ఇదేం ‘వరద’ రాజకీయం?
- ఒక టీఎంసీ నీటి కోసం రైతుల పొట్టకొడతారా
- కుందూ పెన్నా వరద కాలువ పరిస్థితిపై మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈని ప్రశ్నించిన రైతులు
ప్రొద్దుటూరు టౌన్ : మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజకీయ కుతంత్రాల కారణంగా కుందూ-పెన్నా వరద కాలువ అలైన్‌మెంట్ మార్చడంతోనే మధ్యలో నిలిచిపోయిందని, ఇప్పుడు మీరు ఆయన చెబితే వచ్చారా అంటూ మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈ వెంకటరామయ్యను రైతులు, ప్రొద్దుటూరు సమీపంలోని ప్లాట్ల యజమానులు ప్రశ్నించారు. ప్రొద్దుటూరు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో బుధవారం కుందూ-పెన్నా కాలువపై కోర్టుకు వెళ్లిన రైతులు, భూముల యజమానులతో కాలువ నిర్మాణ పనులు చేయిచేందుకు నియమించిన మైనర్ ఇరిగేషన్ శాఖ ఈఈ చర్చించేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలంలోని పలువురు రైతులు వచ్చారు. కాలువ అలైన్‌మెంట్ మార్పుపై ఈఈ వారితో మాట్లాడారు. మొదట అలైన్‌మెంట్ మార్పు చేయడం వల్లనే కాలువ పనులు ఆగిపోయాయని ఈఈతో చెప్పారు. ఆనాడు అధికారంలో ఉన్న వరదరాజులరెడ్డి కక్షగట్టి తమ భూముల్లో ఊరికి దగ్గరలో కాలువను మార్పు చేశారన్నారు. ఒక టీఎంసీ నీటిని తీసుకొచ్చేందుకు వందల ఎకరాలు పంటలు పండే భూములను నాశనం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
రెండవ అలైన్‌మెంట్ పోయి మూడవ అలైన్‌మెంటా...
ఇప్పుడు రెండవ అలైన్‌మెంట్ పోయి మూడవ అలైన్‌మెంట్ అంటూ పట్టణం ఆనుకుని ఉన్న మా ప్లాట్లల్లో కాలువను తీసుకురావడం సమంజసమేనా అని కాంట్రాక్టర్ కృష్ణార్జునరెడ్డి ఈఈని ప్రశ్నించారు. ఎకరా రూ.75లక్షలు ప లుకుతున్న ఈ స్థలాల్లో కాలువ తీసుకురావడం కంటే రూ.6లక్షలు విలువ చేసే భూములకు మరింత ఎక్కువ డబ్బు అయినా ఇచ్చి కాలువను తీసుకెళితే సరిపోతుంది కదా అని అన్నారు. ఇంతలో అంకాల్‌రెడ్డి అనే రైతు మ్యాప్‌ను తెప్పించి కాలువ ఎ లా వెళితే తమ గ్రామాలకు దూరంగా వెళుతుందో అధికారులకు చూపిం చారు. మరో ఈఈ గిరిధర్ కాలువ వెళ్లే మార్గాన్ని చూపుతూ ఇలా వెళితే డబ్బు తగ్గుతుందని, మీరు చెప్పినట్లు వెళితే మరో రూ.10కోట్లు ఎక్కువ అవుతుందని వాదించారు.
రైతులతో దశల వారిగా చర్చలు జరుపుతాం
రైతులతో దశల వారిగా చర్చలు జరుపుతామని ఈఈ తెలిపారు. ఆ తర్వాతే ఆమోదయోగ్యమైన అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వం కాలువను పూర్తి చేయాలన్న ఆలోచనలోనే ఉందని, ఇందు కోసం రైతులతో ఒప్పించే ప్రయత్నం చేయమని తనను పంపిందని ఈఈ వివరించారు. అత్యవసరం అనుకున్న ప్రాంతాల్లో పైపులైన్ ఏర్పాటు చేసి అయినా కాలువను పూర్తి చేసేందుకు రైతులతో మాట్లాడుతామన్నారు.