మద్యం షాప్‌లకు అనుమతులు
నకిలీ మద్యాన్ని అరికట్టే దిశగా...
సభలో చర్చించి నిర్ణయం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన
నూతన విధానంతో ఖజానాకు ఆదాయం : ఎమ్మెల్యే రమేష్‌కుమార్
మద్యం షాప్‌లకు అనుమతులు
బెంగళూరు: రాష్ట్రంలో సారాయి అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన అనంతరం నకిలీ మద్యం ప్రవాహం పెరిగిపోయిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ మద్యం ప్రవాహాన్ని అరికట్టాలంటే కొత్త మద్యం షాప్‌ల లెసైన్స్‌ల జారీ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విధానసభలో శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య తగ్గలేదని, అదే సందర్భంలో నకిలీ మద్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లో యధేచ్చగా లభిస్తోందని అన్నారు. సారాయి అమ్మకాలను నిషేధించిన అనంరతం టీ స్టాల్స్, కిరాణా దుకాణాల్లో సైతం మద్యాన్ని అమ్ముతున్నారని తెలిపారు. ‘ఆడపడుచుల కన్నీరు తుడిచే ఉద్దేశంతో గత ప్రభుత్వం రాష్ట్రంలో సారాయి అమ్మకాలను నిషేధించింది. అయితే సారాయి స్థానంలో నకిలీ మద్యం ప్రవేశించింది. ప్రజలు నకిలీ మద్యాన్ని సేవించడం మానలేదు, ఆడపడుచుల కన్నీరు ఆగలేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
గ్రామాల్లో నకిలీ మద్యం ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే మద్యం షాప్‌లకు లెసైన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే గతంలో ఓ సారి వైన్‌స్టోర్‌లకు లెసైన్స్‌లు అన్న తమ ఆలోచనను ప్రకటించినపుడు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. అందువల్ల ఈ విషయంపై ఓ సారి సభలో చర్చించి, సభ్యుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్ మాట్లాడుతూ...కొత్త లెసైన్స్‌ల జారీ విధానం ద్వారా నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇక ఎక్సైజ్ శాఖలో అవినీతిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.