సిమెంట్ బస్తాల్లో ఇసుక అక్రమరవాణా
రాత్రి వేళల్లో కొనసాగుతున్న దందా!
యాలాల: కాగ్నానది నుంచి ఇసుక తరలించకుండా కళ్లెం వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజూ ఇసుక అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి రాత్రి సమయంలో ఆటోలు,జీపుల్లో అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ఇసుక అక్రమ రవాణా తగ్గిందని భావిస్తున్నప్పటికీ రాత్రివేళల్లో జోరుగా కొనసాగుతోంది.
మండల పరిధిలోని కోకట్, విశ్వనాథ్‌పూర్, బెన్నూరు తదితర గ్రామాల శివారులో ఉన్న కాగ్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
ఇందుకోసం అక్రమార్కులకు సహాయంగా ఆటో, జీపు డ్రైవర్ల యజమానులు కాగ్నానది నుంచి సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒక్కో ఆటోలో 10 నుంచి 20 బస్తాల్లో ఇసుక నింపి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఈ దందా కొనసాగుతోంది. ఒక్కో ఆటోకు రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. విశ్వనాథ్‌పూర్ సమీపంలోని శివసాగర్ ప్రాజెక్టు దిగువన కాగ్నానదిలో ఇసుకను సిమెంట్ బస్తాల్లో నింపి రాత్రివేళల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు అగ్గనూరు, సంగెం నుంచి కూడా ట్రాక్టర్లలో ఇసుక అక్రమ కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ వర్షిణి, తాండూరు ఏఎస్పీ చందనదీప్తి కఠిన చర్యలకు దిగుతున్నప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు.