ఇసుకాసురులు
తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న ఇసుక మాఫియా
♦ అడ్డగోలు తవ్వకాలతో పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
♦ అక్రమార్కులు చెలరేగిపోతున్నా కళ్లు మూసుకుంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడానికి, కరకట్టలు బలహీనమవడానికి మాత్రమే కాదు.. అనేక పర్యావరణ దుష్పరిణామాలకు కారణం ఒక్కటే.. ఇసుక మాఫియా!
అడ్డూ అదుపు లేని ఇసుక తవ్వకాలు అటు పర్యావరణం, ఇటు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నదీతీరాల్లో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో చినుకు నేలలోకి ఇంకడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు మరింత కిందకు జారిపోతున్నాయి. జలసిరితో కళకళలాడాల్సిన భూగర్భం తడారి ఎడారిగా మారుతోంది. నదీగర్భంలో సైతం నీటి జాడ కరువవుతోంది. నదిలో ఇసుక కరువవడంతో నీటి ప్రవాహవేగం పెరుగుతోంది.
నదీజలాలు భూగర్భంలోకి ఇంకకుండానే వడివడిగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. నీటి గలగలలతో కళకళలాడాల్సిన నదులు సహజఅందాలకు దూరమై వట్టిపోతున్నాయి. ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతుండడంతో కృష్ణా, గోదావరి నదుల కరకట్టలు బలహీనమవుతున్నాయి. ఫలితంగా వరదల సమయంలో గండ్లు పడి సమీప ప్రాంతాలను ముంచెత్తడంతో భారీ నష్టాలు చవిచూడాల్సివస్తోంది.
కంట్లో ఇసుక కొట్టారు..
2009 అక్టోబర్ 2న వరదలతో తుంగభద్ర నది పోటెత్తడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని తీర ప్రాంతాలన్నీ ఇసుకమయం అయ్యాయి. భారీ పరిమాణంలో ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో ఇసుక మాఫియా కోరలు విప్పింది. ఈ రెండు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోజూ వందల లారీల ఇసుక అక్రమ రవాణా జరిగింది. మంత్రాలయం నుంచి జొహరాపురం వరకు తుంగభద్ర తీరంలోని గ్రామాల్లో వేల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు పుట్టుకొచ్చాయి.
కళ్ల ఎదుటే ఇసుక లారీలు, ట్రాక్టర్లు తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. రెవెన్యూ, పోలీసు, గనుల శాఖల అధికారులకు మామూళ్లు ముట్టేవి. రెండేళ్లు గడిచేసరికి తుంగభద్ర నది గర్భం నుంచి ఇసుక కనుమరుగైపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల నడుమ నుంచి తుంగభద్ర పారుతున్నా.. ఇసుక లేక భూగర్భంలోకి నీళ్లు ఇంకడం లేదు. భూగర్భ జలాలు లభించక రెండు జిల్లాల పరిధిలో నీటికి కటకట ఏర్పడింది. అంతేనా.. ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకల ఒత్తిడితో తీర ప్రాంత గ్రామాల రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి.
మం‘జీర’బోతోంది
మంజీరా నది పరీవాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాలతో ‘ఇసుకాసురులు’ పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పట్టా భూముల్లో ఇసుక మేటల తొలగింపు పేరిట అనుమతులు తీసుకున్న మాఫియా ఏకంగా మంజీరానే తోడేసింది. మెదక్ జిల్లా తూప్రాన్, సంగారెడ్డి, పటాన్‌చెరుతో పాటు నిజామాబాద్‌లోని బిచ్కుంద, బీర్కూరు, కోటగిరి, మద్నూరు మండలాల్లోని పట్టాభూముల్లో జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇసుక మాఫియా ఈ పట్టా భూముల్లో అనుమతులకు మించి ఇసుకను తోడి.. రోజుకు 600 నుంచి 800 లారీల్లో హైదరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడించింది. 2,14,500 క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు అనుమతులు పొంది.. ఐదు రెట్లు అదనంగా ఇసుక తవ్వుకెళ్లారన్న ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరపాలని నిర్ణయించినా.. ముందుకు సాగడం లేదు.
తడారిన భూగర్భం
ఇసుక తవ్వకాలు పేట్రేగడం, మరోవైపు భూగర్భ జలాల వినియోగం మితిమీరడంతో నీళ్లు పాతాళానికి వెళ్లిపోతున్నాయి. రెండేళ్లకోసారి భూగర్భ జల శాఖ నిర్వహించే అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల కింద జరిగిన అధ్యయనం నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు. అయితే అందులోని కీలక సమాచారాన్ని ‘సాక్షి’ సేకరించింది.
