బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తన కష్టాలు చెప్పుకోవడానికి జనతా దర్శన్ కార్యక్రమానికి వచ్చిన దళిత మహిళను అకారణంగా దూషించి, అక్రమంగా రిమాండ్ హోంలో ఉంచిన పోలీసులు, ఘటనకు కారణమైన సీఎం కార్యాలయ సిబ్బందిపై మూడు రోజుల్లోపు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నా చేపడుతానని హెచ్చరించారు. జనతాదర్శన్‌లో భాగంగా ఈనెల 17న సీఎంను కలవడానికి వచ్చిన దళిత మహిళ సవిత సీఎం కార్యాలయ సిబ్బంది, పోలీసులు అమర్యాదగా నడుచుకోవడమే కాకుండా ఆమె భర్తను మానసికంగా హింసించిన విషయంపై మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత మహిళతో కలిసి కుమారస్వామి విధాన సౌధలోని తన కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంటి హక్కుపత్రాలను తనకు ఇప్పించాలని సీఎంను వేడుకోవడానికి మాత్రమే సవిత ఈనెల 17న సీఎం క్యాంపు కార్యాలయం అటుపై ఆయన నివాసం కృష్ణ వద్దకు వెళ్లిందన్నారు.
అయితే అనుమానాస్పదంగా తిరుగుతోందన్న కారణంతో పోలీసులకు అప్పగించామని సీఎం కార్యాలయ సిబ్బంది చెబుతుండగా నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ మాత్రం సవిత విషం తీసుకోవడానికి సిద్ధపడటంతో ఆమెను అరెస్టు చేశామని చెబుతున్నారన్నారు. అంతే కాకుండా అదే రోజు సవితను రిమాండ్ హోంకు పంపించడమే కాకుండా ఒక రోజంతా ఆమెను అక్కడే ఉంచారన్నారు. ఆమెను విడిపించడానికి వచ్చిన భర్తను కూడా పోలీసులు దూషించారన్నారు. ఈ విషయమై దర్యాప్తు చేసి ఘటనకు కారణమైన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నాకు దిగుతానని కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఈ విషయంపై ప్రతిస్పందించిన సీఎం సిద్ధరామయ్య ఈ విషయమై అధికారులతో మాట్లాడి బాధిత మహిళకు న్యాయం చేకూర్చడమే కాకుండా సీఎం కార్యాలయ సిబ్బంది తప్పు ఉంటే వారిపై కఠిన చర్యలు చేపడుతామన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఈ సందర్భంగా సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. కాగా, సవిత వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 26న స్వయంగా మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.
ఆ పనిచేయడానికి భర్త, పిల్లలతో వస్తారా: సవిత
విధానసౌధలో జరిగిన మీడియా సమావేశంలో సవిత గద్గద స్వరంతో తనపట్ల పోలీసులు, సీఎం కార్యాలయ సిబ్బంది ప్రవర్తించిన తీరును వివరించారు. ‘నివాసం ఉంటున్న ఇళ్లకు సంబంధించిన హక్కు పత్రం కోసం అనేక ప్రభుత్వ కార్యాలయాలతోపాటు గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌ను కూడా కలిసి విన్నవించాను. అయినా ఫలితం కనబడలేదు. దీంతో సీఎంను కలవడానకి నా భర్తతో పాటు పిల్లలను తీసుకుని ఈనెల 17న వెళ్లాను. అయితే అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నానని నన్ను సీఎంతో భేటీ కావడానికి పంపించలేదు. నాతో పాటు వచ్చిన వారందరినీ లోనికి పంపించారు. ఈ విషయమై అక్కడి ఉన్న సిబ్బందిని అడిగినందుకు పోలీసులకు చెప్పి మొదట పోలీస్‌స్టేషన్‌కు అటుపై రిమాండ్ హోంకు పంపించారు. వేశ్యవృత్తి చేయడానికి ఎవరైనా పిల్లలు, భర్తతో కలిసి వస్తారా? పోలీస్‌స్టేషన్‌లోనూ రిమాండ్ హోంలోనూ నన్ను సూటి పోటీ మాటలతో అవమానించారు. నన్ను విడిపించడానికి వచ్చిన నా భర్తను కూడా పోలీసులు బెదిరించారు.’ అని సవిత వాపోయారు.