ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?
ఇప్పటికి జ్ఞానోదయం అయ్యిందా ?
Published Sat, Nov 19 2016 1:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
భత్యంతో సరిపెట్టారు !
అటకెక్కిన పోలీసుల వేతన పెంపు
ఆర్డర్లీ వ్యవస్థ రద్దుతో కొంత ఉపశమనం
డిసెంబర్ ఒకటి నుంచి అలవెన్స్ అమలు
వచ్చే ఏడాది పే కమిషన్
సీఎం సిద్ధరామయ్య వెల్లడి
సాక్షి, బెంగళూరు : పోలీస్ శాఖ సమస్యలు పరిష్కరించడంలో సిద్ధు సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వివిధ రకాల భత్యాలను పెంచుతూ జీతాల పెంపు మాత్రం సాధ్యం కాదని తేల్చేసింది. వేతనాలు భారీగా పెరుగుతాయన్న ఆశతో ఎదురుచూసిన క్షేత్రస్థాయి సిబ్బంది ఈ తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశలో పడిపోయారు. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణలో సీఎం సిద్ధరామయ్యతో పాటు హోం మంత్రి పరమేశ్వర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఆ స్థానాల్లో ఉన్న సిబ్బందికి కానిస్టేబుల్ శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటామన్నారు. అయితే ఆర్డర్లీ స్థానంలో ఇతర వ్యక్తులను నియమించాలా లేదా అన్న విషయంపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ఇప్పటి వరకూ సిబ్బందికి ఇస్తున్న యూనిఫాం అలవెన్సును రూ.100 నుంచి రూ.500 పెంపుతో పాటు కొత్తగా ట్రాన్స్ పోర్ట్ అలవెన్సును రూ.600 లు, రిస్క్ అలవెన్సును రూ.1000 గా ఇవ్వనున్నామన్నారు. మొత్తంగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కొక్కరు అలవెన్సుల రూపంలో నెలకు రూ.2000 లు అందుకోనున్నారు. డిసెంబర్ వేతనాలతో తీసుకోవచ్చని సీఎం చెప్పారు. దాదాపు 75 వేల మంది పోలీసు సిబ్బంది, అధికారులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. తాజా నిర్ణయంతో ఖజానాపై ఏడాదికి రూ. 200 కోట్ల భారం పడనుందని సీఎం పేర్కొన్నారు.
వేతనాల పెంపు లేదు...
వచ్చే ఏడాది ప్రభుత్వం నూతనంగా పే కమిషన్ వేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు సిబ్బంది వేతనాలు పెంచడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిత్యం ఒత్తిడితో పనిచేస్తుండటం వల్లే పోలీసులకు 12 నెలలకు బదులు 13 నెలల వేతాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. గతంలో కానిస్టేబుల్‌గా హోంశాఖలో ఉద్యోగం పొందిన వారు ముప్‌పై ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రమోషన్ పొందేవారన్నారు. అయితే పదేళ్లకొకసారి తప్పక ప్రమోషన్ అనే విధానం (ఆక్సిలరేటెడ్ ప్రమోషన్) విధానం అమలు చేయాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.
దశలవారీగా నియామకాలు...
రాష్ట్ర హోంశాఖలో ఖాళీలను దశలవారరీగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. 2016-17 ఏడాదికి గాను 7815 కానిస్టేబుల్, 711 ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న వారిలో దాదాపు 5 వేల మంది శిక్షణలో ఉన్నారన్నారు. 2017-18లో 4.561 కానిస్టేబుల్, 333 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనుండగా 2018-19 ఏడాదిలో 4,045 కానిస్టేబుల్, 312 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. దీని వల్ల రాష్ట్ర హోంశాఖలో క్షేత్రస్థాయి పోస్టులన్నీ భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య వివరించారు. ఇక వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలని అధికారులకు సూచించామన్నారు.
అటకెక్కిన ప్రతిపాదన
జీతాలు పెంచుతామని ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిద్ధు ఔరాద్కర్ నివేదికను అటకెక్కించ్చేసింది. కొన్నినెలల క్రితం జీతాల పెంపు తదితర డిమాండ్లతో పోలీసులు సామూహిక సెలవు ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని చెమటలు పట్టించిన విషయం తెల్సిందే. క్రమశిక్షణ శాఖలో ఇంతటి వ్యతిరేకతను అప్పటికప్పుడు అణచివేయాలని సామూహిక సెలవు నిర్ణయాన్ని అప్పటికెలాగో ఆగిపోయేలా చేసిన ప్రభుత్వం, అనంతరం సీనియర్ ఐపీఎస్ అధికారి ఔరాద్కర్ నేతృత్వంలో ఓ కమిటీని వేసి వివిధ రాష్ట్రాలలో పోలీసుల వేతనాలపై అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 24 శాతం జీతం పెంచాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ ప్రతిపాదనలు అటకెక్కాయని పోలీసు సిబ్బంది పేర్కొంటున్నారు.
సంధులు... సమాధానాలు
పోలీసు శాఖ డిమాండ్లపై శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య నవ్వులు పూయించారు. సంధులు సమాధానాలు నాకూ తెలుసు అంటూ గుణసంధి, సువర్ణ దీర్ఘ సంధి గురించి ఉదహరించారు. అంతకు ముందు ఓ విలేకరి పోలీసుల అలవెన్స్ పెంపు విషయంలో ఇప్పటికి మీకు జ్ఞానోదయం అయ్యిందా ? అంటూ ప్రశ్నించారు. సీఎం సమాధానమిస్తూ ‘జ్ఞానం ఉంది... అయితే ఇప్పటి వరకు దాన్ని ఉపయోగించడానికి కుదరలేదు అంటూ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఇప్పటికి తాము పోలీసుల ఆశలను నెరవేర్చాం..అంటూ సదరు విలేకరికి కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఊరుకోకుండా జ్ఞానం ఎప్పుడు ఉదయించదు.. జ్ఞానం ఎల్లప్పుడు ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకోవాలి’ అని చరుకంటించారు. ఇంతలో పక్కనే ఉన్న మరొకరు జ్ఞాన+ ఉదయం= జ్ఞానోదయం అని పేర్కొంటూ ఇది సవర్ణ దీర్ఘసంధి అని పేర్కొన్నారు. ఇంతలో మరోసారి సిద్ధరామయ్య కలుగచేసుకుని ఇది గుణసంధి అని చెప్పి మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు.
Advertisement
Advertisement