అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం
► మాజీ సీఎం కుమారస్వామి
మండ్య(కర్నాటక): వచ్చే ఎన్నికల్లో తాము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, జాతీయ పార్టీలకు దీటుగా పోటీ ఇస్తామని మాజీ సీఎం హెచ్.డి.కుమార స్వామి అన్నారు. ఆదివారం మండ్య తాలూకాలోని బసరాలు గ్రామంలో తాయమ్మ, రామేగౌడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం, వికలాంగులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న కుమార మీడియాతో మాట్లాడుతూ...జేడీఎస్ పార్టీ కాంగ్రెస్‌కు గులాంగిరి చేయడం లేదని, వారు చెప్పినట్లు చేయడానికి జేడీఎస్ కార్యకర్తలు ఒప్పుకోరని, పార్టీలో ఎవరు కూడా వేలిముద్రలు వేసే వారు లేరని కుమార అన్నారు.
శాసన మండలి సభాపతిపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంకు జేడీఎస్ పార్టీ మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. దీంతో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని, అన్నిటికి సీఎం చెప్పినట్లు చేయడానికి తాము వేలి ముద్రగాళ్లు కాదని కుమార ఎద్దేవా చేశారు. మూడేళ్ల క్రితమే బీజేపీ–జేడీఎస్‌ల మధ్య మద్దతు ఒప్పందం ఉందని, మరో రెండేళ్లు పాటు దీనిని కొనసాగిస్తామన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధులు కేటాయించకుండా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో త్వరలో పార్టీ సమావేశం నిర్వహించి అభ్యర్థిని ప్రకటిస్తామని కుమార స్వామి అన్నారు.