ఈ నివేదిక ప్రకారం తెలంగాణలోని 1,057 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలు అత్యంత ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థాయికి దిగజారాయి. లభ్యతతో పోల్చితే భూగర్భ జలాల వినియోగం 100 శాతానికి మించడంతో ఆ గ్రామాల్లో భూగర్భం తడారిపోయింది. ఇక 214 గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితి విషమం (క్రిటికల్)గా ఉంది. ఇక్కడ భూగర్భ జలాల వినియోగం 90-100 శాతం మధ్యలో ఉంది. 443 గ్రామాల్లో 70-90 శాతం మధ్య వినియోగంతో పరిస్థితి స్వల్ప విషమం (సెమీ క్రిటికల్)గా తయారైంది.
పర్యావరణ ధ్యాసే లేదు
నదీ తీరంలో 5 హెక్టార్లు, అంతకు మించి ఇసుక ఉన్న ‘రీచ్’లలో ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ ఇసుక వేలం ప్రక్రియలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. రీచ్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి జేసీబీలు, ప్రొక్లెయిన్లతో మితిమీరి ఇసుక తోడేస్తున్నారు. నదుల గర్భంలో రాళ్లు బయటపడే వరకు ఈ తవ్వకాలు జరిగినా అధికారులు ‘మామూళ్లు’గా కళ్లు మూసుకుంటున్నారు.
హే కృష్ణా...
కృష్ణా జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతాల్లో లక్షల టన్నుల్లో ఇసుక తవ్వేస్తున్నారు. పదిహేనేళ్లుగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ నీటి నిల్వలు పడిపోతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరదలు వస్తాయి. ఇసుక మేటలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఇసుక, మట్టి పొరలు సర్దుకుంటాయి. భారీ వరదలు వచ్చిపోయిన రెండు మూడు రోజులకు ప్రకాశం బ్యారేజీ వద్ద చిన్నపాటి ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. ఇసుక, మట్టి పొరలు సర్దుకునే క్రమంలో ఈ ప్రకంపనలు వస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మోతాదుకు మించి ఇసుక తవ్వకాలు కూడా వీటికి కారణమని పేర్కొంటున్నారు.
♦ తుంగభద్ర నది.. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల మధ్య నుంచి ప్రవహిస్తున్నా వందల గ్రామాలు, తండాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి! గుక్కెడు మంచినీటి కోసం గొంతెండుతున్నాయి!
ఎందుకు?
తీరప్రాంతంలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. నీటిచుక్క కరువైంది!
♦ కృష్ణా నది వరదలతో పోటెత్తితే చాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఎక్కడో ఓచోట కరకట్టలకు భారీ గండ్లు పడుతున్నాయి. పంటలు నీటిపాలవుతున్నాయి. ఊళ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఎందుకు?
నదికి రక్షణగా నిలవాల్సిన కరకట్టలు ఏటేటా బలహీనమైపోతున్నాయి!
వాల్టా చట్టం ఏం చెబుతోంది
♦ భూగర్భ జలాలు ప్రమాదకర (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) స్థితికి చేరుకున్నట్లు ప్రకటించిన ప్రాంతాల పరిధిలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించాలి.
♦ నోటిఫైడ్ ప్రాంతాల్లో కేవలం స్థానిక గ్రామ/పట్టణ అవసరాలకు మాత్రమే తవ్వకాలు జరపాలి.
♦ డ్యాములు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు.
♦ తీరంలో 8 మీటర్లు ఆపైలోతులో ఇసుక లభ్యత ఉంటే గరిష్టంగా 2 మీటర్ల లోతు వరకు తవ్వకాలకు అనుమతి ఇవ్వవచ్చు. కనీసం 3 మీటర్ల వరకు ఉంటే మీటర్ వరకు తవ్వకాలకు అనుమతిస్తారు.
♦ నది గర్భం నుంచి తీరం వరకు 15 మీటర్ల వరకు ఇసుక తవ్వకాలపై నిషేధం.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
జపాన్, చైనా తదితర దేశాలు ఇసుకకు ప్రత్యామ్నాయాలపై విసృ్తతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఉక్కు కర్మాగారాల్లోని శేష పదార్థాలు(స్లాగ్), థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తవుతున్న బూడిద (ఫై ్లయాష్), పాత భవనాల శిథిలాల నుంచి ఇసుకను తయారు చేసుకుని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నాయి. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిర్మాణ రంగ శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ఇంజనీర్లు, మేధావులతో ఏర్పడిన ‘ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ (ఐసీఐ)’ సైతం ఇసుకకు ప్రత్యామ్నాయాలపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మన రాష్ట్రానికి చెందిన పర్యావరణవేత్త, డాక్టర్ ఎల్.హెచ్ రావు ఉన్నారు. ఆ కమిటీ కూడా పైన చెప్పిన మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది. రహదారుల నిర్మాణం కోసం ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఐరన్ ఓర్ స్లాగ్‌ను వినియోగించేందుకు ఇటీవల జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) అనుమతించింది.
