హాస్టళ్లపై ఏసీబీ పంజా
♦ యాలాల బీసీ బాలుర, కుల్కచర్ల మండలం
♦ ముజాహిద్‌పూర్ గిరిజన హాస్టళ్లలో తనిఖీలు
♦ బయటపడిన అవకతవకలు
♦ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్న ఏసీబీ అధికారులు
♦ జిల్లాలోని రెండు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు
♦ విద్యార్థుల హాజరు, మెనూ, వసతులపై ఆరా
♦ రికార్డుల నమోదులో వ్యత్యాసాల గుర్తింపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాల్లో అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. మూడేళ్లుగా ఏసీబీ అధికారులు వసతిగృహాల్లో అకస్మిక తనిఖీలు చేపడుతుండడంతో ఈ వ్యవహారం క్రమంగా బట్టబయలవుతోంది. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతూ సర్కారు సొమ్ము స్వాహా చేస్తున్నారు. అంతేకాకుండా కాస్మోటిక్ చార్జీలు.. ఉపకార వేతనాలను అక్రమంగా డ్రా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వసతిగృహ సంక్షేమాధికారి మొదలు పైస్థాయి వరకు ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ పంజా విసిరింది. జిల్లాలోని యాలాల, కుల్కచర్లలోని వసతి గృహాలపై మంగళవారం దాడులు చేసింది. ఉదయం 9 గంటలకు దాడులు ప్రారంభించిన అధికారులు హాస్టళ్ల సిబ్బందిని హడలెత్తించారు. యాలాలలోని బీసీ బాలుర వసతి గృహంలో వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ తదితర వివరాలు సేకరించారు. వసతిగృహంలో 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉంది. కానీ అధికారుల తనిఖీలో సమయంలో 56 మందే ఉన్నారు. కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గిరిజన హాస్టల్‌లోనూ ఉదయం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగాయి.
ఇక్కడి హాస్టల్‌లో 273 మంది విద్యార్థులున్నట్లు రిజిస్టర్‌లో నమోదు చేశారు. కానీ 151 మందే ఉన్నారు. యాలాల/కుల్కచర్ల: యాలాల, కుల్కచర్లలోని ప్రభుత్వ వసతిగృహాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాలాలలోని బీసీ బాలుర హాస్టల్‌లోని వసతులు, విద్యార్థుల హాజరుశాతం, ఆహార పదార్థాల నాణ్యత, మెనూ వివరాల గురించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు వివరాలు సేకరించారు. బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ సుందరమ్మ బాలుర వసతి గృహానికి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. వసతిగృహంలో మొత్తం 96 మంది విద్యార్థులున్నట్టు రికార్డుల్లో ఉండగా, ఏసీబీ అధికారుల తనిఖీలో 56 మందే ఉన్నట్లు గుర్తించారు. కూరగాయలు, బియ్యం తదితర స్టాకు వివరాలు సేకరించారు. వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు, మెనూ ప్రకారం భోజనం అందడం లేదనే విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉదయం నుంచి సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఈ తనిఖీలు ఏసీబీ సీఐలు నాగేశ్వరరావు, రాజేష్ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్ గిరిజన హాస్టల్‌లో కూడా మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ తనిఖీ లు కొనసాగాయి. ఏసీబీ సీఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 7 గంటలకు హాస్టల్‌కు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్ వసతులను పరిశీలించారు. వంటగది, విద్యార్థుల గదులను పరిశీలించారు. వార్డెన్ నాగలక్ష్మి స్థానికంగా లేకపోవడంతో ఆమెకోసం మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచిచూశారు. రెండు గంటలకు ఆమె రావడంతో రికార్డులు పరిశీలించారు. అనంతరం ఏసీబీ సీఐ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడారు. హాస్టల్‌లో 273 మంది విద్యార్థులున్నట్లు రీజిస్టర్‌లో ఉన్నా.. హాస్టల్ మాత్రం 151 మందే ఉన్నారని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేద ని, నాణ్యత లేదని విద్యార్థులు చెప్పారన్నారు. రికార్డు ప్రకారం బియ్యం లేవన్నారు. విద్యార్ధులకు బట్టలు,నోట్ పుస్తకాలు, చాపలు ఇవ్వకుండా దాచి పెట్టినట్లు తెలిపారు. ఈ విషయంపై వార్డెన్ నాగలక్ష్మి, డీటీడబ్ల్యూఓ రామేవ్వర్‌లను విచారించామ ని.. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. తనిఖీల్లో ఏసీబీ సీఐ లక్ష్మి పాల్గొన్నారు.
♦ మూడేళ్ల క్రితం మహేశ్వరం మండలం బీసీ సంక్షేమశాఖ వసతిగృహంపై దాడులు చేసిన అధికారులు పలు అక్రమాలను గుర్తించారు. అప్పట్లో ఉన్న వసతిగృహ సంక్షేమాధికారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
♦ గతేడాది ఘట్‌కేసర్‌లోని బీసీ సంక్షేమ వసతిగృహంపైనా ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాలను వెలికితీశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ వసతిగృహ సంక్షేమాధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు.
♦ మంగళవారం కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహం, యాలాల మండల కేంద్రంలోని వెనకబడిన తరగతులు సంక్షేమశాఖ వసతిగృహంలో ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ పలు అవకతవకలను గుర్తించింది.
♦ ఈ దాడుల్లో వెలుగులోకి వచ్చిన విషయాలను ఏసీబీ అధికారులు త్వరలో జిల్లా యంత్రాంగానికి నివేదిక పంపనున్నారు.