11 పనులను ఒక్కడికే కట్టబెట్టే పన్నాగం
=మేడారం జాతర పనుల్లో రూ. 9.52 కోట్లకు ఎసరు
=కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారుల కుమ్మక్కు
=10 శాతం ఎక్సెస్‌కు దక్కేలా పావులు
=ప్రొసీడింగ్స్ రాకముందే ఒప్పందం ఖరారు
తిన్న పాణం ఊరుకోదుగా... అందుకే ఆనవాయితీని కొనసాగించేందుకు పెద్దలు రంగం సిద్ధం చేశారు. మేడారం జాతర నిధులను దిగమింగేందుకు కుమ్మక్కు తంత్రానికి తెరతీశారు. మైనర్ ఇరిగేషన్ శాఖలోరూ. 9.52 కోట్ల పనులకు టెండర్ వేశారు. చిన్న, పెద్ద పనులనే తేడా లేకుండా అన్నింటికీ ఒకే టెండర్ పిలిచేలా... ఆ ఒక్కడికే కట్టబెట్టేలా జిల్లా యంత్రాంగంపై ఒత్తిళ్లు మొదలుపెట్టారు. ఇదే అదునుగా కక్కుర్తి పడ్డారో... ఏమో గానీ అతగాడికి పది శాతం ఎక్సెస్‌కు టెండర్ కట్టబెట్టేలా అధికారులు పావులు కదుపుతున్నారు.
ములుగు, న్యూస్‌లైన్ : మేడారం మహాజాతరలో కక్కుర్తి పనులకు తెరతీశారు. కాంట్రాక్టర్లు.. ప్రజాప్రతినిధులు.. అధికారులు కుమ్మక్కై జాతరలో ప్రధాన భూమిక పోషించే స్నానఘట్టాల నిధులపై గురి పెట్టారు. సమయం ముంచుకొస్తుందనే సాకుతో మైనర్ ఇరిగేషన్ శాఖ పనుల్లో షార్ట్ టెండర్‌కు తెరలేపారు.
ఈ శాఖ పరిధిలో చేపట్టే సుమారు 11 పనులకు ఒకే టెండర్ పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జాతరఅభివృద్ధి పనులకు రూ. 90 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో మైనర్ ఇరిగేషన్ శాఖకు రూ. 9.52 కోట్లు కేటాయించింది. వీటితో జంపన్నవాగుపై స్నానఘట్టాల నిర్మాణం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, తదితర పనులు చేపట్టాలి.
నిబంధనల ప్రకారం రూ. ఐదు లక్షలకు పైబడి విలువైన పనులను టెండర్ పద్ధతిన కట్టబెట్టాలి. ఆ లోపు పనులను నామినేషన్ పద్ధతిన కేటాయించాలి. ఈ లెక్కన 11 పనులకు వేర్వేరుగా టెండర్ పిలవాల్సి ఉన్నప్పటికీ... అధికారులు ఒక్కడికే కట్టబెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. విడివిడిగా పనులు అప్పగిస్తే.. పనుల పర్యవేక్షణ సులువు కావడంతోపాటు త్వరగా పూర్తయ్యే అవకాశమున్నప్పటికీ... వారు ఒకే టెండర్ నిర్వహణకు నిర్ణయం తీసుకోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పటి కలెక్టర్ చీవాట్లు పెట్టినా...
గత జాతర సమయంలో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా వేర్వేరుగా టెండర్లు పిలవాలని మైనర్ ఇరిగేషన్ (ఎంఐ) అధికారులను ఆదేశించారు. ఒకే టెండర్ నిర్వహణపై సమీక్ష సమావేశాల్లోఆయన చీవాట్లు పెట్టినా... వారు పట్టించుకోలేదు.. తీరా సమయం దగ్గరపడడంతో చేసేదేమీలేక ఒకే టెండర్‌కు రాహుల్ బొజ్జా అయిష్టంగా ఒప్పుకున్నారు. ఇప్పడు ఆయన బదిలీ కావడం... కొత్త కలెక్టర్ రావడంతో మళ్లీ పాత కథనే కొనసాగించేందుకు అధికారులు సమాయత్తమవడం విశేషం.
కాంట్రాక్టర్ల రింగ్
జిల్లాలోని క్లాస్ వన్ కాంట్రాక్టర్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంలో అనుభవమున్న వారు మాత్రమే టెండర్‌లో పాల్గొనేందుకు అర్హులు. ఈ మేరకు జిల్లాకు చెందిన ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే అర్హులుగా ఉన్నారు. పొరుగు జిల్లా కాంట్రాక్టర్లను స్థానికేతరులు అనే సాకుతో ఇక్కడ టెండర్ వేయనీయకుండా ‘పెద్దసార్ల’తో బెదిరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక జిల్లాకు చెందిన వారు టెండర్లలో రింగ్ అయి ప్రతి జాతరలోనూ ఆ ఒక్కడికే కాంట్రాక్ట్ దక్కేలా సహకరిస్తున్నారు. ఈ సారీ కూడా ఆయనకే మళ్లీ పనులు దక్కేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇబ్బందులే..
జాతరలో మైనర్ ఇరిగేషన్ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. గత జాతరలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.. చిన్న.. పెద్ద పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ చేయాల్సి రావడంతో జాతర రేపు మాపు వరకు కూడా కొనసాగాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాదు... పనులో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనబడింది. విడివిడిగా టెండర్లు పిలిస్తే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు రంగంలోకి దిగి.. లెస్‌కు పలికే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరనున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
అందుకేనేమో...
మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 1,192 మీటర్ల మేర స్నాఘట్టాల నిర్మాణం, కొత్త బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు, పాత బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, పాత ఇన్‌ఫిల్టరేషన్ బావుల మరమ్మతు, కొత్తవాటి ఏర్పాటు, ఇసుక తరలింపు, లెవలింగ్, జంపన్నవాగులో క్రాస్‌బండ్‌ల నిర్మాణం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదుల నిర్మాణం, స్నానఘట్టాల వద్ద బారికేడ్లు, క్లోరినేషన్ తదితర పనులు చేయనున్నారు. ఇవన్నీ ఒకరు చేస్తే.. అతడికి ఏమైనా మిగలడంతోపాటు తమకూ పెద్దమొత్తంలో అందే అవకాశముందని భావిస్తున్న అధికారులు ఒకే టెండర్ నిర్వహణకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ పనులకు విడివిడిగా టెండర్లు పిలిచేలా చర్యలు చేపట్టాలని... నాసిరకం పనులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.
ఒకటే టెండర్...
ఎంఐ శాఖ పరిధిలోని జాతర పనులన్నింటికీ ఒకే షార్ట్ టెండర్ పిలువనున్నాం. జాతరకు సమయం దగ్గరపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. పనులకు సంబంధించి ఇంకా ప్రొసీడింగ్స్ వెలువడలేదు. రేపోమాపో వెలువడగానే టెండర్ పిలిచేందుకు చర్యలు తీసుకుంటాం.
- రామకృష్ణాచార్యులు, డీఈ, మైనర్ ఇరిగేషన్
ఒకే టెండర్!
Published Tue, Nov 19 2013 2:02 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement
Advertisement