ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నందు ఆదివారం నుంచి దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలి రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
భక్తుల రద్దీని అంచనా వేసేందుకు పోలీస్, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం నిరంతరం ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసింది. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంత్రం పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన అయ్యేలా చూడాలని ఆలయ ఈవో కెఎస్ రామారావు, ఫెస్టివల్ ఆఫీసర్ ఆజాద్‌కు పలు సూచనలు చేశారు.
నేడు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను తొలిరోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు. బాలాదేవి ఎంతో మహిమాన్వి తమైనది. శ్రీ బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలా త్రిపురసుందరీదేవి.
Comments
Please login to add a commentAdd a comment