అక్రమార్కులు బెదరాలి
పోలీసులు ఆ విధంగా పనిచేయాలి
ముఖ్యమంత్రి పతకాల అందజేత కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు : నేర స్తులు, అక్రమార్కులు చట్టాలను చూసి భయపడాలని, ఆ విధంగా పోలీసులు తమ విధులను నిర్వహించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. శుక్రవారమిక్కడి కేఎస్‌ఆర్‌పీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పతకానికి ఎంపికైన 75 మంది పోలీసు అధికారులకు పతకాలను అందజేసిన ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రజలంతా ప్రభుత్వం అంటే పోలీసు శాఖే అని భావిస్తుంటారని, పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల పోలీసు అధికారులు సాధారణ ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాల్సిన అవసరమందన్నారు. ఇక నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడాలంటే పోలీసులు తమ విచారణలో సాక్ష్యాల సేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల పనితీరుకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.
అయితే శాంతి, భద్రతల విషయమై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పోలీసులకు కావలసిన అన్ని విధాలైన సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, అయితే అదే సందర్భంలో పోలీసులు సైతం తమ విధి నిర్వహణలో అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక అనేక సందర్భాల్లో తమ తప్పు లేకపోయినా పోలీసులు విమర్శలు ఎదుర్కొంటారని సిద్ధరామయ్య చెప్పారు. ఏటీఎంలలో భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత బ్యాంకులదని, అయితే ఏటీఎంలో బ్యాంకు ఉద్యోగిపై దాడి జరిగితే అందరూ పోలీసు శాఖను విమర్శించారని తెలిపారు. అంతేకాక పాఠశాలల్లో చిన్నారుల భద్రత ఆయా పాఠశాలల యాజమాన్యాలదే అయినప్పటికీ పాఠశాలల్లో చిన్నారులపై లైంగిక దాడులు జరిగితే అప్పుడు కూడా పోలీసులనే విమర్శించారని పేర్కొన్నారు. ఇక నేరాలు జరిగిన తర్వాత వాటిని ఛేదించేందుకు కష్టపడే కంటే నేరాలే జరగకుండా చూసుకోవడం ఉత్తమమని పోలీసులకు ఈ సందర్భంగా సూచించారు.కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ పాల్గొన్నారు.