లినప్పుడు అక్కడ వారు చెప్పిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పిన తర్వాత మళ్లీ మంత్రి సమీక్షించడం ఎంతవరకు సమంజసమంటూ కొత్తగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే వాపోతున్నారు.
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ చనిపోవడంతో ఆ నియోజకవర్గంపై ఉమా పూర్తిగా పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నిక జరిగితే ప్రభాకర్ కుమార్తె రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఉమా మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెటు వచ్చేలా పావులుకదుపుతున్నట్లు సమాచారం. తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలవడంతో అక్కడ జరిగే అభివృద్ధి పనులన్నీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
కేశినేని నానికి చెక్!
ఎన్నికలకు ముందు నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), మంత్రి దేవినేని ఉమా మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఇప్పుడు కేశినేని నానికి చెక్ పెట్టేందుకు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించడంపై కేశినేని నాని రెండు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసుకోగా, ఇటీవల జరిగిన ఇరిగేషన్ అధికారులు సమావేశంలో ఫ్లై ఓవర్ గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మళ్లీ దేవినేని ఉమా ఆదే శాలు జారీచేశారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. ఫ్లై ఓవర్ వంటి కీలక విషయాల్లోనే ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఐక్యత లేకపోవడం చర్చనీయాశంగా మారింది.
ఉమా వ ర్గీయులకు నామినేటేడ్ పదవులు దక్కుతాయా!
ప్రస్తుతం ఉన్న పలు పాలకవర్గాలను రద్దు చేసి కొత్తగా కమిటీలను నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ దశలో జిల్లాపై దేవినేని ఉమా పట్టు కోసం పాకులాడటం మిగిలిన ప్రజా ప్రతినిధులకు రుచించడం లేదు. ఉమా సూచించిన వ్యక్తులకే కీలక పదవులు దక్కితే, తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని ముఖ్య నేతలు పేర్కొంటున్నారు. నామినేటెడ్ పదవులు కేటాయించే నాటికి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు కొందరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఉమాకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గాన్ని తయారుచేయాలని వారు చర్చించుకుంటున్నారు.