
ఇంపాల్: ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మణిపూర్‌లో బాంబు పేలుడు ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య మృతిచెందారు. మరోవైపు.. తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు, గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
వివరాల ప్రకరాం.. మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి సైకుల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యమ్‌థాంగ్ హౌకిప్ ఇంటి పక్కనే బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో హౌకిప్ రెండో భార్య సపం చారుబాలా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, పేలుడు ఘటన సమయంలో హౌకిప్ కూడా ఇంట్లోనే ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో ఉగ్రవాదులకు ,గ్రామ వాలంటీర్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఒక ఉగ్రవాది, ముగ్గురు గ్రామ వాలంటీర్లు శుక్రవారం మోల్నోమ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరణించారు. కాగా గత ఏడాది మే నుండి మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీకి చెందిన మెయిటీస్ , పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జరిగిన జాతి హింసలో వందల సంఖ్యలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment