ఆదుకునే నేత కోసం..
సాక్షి, హైదరాబాద్: అమ్మతో వచ్చిన ఆ ఇద్దరు వికలాంగులు(మరుగుజ్జులు) సచివాలయంలో ని ‘డి’ బ్లాక్ దగ్గర (సి-బ్లాక్ దగ్గర కూర్చోవడానికి లేకపోవడంతో) సీఎం కేసీఆర్ కోసం సాయంత్రం వరకు ఆశగా ఎదురు చూశారు. మంత్రులు ఇంటి దారి పడుతున్నారు. సమ యం మించిపోయేకొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. అటుగా వచ్చిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. ‘‘సారూ మేం వరంగల్ జిల్లా చెన్నారావుపేట నుంచి వచ్చాం మాకు పెద్దసారు (ముఖ్యమం త్రి) ఏదైనా సాయం చేస్తడని, సారు రాలే! మా బిడ్డ పాళ్లకొండ కుమారస్వామి పెద్ద సదువు సది విండు (బీఈడీ), ఏదైనా నౌకరీ ఇప్పిం చండి’’ అని తల్లి సారమ్మ హోంమంత్రిని ప్రాధేయపడింది.
‘‘ మేం అమ్మ రెక్కల కష్టాలపై బతుకుతున్నాం సార్, అమ్మకు ముగ్గురు బిడ్డలం. పెద్ద అక్క చనిపోయింది. చిన్నక్క ఇంటిదగ్గరే ఉంటోంది. ఏ పని చేయలేదు. నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే అమ్మను, అక్కను బాగా చూసుకుంటాను సార్. ఎలాగైనా సీఎం సార్‌ను కలవనివ్వండి’’ అని కుమారస్వామి హోంమంత్రిని దీనంగా వేడుకున్నాడు. దీంతో స్పందించిన హోంమంత్రి అతడి సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని వీటిని సీఎంకు పంపండి అని తన పీఏకు చెప్పాడు. ఆ తర్వాత వారు నిరాశతో చెన్నారావుపేటకు తిరుగు పయనమయ్యారు.