కూసుమంచి, న్యూస్‌లైన్: పాలేరు.. అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ జరగని వ్యాపారాలంటూ లేవు. కల్తీ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, క్రూడాయిల్‌తో పాటు చివరకు ప్రాణాలను హరించే మిథేల్ వరకు అన్నీ అక్రమ వ్యాపారాలే. వీటి మాటున అక్రమార్కులు లక్షలు గడిస్తున్నారు. పాలేరుకే పరిమితం కాకుండా నల్గొండ జిల్లాకు కూడా విస్తరిస్తున్నారు. పాలేరులో గతంలో పలువురి ఇళ్లలో అక్రమంగా ఉంచిన డ్రమ్ముల కొద్దీ వైట్ పెట్రోల్, నీలి కిరోసిన్ లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలుకు వెళ్లినా తిరిగి అదే వ్యాపారాలను ఎంచుకోవ టం చూస్తే ఎంత అక్రమార్జన ఉంటుందో అర్థమవుతుంది.
పాలేరులో రాష్ట్రీయ రహదారి పక్కన హోటళ్లు ఉండడంతో అక్రమార్కులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. వైజాగ్, కాకినాడ నుంచి హైదారాబాద్ వరకు నిత్యం ఈ రహదారి గుండా వివిధ నూనెలు, రసాయనాలతో ట్యాంకర్లు వెళుతుంటాయి. వారు ఇక్కడ ట్యాంకర్లను ఆపి భోజనాలు చేస్తుంటారు. దీంతో అక్రమార్కులు ట్యాంకర్ల డ్రైవర్లను మచ్చిక చేసుకుని క్రూడాయిల్, కిరోసిన్, ముడి పెట్రోల్, డీజిల్, రెక్టిఫైడ్ స్పిరిట్, మిథేల్ వంటి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. వాటిని గోడౌన్‌లలో రహస్యంగా నిల్వ ఉంచి రాత్రి వేళల్లో ఇతర ప్రదేశాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. మరికొందరు పలు కెమికల్స్ ద్వారా కల్తీ డీజిల్, పెట్రోల్ కూడా తయారు చేసి అక్రమ వ్యాపారం నడుపుతున్నారు. క్రూడాయిల్‌ను వంట నూనెలులగా తయారు చేసి విక్రయిస్తుంటారు. కొందరు హోటళ్ల యజమానులు ఈ వ్యాపారాల్లో ఆరితేరారు. మరి కొందరు ఈ వ్యాపారం కోసమే హోటళ్లను తెరవడం గమనార్హం.
స్పిరిట్‌తో మద్యం, సారా కల్తీ...
కొందరు అక్రమార్కులు ట్యాంకర్ల ద్వారా స్పిరిట్ (ఆర్‌ఎస్‌ను) గత కొంత కాాలంగా సేకరిస్తూ దాన్ని సారా, మద్యం సీసాలలో కలిపి క ల్తీ చేసి అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా తక్కువ ఖర్చుతో మత్తు ఎక్కే మద్యం తయారు చేసి మార్కెట్ ధరకే రహస్యంగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా పాలేరులో కాకుండా సమీపంలోని తోటల్లో, గుట్టల్లో జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల పోచారం- బీరోలు గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో డ్రమ్ముల కొద్దీ స్పిరిట్‌ను నిలువ ఉంచగా పోలీసులు పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది.
కొంప ముంచిన మిథేల్....
గతంలో అక్రమార్కులు స్పిరిట్‌తో మద్యం, సారాను కల్తీ చేసి అమ్ముతున్నా అది పెద్దగా ప్రమాదకరంగా మారలేదు. కాగా ఇటీవల పాలేరుకు చెందిన మృతుడు కుసులూరి రాజయ్య, అతని కుమారుడు స్పిరిట్, పలు రకాల ఆయిళ్లను ట్యాంకర్ల ద్వారా తీసుకుంటూ వాటిని విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో మద్యం, సారా కట్టడి కావటంతో మిథేల్ ఆల్కహాల్‌ను సారాగా అమ్మవచ్చని ట్యాంకర్ డ్రైవర్ చెప్పటంతో అతను అర లీటరు మిథేల్ తీసుకుని సారాగా తయారు చేసి ప్రయోగం చేశాడు. అది వికటించి ఆ వ్యాపారితో పాటు దాన్ని తాగిన మరో నలుగురు మృత్యువాత పడాల్సి వచ్చింది. మరో 27 మంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్రమ వ్యాపారాలను అదపు చేయలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా స్పందించి ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట ఏదీ..?
Published Mon, Mar 17 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement