మోనార్కులు | Monarkulu | Sakshi
Sakshi News home page

మోనార్కులు

Published Sat, Jan 17 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

మోనార్కులు

మోనార్కులు

వీళ్లను ఏమీ చేయలేరు
 
కర్నూలు(అగ్రికల్చర్) :  అక్రమార్కులపై చర్యలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. నిధులు తినేసినా చర్యలు లేకపోవడంతో మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా కలుగుతోంది. అక్రమార్కుల పట్ల కఠినంగా ఉండాల్సిన అధికారులు స్వాహా అయిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని తిరిగి ఉద్యోగాలలో కొనసాగిస్తుండటం గమనార్హం. అటువంటివారు మరింత భారీగానే అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలులో అక్రమాలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లాలో 2007 నుంచి ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ పథకం కింద దాదాపు రూ.2000 కోట్లు వ్యయం చేసినా అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడదు. రెక్కలు ముక్కలు చేసుకొని పనులు చేస్తున్నా కూలీలకు అందుతున్న వేతనం నామమాత్రమే. ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల్లో 20 శాతం మందికి రోజుకు లభిస్తున్న వేతనం రూ.50లోపే ఉంది. జిల్లా సగటు వేతనం రూ.109 మాత్రమే ఉంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వ్యవసాయ కూలీలకే ఉద్దేశించినా, కూలీల నోట్లో మట్టి పడుతోంది.

అక్రమార్కులు దర్జాగా నిధులను భోంచేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికవరీ చేయాల్సి ఉన్నా ఇవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. మొబైల్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణలు వేగవంతం చేసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మూడేళ్ల క్రితమే నిర్ణయించినా ఇది కార్యరూపం దాల్చలేదు. మొబైల్ కోర్టుల జాడ లేకుండాపోయింది. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో దాదాపు రూ.600 కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీలలో తేల్చినా అబ్బే... అదంతా అవినీతి కానే కాదంటూ అధికారులు దీనిని రూ.9.35 కోట్లుగా నిర్ధారించారు.

ఇది అవినీతి అంటూ నిర్ధారించిన దానిని కూడా రికవరీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బండ్ ప్లాంటేషన్, పేరుతో ఏటా లక్షల కొలదీ మొక్కలు నాటుతున్నారు. అదే విధంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. నాటినవాటిలో 50 శాతం బతికినా ఈ పాటికి జిల్లా పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. కానీ పచ్చదనం దాఖలాలు లేవు. కోట్లాది రూపాయలు నిధులు మాత్రం వ్యయం అయ్యాయి. ప్రతి ఏటా ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పనులు చేపడుతున్నారు.

కానీ ఈ పనులు జాడ లేకుండాపోయాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద రూ.2 వేలు కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి మచ్చుకు కూడా లేకపోవడం గమనార్హం. ప్రతి ఏటా జిల్లా నుంచి ఉపాధి కోసం లక్షల మంది వలసబాట పడుతుండటంతో ఎక్కడికక్కడ ఉపాధి పనులు కల్పించి వలసలు అరికట్టాలనేది ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం దారి తప్పింది. ఉపాధి పనుల కింద ఏటా కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్న వలసలు మాత్రం యథావిధిగానే జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు వ్యయం అవుతూనే ఉన్నాయి.

ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా కాసుల పంట పండించుకున్నది సిబ్బంది మాత్రమే. ఉపాధి పనులు కాసుల పంట పండించేవి కావడంతో కనీసం ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు సంపాదించుకుంటే చాలుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమవారినే నియమించుకునేందుకు అధికార తెలుగుదేశం నేతలు అధికారులపై తెస్తున్న ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నెలలు అవుతున్నా ఇప్పటికే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో తమవారిని అందలం ఎక్కించేందుకు ఇప్పటికే ఒత్తిళ్లు ఆగడం లేదు.
 
నిధులు స్వాహా చేసినా రికవరీ చెల్లిస్తే...
ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడితే వారిని ఉద్యోగం నుంచి తొలగించి, మొత్తాన్ని రికవరీ చేయాల్సి ఉంది. ఇబ్బడిముబ్బడిగా నిధులు స్వాహా చేసినా వారిపైన చర్యలు లేవు. స్వాహా చేసిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని అనేకమందిని ఉద్యోగాల్లో కొనసాగిస్తుండటం చూస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లు అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు తదితరులు ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడిన వారిలో పలువురు దుర్వినియోగం అయినట్లుగా నిర్ధారించిన మొత్తాన్ని రికవరీ చేయించుకొని యథావిధిగా కొనసాగిస్తుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
 
72 మందిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు ఇచ్చినా...
ఇటీవల జిల్లా కలెక్టర్ ఉపాధి అక్రమార్కులు 72 మందిపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు ఇచ్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసే బాధ్యతను ఎంపీడీఓలకు అప్పగించారు. కానీ ఇంతవరకు ఒక్క క్రిమినల్ కేసు నమోదు చేసిన దాఖలాలు కూడా లేవు. అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో అవినీతికి లెసైన్స్ ఇచ్చినట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఏ-కేటగిరీ కేసులు 10,608 మంది...
ఏ-కేటగిరీలో అవినీతికి పాల్పడినవారు ఇప్పటివరకు 10,608 మంది ఉన్నారు. ఏపీఓలు, ఈసీ రూ.50 వేలు, టెక్నికల్ అసిస్టెంట్ రూ.25 వేలు, ఫీల్డ్ అసిస్టెంట్ రూ.10 వేలు, ఆపై స్వాహా చేస్తే ఏ-కేటగిరీలోకి వస్తారు. ఇలా ప్రతి ఒక్కరికీ నిర్ణీత మొత్తం ఆపైన తింటే ఏ-కేటగిరీలో వస్తారు.

అటువంటివారు ఫీల్డ్ అసిస్టెంట్లు 1,836 మంది, టీఏలు 805, కంప్యూటర్ ఆపరేటర్లు 210, ఏపీఓలు 142, బీపీఎం 371, ఎంపీడీఓలు 10 మంది, ఏఈఈలు 39, ఈసీలు 149, మేట్‌లు 6,306 మంది, ఇతరులు 740 మంది ఉన్నారు. వీరందరూ క్రిమినల్ కేసులకు అర్హులే అయినప్పటికీ అతీగతీ లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి అక్రమాలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement