కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దు వైపు వేసిన దారి
హద్దుమీరి అడ్డదారి
Published Sun, May 7 2017 11:49 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
- కర్ణాటక ఇసుక మాఫియా
- జిల్లా సరిహద్దుల్లో దందా
- ఇసుక దోపిడీకి ప్రత్యేక దారి
- వంద ట్రాక్టర్లలో తరలింపు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
మంత్రాలయం : కర్ణాటక ఇసుక మాఫియా హద్దులు దాటింది. తమవైపు ఇసుకనంత ఊడ్చేసి.. ఇప్పుడు ఆంధ్ర హద్దుల్లోకి ప్రవేశించింది. అక్రమ దందాకు ఆంధ్ర వైపుగా తుంగభద్ర నదిలో అడ్డదారి వేసింది. ఈ దారిలో అడ్డదిడ్డంగా ఇసుకను తరలిస్తోంది. వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి కాసుల వర్షం కురిపించుకుంటోంది. అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లు మూసుకున్నారు.
రోజుకు వెయ్యి ట్రిప్పులు..
కర్ణాటక నదీతీర గ్రామాల ఇసుక మాఫియా హద్దులు మీరింది. తమ హద్దులు దాటుకుని ఆంధ్రవైపు ఇసుక నిల్వపై పడింది. కోసిగి మండలం తుమ్మిగనూరు, సాతనూరు, కందకూరు, బొమ్మలాపురం హద్దుల్లో పాగా వేసింది. ఇసుక తరలించేందుకు ఏకంగా మట్టితో అడ్డదారి సైతం నిర్మించుకుంది. కర్ణాటక ప్రాంతం రాజోలి, జూకూరు గ్రామాల ఇసుక మాఫియా దందాకు దారితీసింది. ఏకకాలంలో 100 ట్రాక్టర్లు చొరబడి రేయింబవళ్లు ఇసుకను ఎత్తుకెళ్తున్నాయి. రోజుకు వెయ్యి ట్రిప్పులు తరలిస్తున్నారు. సాతనూరు, తుమ్మిగనూరు గ్రామాల సమీపానికి చేరుకుని ఇసుకను భారీగా హద్దులు దాటిస్తున్నారు.
మారని తీరు
కర్ణాటక ఇసుక మాఫియాకు ఇదో పరిపాటిగా మారింది. గతంలో ఇసుక తరలించేందుకు ఆర్డీఎస్ ఆనకట్ట పైభాగాన ఆనుకుని దారి వేయడం జరిగింది. కోసిగి పోలీసులు దాడులు చేసి దారిని జేసీబీతో మొత్తం చెరిపేశారు. అదే తరహాలో ప్రస్తుతం సాతనూరు సమీపంలో దాదాపు కి.మీ. పొడవునా మట్టిరోడ్డు వేశారు. ఆంధ్రవైపు చొరబడటంతో ఇక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. స్థానికులు ఇసుకను తీసుకెళ్తే కోసిగి అధికారులు తక్షణమే దాడులు చేస్తున్నారు. కర్ణాటక వారు.. దోపిడీ సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే మంత్రాలయం మండల కేంద్రంలో మాత్రం స్థానిక ఇసుక మాఫియా నిశీధిలో తన కార్యకలాపాలు సాగిస్తోంది.
పట్టించుకోని రెవెన్యూ అధికారులు..
పోలీసులు కాస్త చొరవతోనే దాడులు నిర్వహిస్తున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం కొరవడింది. కోసిగి రెవెన్యూ అధికారులు అలసత్వం కారణంగా కర్ణాటక ఇసుక మాఫియాకు అడ్డుఅదుపూ లేకపోయింది. మంత్రాలయంలో పోలీసులు పగ్గాలేసి పడుతున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాక్టర్లు స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. లోపాయికారీ ఒప్పందాలతోనే ఈ దందా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం ఇసుక దందా లేదని...దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. కర్ణాటక ఇసుక మాఫియా రోడ్డు వేసిన విషయం ప్రస్తావించగా అలాంటిదేమీ లేదన్నారు.
Advertisement
Advertisement