పాత భవనాల శిథిలాలను క్రషర్ ద్వారా ఇసుకగా మార్చి వినియోగించుకోవచ్చు. జపాన్, చైనా దేశాల్లో చిన్న చిన్న కట్టడాల నిర్మాణం కోసం ఇప్పటికే శిథిలాల ఇసుకను వినియోగిస్తున్నారు.
థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి భారీగా ఫై ్లయాష్ ఉత్పత్తి అవుతోంది. 80 శాతం ఇసుకలో 20 శాతం ఫ్లై యాష్‌ను కలిపి వాడవచ్చు.
ఉక్కు కర్మాగారాల్లో ఇనుప ఖనిజానికి సున్నపురాయి కలిపి 1,500 డిగ్రీల వద్ద వేడిచేస్తారు. దీంతో ఉక్కుతో విడిపోయిన మాలిన్యాలు పైకి తేలి ఇసుక పదార్థంలా ఏర్పడుతాయి. జపాన్, చైనా దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఐరన్ ఓర్ స్లాగ్ ఇసుకకు 100 శాతం ప్రత్యామ్నాయమని గుర్తించారు. దీనిపై అవగాహన లేక మన దేశంలో వెనకడుగు వేస్తున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో ఐరన్‌ఓర్ స్లాగ్‌ను అనుమతిస్తే ప్రజల్లోనూ చైతన్యం వస్తుంది. దేశంలో ఏటా 70 మిలియన్ టన్నుల ఇనుముతో పాటు దాదాపు 30 మిలియన్ టన్నుల స్లాగ్ ఉత్పత్తి అవుతోంది. ఉక్కు కర్మాగారాలు సైతం ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. దానిని తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రత్యామ్నాయ సామగ్రితో నిర్మాణాలు చేసే వారికి జపాన్‌లో రాయితీలు కూడా ఇస్తున్నారు.
ఇలాగైతే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
మానవ జాతికి ఇదే చివరి తరం అన్నట్లు సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ప్రకృతి విధ్వంసంతో భవిష్యత్తు తరాల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలు ఆపకపోతే విపరిణామాలు తప్పవు. ఇసుక కొరతను తీర్చుకోవడం కోసం రాక్ సాండ్ పేరుతో కొండలను ధ్వంసం చేయడం ఇంకా ప్రమాదకరం. ప్రత్యామ్నాయ ఇసుక వినియోగమే పరిష్కారం.
- రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె.పురుషోత్తం రెడ్డి
పర్యావరణవేత్త ఆధునిక పరిజ్ఞానమే పరిష్కారం
పూర్వం ప్రతి ఊరి శివారులో పుష్కలంగా ఇసుక ఉండేది. వాననీళ్లు ఎక్కడికక్కడే ఇంకి భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చేవి. మట్టి, సున్నం మిశ్రమంతోనే అన్ని రకాల నిర్మాణాలు చేసేవారు. కానీ సిమెంట్ పరిచయం తో ఇసుక తప్పనిసరైపోయింది. విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు పడిపోయాయి. ఇసుక తవ్వకాలపై నియంత్రణ కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగించుకోవాలి. ద్రోణ్‌లతో త్రీడీ మ్యాపింగ్ ఆధారంగా నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే జరపాలి. అనుమతించిన పరిమితులకు లోబడే తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా? అని పరిశీలించేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
- డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి, పర్యావరణవేత్త
రాళ్ల దిగుమతి తప్పదేమో..
భవిష్యత్తులో గ్రానైట్ చాలా అవసరం. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో ఈ రాళ్లు ఎంతో అవసరం. రాతి ఇసుక కోసం కొండలను కరిగించుకుంటూపోతే భవిష్యత్తులో రాళ్లను సైతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తవచ్చు.
- డాక్టర్ ఎల్.హెచ్ రావు, సాంకేతిక
సలహాదారులు, జిందాల్ సిమెంట్ పరిశ్రమలు క్రమపద్ధతిలో జరగాలి
ఇసుక తవ్వకాలు క్రమపద్ధతిలో జరగాలి. ఒకచోట ఎక్కువ తవ్వేసి మరొకచోట వదిలేయడం వల్ల నీరు సరిగా పారదు. ఎక్కువ తవ్విన ప్రాంతాల్లో భూమి కోతకు గురవుతుంది. ఎక్కువ ఇసుక ఉన్నచోట పైపొరను మాత్రమే తీయాలి. లోపలి పొరలు కూడా తవ్వితే నీటిస్థాయి పడిపోతుంది.
- డాక్టర్ ఎంవీఎస్ రాజు, ప్రొఫెసర్, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ, విజయవాడ