పండుగ నిధులు.. ఫలహారం! | Funding for the festival .. Scream! | Sakshi
Sakshi News home page

పండుగ నిధులు.. ఫలహారం!

Published Fri, Feb 7 2014 4:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Funding for the festival .. Scream!

  •    మేడారంలో కానరాని  ముందస్తు ప్రణాళిక
  •      సౌకర్యాల పేరుతో  ఇష్టారీతిగా పనులు
  •      మళ్లీ జాతరకు ‘శాశ్వత’ నిర్మాణాలు కనుమరుగే..
  •      పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
  • సాక్షి, హన్మకొండ: మహా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన మేడారం పరిసర ప్రాంతాల్లో 500కు పైగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో సగానికి పైగా మరుగుదొడ్లు ఎప్పటిలాగే స్థానిక రైతుల అనుమతి తీసుకోకుండా వారి వ్యవసాయ పొలాల్లో నిర్మిస్తున్నారు. జాతర తర్వాత.. వచ్చే ఖరీఫ్‌లో రైతులు వాటిని తొలగించి వ్యవసాయం చేస్తారు. కానీ వీటిని శాశ్వత మరుగుదొడ్లుగా అధికార యంత్రాంగం పేర్కొంటున్నది. ఒక్క టాయిలెట్లే కాదు.. మేడారంలో భక్తుల సౌకర్యం పేరుతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ముందు చూపు కానరావడం లేదు. హడావుడిగా పనులు చేపట్టడం.. అందినకాడికి పర్సంటేజీలు పం చుకోవడం అధికారులు, ప్రజా ప్రతినిధు లకు పరిపాటిగా మారింది. రాష్ట్ర పండుగ అయిన జాతరకు వెచ్చిస్తున్న నిధులు ఫలహారంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
     
    ముందుచూపులేని యంత్రాంగం..
     
    ప్రభుత్వం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించినా ఇంతవరకు ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. ప్రతీసారి జిల్లా సాధారణ బడ్జెట్‌తో పాటు గిరిజన ఉప ప్రణాళిక నిధులతో జాతర పనులు చేపడుతున్నారు. అయితే సాధారణ నిధులతో పనులు చేపట్టా ల్సి ఉందని తెలిసినా చివరి నిమిషం వరకు ప్రణాళిక రూపొందించడంలేదు. జాతరకు మూడు నెలల సమయం ఉందనగా నవంబర్‌లో హడావుడిగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

    డిసెంబర్ మధ్యటెండర్ల ప్రక్రియ పూర్తవుతుండగా  పనులు చేపట్టేం దుకు 30 నుంచి 50 రోజుల సమయమే అందుబాటులో ఉంటోంది. దీంతో జాతర దగ్గరపడుతోంది.. చకచక పనులు పూర్తి చేయాలంటూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ఈ పనుల మధ్యలో జోక్యం చేసుకుంటే జాతర నాటికి పూర్తి కావనే నెపంతో అ టు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో రూ.94 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలు నవంబర్ లో సిద్ధం చేశారు. డిసెంబర్ నుంచి ఒక్కొక్కటిగా పనులు మొదలుపెట్టారు.
     
    పాత పనులకు పాతర..
     
    ఏటూరునాగారం, మల్యాల, దొడ్ల, ఊరట్టం నుంచి ఎడ్లబండ్ల మీదుగా వచ్చే భక్తులకు ఊరట్టం కాజ్‌వే.. ప్రధాన మార్గం. గత జాతరలో రూ.25 లక్షల తో నిర్మించిన ఈ కాజ్‌వే గతేడాది వ ర్షాలకు దెబ్బతింది. దీనికి మరమ్మతులు చేయించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచారు. అలాగే గతేడాది జాతరకు వచ్చినప్పుడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమ్మక్క కొలు వై ఉండే చిలకలగుట్ట చుట్టూ ప్రహారీ, ఫెన్సింగ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్‌లో రూపొందించి న ప్రతిపాదనలో ఈ విషయాన్ని కూడా అధికారులు పక్కకు పెట్టారు. అలాగే గిరిజన మ్యూజియం నిర్మా ణం ఊసే పట్టించుకో లేదు.
     
    అక్కరకు రాని వాటిపై..
     
    ఊరట్టం కాజ్‌వే మరమ్మతులపై శ్రద్ధ పెట్టని అధికారులు ఎవరూ ఊహించని విధంగా ఊరట్టం నుంచి మల్యాల వరకు ఏటూరునాగారం అభయారణ్యం లో ఉన్న  ఎడ్లబండి మార్గాన్ని ఉన్నఫళంగా బీటీగా మార్చేందుకు రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అధికారులు ఆమోదించి టెండర్లు పిలిచి 3 కిలోమీటర్ల వరకు మెటల్ పోసిన తర్వాత అటవీశాఖ అధికారులు అడుకున్నారు. అలాగే ఊరట్టం కాజ్‌వే నుంచి గద్దెలు-జంపన్నవాగు రోడ్డు వరకు పొలాల మధ్య నుంచి రెండు కిలోమీటర్ల పొడవుతో బీటీరోడ్డు నిర్మాణం చేపట్టారు.

    ముందస్తు సమాచారం లేకుండా పొలాల మధ్య నుంచి రోడ్లు వేయడంతో స్థానిక గిరిజనులు భూములు కోల్పోయారు. రైతుల నుంచి అనుమతి తీసుకోకుండానే వారి పొలాల్లో శాశ్వత మరుగుదొడ్లు అంటూ కట్టడాలు చేపడుతున్నారు. వ్యవసాయ పనులు మొదలై తే శాశ్వత మరుగుదొడ్లలో ఎన్ని వచ్చే జాతర వరకు ఉంటాయనే అంశంపై అధికారులకే స్పష్టత లేదు. జాతర రద్దీ ఎక్కువగా ఉండే జంపన్నవాగు-గద్దెల వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. అందులో భాగంగా జంపన్నవాగుపై రెండో వంతెన నిర్మించారు. కానీ ఫోర్‌లేన్ రోడ్డును మరిచారు.
     
    భక్తులకు ఉపయోగపడని పనులు..
     
    2014 జాతర పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు రోడ్లకు మరమ్మతులు, అభివృద్ధి చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామన్నారు. కానీ పస్రా-లింగాల రోడ్డు, చిలకలగుట్ట ఫెన్సింగ్, తూముల వాగు, వట్టివాగు వంతెనలు, ఊరట్టం నుంచి ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు సీసీ రోడ్డు వంటి పనులను రూ. 30 కోట్లతో చేపడుతున్నారు. ఈ పనులన్నీ సగ మే పూర్తయ్యాయి. జాతర నాటికి ఈ పనులు పూర్త య్యే అవకాశం లేదు. అలాగే ఎనభైశాతం మరుగుదొడ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జిల్లా యం త్రాంగం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్ల జాతరకు కేటాయించిన నిధుల్లో సుమారు రూ.35 కోట్ల పనులు భక్తులకు ఉపయోగపడ లేదు.
     
    పట్టించుకోని మంత్రులు..
     
    పనులు నెమ్మదిగా జరుగుతున్నా మంత్రులు శ్రద్ధ పెట్టడం లేదు. కేంద్రమంత్రి బలరాంనాయక్, జిల్లా మంత్రులు పొన్నాల, సారయ్యలు జాతర పనులపై పూర్తిస్థాయిలో సమీక్ష జరపలేదు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఎనభైశాతం జారత పనులు పూర్తయిన తర్వాత మంత్రి పొన్నాల చుట్టపు చూపుగా వచ్చి గం టన్నర సేపు సమీక్ష జరిపి వెళ్లిపోయారు.
     
     బలవంతంగా భూమి తీసుకుంటున్నారు.
     ఊరట్టం కాజ్‌వే నుంచి దేవతల గద్దెల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం నాకున్న భూమిని బలవంతంగా అధికారులు లాక్కుంటున్నారు. పంట భూమిలోంచి రోడ్డును నిర్మించొద్దని ఎంతచెప్పినా అధికారులు మా గోడు పట్టించుకోవడం లేదు. నాకున్న ఎకరం భూమిలో రోడ్డు నిర్మాణంలో సుమారు పది గుంటల భూమిని కోల్పోతున్నాను. రోడ్డు నిర్మిస్తున్నామని అధికారులు చెప్పినప్పటి నుంచి భూమి పోతోందన్న దిగులుతో ఆరోగ్యం క్షీణించింది. అధికారులు.. పోలీసులను అడ్డుపెట్టుకుని గిరిజన రైతుల భూములను రోడ్ల పనుల కోసం గుంజుకుని నష్టాన్ని కలిగిస్తున్నారు.
     - నాలి సావిత్రి, మాజీ ఉపసర్పంచ్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement