‘తెల్ల’బోతున్న ‘బంగారం’
అక్రమార్కుల ధాటికి తెల్ల బంగారం తెల్లబోతోంది. ఇసుకాసురులు దీనినే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకుని విచ్చలవిడిగా నదీమ తల్లి గర్భాన్ని తవ్వేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుకను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతం, పరిసరాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న ఆవేదన ప్రజలు, రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సైతం కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓవైపు ఇసుకను మహిళా సంఘాలకు అప్పగించాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ఇసుకాసురులకు కళ్లెం వేసే వారే లేకుండా పోయూరు. రొద్దం మండలంలోని పెన్నానది పరీవాహిక ప్రాంతం నుంచి తరలి పోతున్న తెల్ల బంగారం కథాకమామిషు ఇది.
* కర్ణాటకకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
* జేబులు నింపుకుంటున్న అక్రమార్కులు
రొద్దం: గత నెల రోజులుగా కర్ణాటకకు ఇసుకను అక్రమార్జనపరులు ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. దీంతో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రొద్దకంపల్లి గ్రామ సమీపాన పెన్నానది నుంచి పెద్ద ఎత్తున పావగడకు ఇసుకను రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతూ నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు ఎండి పోతున్నాయని రైతులు వాపోతున్నారు. నల్లూరు, కల్లుకుంట, నాగిరెడ్డిపల్లి, నారనాగేపల్లి, కందుకూర్లపల్లి, పెద్దమంతూరు, చిన్నకోడిపల్లి, కనుమర, ఆర్ కుర్లపల్లి, రొద్దం, చెరుకూరు, ఉప్పర్లపల్లి, సుబ్బరాయప్పగారి కొట్టాల, తదితర గ్రామాల్లో పెన్నానది ఒడ్డున వివిధ పూల తోటలను రైతులు సాగు చేశారు. వీటిపై ఆధారపడి దాదాపు 3 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
ఇప్పటికే పెన్నా నుంచి అత్యధికంగా ఇసుకను అక్రమార్కులు తరలించడంతో భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లాయి. దీంతో రైతులు అప్పులు చేసి ఫిల్టర్ బోర్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోవడంతో వాటి ల్లో కూడా నీటి మట్టం అడుగంటి పోరుుంది. దీంతో రైతుల కుటుంబాలు పంటల్ని కోల్పోరుు తీవ్రంగా నష్ట పోయి బజారున పడే దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇసుక రవాణా భారీగా సాగుతోందని పలువురు రైతులు చెబుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు ఇసుక ధర దాదాపుగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందన్నారు.
కేవలం ఇసుకను తరలించడానికే కొందరు కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చే శారని చెబుతున్నారు. రాత్రంతా ఇసుక తరలించడం.. పగలు మిన్నకుండిపోవడం అక్రమార్కులు పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. రొద్దంకపల్లి, రొద్దం, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెరుకూరు, పెద్దమంత్తూరు, ఉప్పరపల్లి, తదితర గ్రామాల నుంచి ఇసుక భారీగా తరలుతోందని సమాచారం. అధికారులకు చెప్పినా స్పందించిన నాథుడే లేదని రైతులు వాపోతున్నారు.
రాత్రి వేళలో లారీలకు ఇసుకను లోడు చేసి టార్పలిన్లతో కప్పి బెంగళూరుకు రవాణా చేస్తునట్లు తెలుస్తోంది. ఇలాగే ఇసుక తోడేస్తే కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరకని పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నానదిలో బోర్లు లోతుగా వేస్తున్నా ప్రస్తుతం నీరు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి తమను కాపాడాలని రైతాంగం కోరుతోంది.