కర్ణాటక సీఎస్ అరవింద్ జాదవ్
- తల్లి పేరిట ప్రభుత్వ భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన సీఎస్ అరవింద్ జాదవ్
- మీడియాకు దొరకకుండా జారుకున్న వైనం
- ఉదంతంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్.. నివేదికకు ఆదేశం
బెంగళూరు : అక్రమ మార్గంలో ప్రభుత్వ భూమిని తన తల్లిపేరిట కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరవింద్ జాదవ్ విషయమై రెవెన్యూశాఖ నుంచి నివేదిక కోరినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కృష్ణలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. అనేకల్ తాలూకా రామనాయకనహళ్లి సర్వే నంబర్ 29 పరిధిలోని 66 ఎకరాలను గతంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి కేటాయించామన్నారు. అయితే ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారిలో అరవింద్ జాదవ్ తల్లి తారాబాయ్ కూడా ఉందన్నారు. ఆమెకు 8 ఎకరాల 30 గుంటల స్థలం కేటాయించినట్లు మీడియాల్లో వచ్చిన వార్తల వల్ల తెలిసిందని తెలిపారు.
ఈ విషయమై రెవెన్యుశాఖ నుంచి సమగ్ర నివేదిక కోరినట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. నివేదిక అందిన తర్వాత తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీఎస్ అరవింద్ జాదవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నగరానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త భాస్కరన్ అవినీతి నిరోధక దళానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందించడానికి సీఎస్ అరవింద్‌జాదవ్ నిరాకరిస్తూ మీడియాకు దొరకకుండా ఆయన విధానసౌధలో మెట్ల ద్వారా పరిగెత్తుకొంటూ వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భూమి కొనుగోలుకు సంబ ంధించి ముఖ్యమైన దస్త్రాలలోని విషయాలను మార్పు చేయడానికి సీఎస్ తెలుస్తోంది. నగరంలోని కందాయ భవన్ (రెవెన్యూ శాఖ ప్రధాన కార్యాలయం)లో ఈ భూమి కొనుగోలుకు సంబంధించి ఐదుగురు అధికారులు విషయాలను మారుస్తున్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. మీడియా అక్కడకు చేరుకోగా వారు తలోదిక్కు వెళ్లిపోయారు. ఆ అధికారుల్లో అరవింద్ జాదవ్ పర్సనల్ సెక్రెటరీ సతీష్ ఉండటం గమనార్హం.
సీఎస్‌కు అక్షింతలు: అవినీతి ఆరోపణల నేపథ్యంలో అరవింద్‌జాదవ్ మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలుసుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వివాదాస్పదమైన స్థలాన్ని కొన్న మాట వాస్తవమేనని, అయితే ఎక్కడా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అరవింద్‌జాదవ్ తెలిపారు. తన పదవీకాలాన్ని పొడగించడాన్ని సహించలేని కొంతమంది ప్రభుత్వ అధికారులు తన పై అనవరసర ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీఎం సిద్ధరామయ్య మాత్రం ‘ఉన్నత హోదాలో ఉన్నటువంటి మీరు ఇలా చేయడం సరికాదు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అయినా నివేదిక తప్పించుకుని అటుపై మీతో మాట్లాడుతా.’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సీఎస్ అరవింద్ జాదవ్ వివరణ ఇచ్చే సమయంలో రెవెన్యూశాఖ మంత్రి కాగోడు తిమ్మప్పతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శంకర్ అక్కడే ఉన్నారు. ఇక ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలతో సంయమనం కోల్పోయిన కాగోడు తిమ్మప్ప సాకు బిడరప్ప...నాను ‘దడ్డ’. అదిక్కే ఈ విషయబగ్గే తిలుదుకొల్లక్కు ఆగలిల్ల (ఇక చాలు వదిలేయండి...నేడు చేతకాని వాడను. అందుకే ఈ విషయం గురించిన సమాచారం తెలుసుకోవడానికి వీలుకాలేదు.’ అని పేర్కొన్నారు.