నో ప్రాబ్లం...
ఫిర్యాదులు చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు....
ఒక్క గుంట భూమిని కూడా డీనోటిఫై చేయలేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు: ఆర్కావతి డీ-నోటిఫికేషన్‌కు సంబంధించి తనపై ఫిర్యాదులు చేస్తుండడంపై తనకెలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించేందుకే తమ ప్రభుత్వం కెంపయ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మైసూరు పర్యటనలో భాగంగా గురువారం మైసూరుకు సమీపంలోని సుత్తూరులో జరుగుతున్న జాతర మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆర్కావతి అంశానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదునైనా కెంపయ్య కమిషన్‌కు అందజేయవచ్చని సూచించారు. ఇక తనపై సైతం ఫిర్యాదులిచ్చినా సంతోషమేనని అన్నారు. కనీసం ఒక్క గుంట భూమిని కూడా తాను డీనోటిఫై చేయలేదని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.
తాను చేసింది కేవలం రీ మాడిఫికేషన్ తప్పితే డీనోటిఫికేషన్ కాదని స్పష్టం చేశారు. ఆర్కావతి డీనోటిఫికేషన్ జరిగింది యడ్యూరప్ప, కుమారస్వామిల కాలంలో అని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ భూస్వాధీన ఆర్డినెన్స్‌పై తమ ప్రభుత్వం పోరాటం సాగిస్తుందని తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకూ తగ్గుతూనే ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ దిశగా దృష్టి సారించలేదని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.