ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారు.
ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన విశేష ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మకు అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానం నుంచి పట్టువ్రస్తాలను సమర్పించారు.
అన్నవరం దేవస్థాన ఈవో, దుర్గగుడి దసరా ఉత్సవాల ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్‌ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ అమ్మవారికి సమర్పింంచేందుకు పట్టువ్రస్తాలను తీసుకురాగా, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో కేఎస్ రామారావు సాదరంగా స్వాగతం పలికారు. ఉత్సవాల ఏర్పాట్లను సీపీ టీకే రాణా పర్యవేక్షించగా, ఆలయ ప్రాంగణంలో డీసీపీ విశాల్‌గున్ని క్యూలైన్లను పర్యవేక్షించారు. సాయంత్రం ఆది దంపతుల నగరోత్సవం కన్నుల పండువగా సాగింది. నగరోత్సవంలో ఆలయ చైర్మన్ రాంబాబు, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment