‘తాండవ’ గుండెకు తూట్లు
వేలాది ఎకరాలకు నీరందించే తాండవ గుండెకు ‘పచ్చదళం’ కోత పెడుతోంది. అర్థబలం, అంగబలం ఉందనే తెగింపుతో పగలు, రాత్రి తేడా లేకుండా నది నడుమ ఇసుకను తవ్వి లక్షలు గడిస్తున్నారు. ఆయకట్టు రైతులను నట్టేట ముంచేస్తున్నారు. ఒడ్డునున్న శ్మశానవాటిక నదిలో కలిసిపోతుందని తెలిసినా వారికి ఖాతరే లేదు. పంచాయతీల నుంచి ఒక రశీదు తీసుకుని, దాని మాటునే పది, పదిహేను ట్రాక్టర్ల ఇసుక తవ్వుకుపోతున్నారని తెలిసినా అధికారులు చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు.
* యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్న అక్రమార్కులు
* ఒక రశీదు మాటున పదుల ట్రాక్టర్ల తరలింపు
* అండగా నిలుస్తున్న అధికార పార్టీ నాయకులు
* రోజూ లక్షలు దండుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : యాభై వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ నది విశాఖ జిల్లానాతవరం నుంచి మొదలై తుని మీదుగా పెంటకోట వరకూ ప్రవహిస్తోంది. ఆ నది పరీవాహక ప్రాంతం ఇప్పుడు తెలుగుతమ్ముళ్లకు, వారి అనుచరులకు లక్షలు కురిపిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా తాండవలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక తవ్వుకునేందుకు పంచాయతీ కార్యదర్శులు అనుమతి ఇవ్వాలి.
అదీ ఒక లబ్ధిదారుడికి ఒక ట్రాక్టర్ ఇసుక మాత్రమే. ఇంటి నిర్మాణం జరుగుతున్నట్టు గృహనిర్మాణశాఖ నుంచి అనుమతి పత్రం చూపి, రూ.120 జమచేస్తే పంచాయతీ నుంచి రశీదు ఇస్తారు. ఆ అనుమతి కూడా రెండు రోజులకు ఒకటి వంతున ఇంటి నిర్మాణానికి అవసరమైన మేరకు మాత్రమే విడుదల చేయాలి. కేవలం నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల కోసం ఈ వెసులుబాటు ఇచ్చారు. అది కూడా తాండవ నదీ గర్భంలో 3 నుంచి 4 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ పరిమాణంలో ఉంటే ఇసుక తీయకూడదనేది నిబంధన. కానీ ఆ నిబంధనలను తోసిరాజంటూ యథేచ్ఛగాా తవ్వకాలు జరిపించేస్తున్నారు.
తెలుగుతమ్ముళ్ల బినామీలే..
తుని, కోటనందూరు మండల్లో తెలుగుతమ్ముళ్లు, వారి పేరుతో బినామీల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. పైసా పెట్టుబడి లేకుండా ఇసుక అడ్డగోలు రవాణాతో లక్షలు వెనకేసుకుంటున్నారు. విశాఖ జిల్లా నాతవరం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తాండవ సుమారు 36 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. జిల్లా పరిధిలోకి వచ్చే అల్లిపూడి, కోటనందూరు, కేఓ అగ్రహారం, డి.పోలవరం, బొద్దవరం, కొలిమేరు, నందివంపు, మరువాడ, రేఖవానిపాలెం, కుమ్మరిలోవ, ఉప్పరగూడెం, రామభద్రపురం తదితర ప్రాంతాల్లో అనధికారికంగా ఇసుక రీచ్‌లు నిర్వహిస్తున్నారు.
విచ్చలవిడిగా ఇసుక తవ్వడం వల్ల నది ప్రవాహ గమనం మారి విలువైన పంటభూములు కోతకు గురవుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం గోదావరి, కృష్ణావంటి జీవనదుల్లోనే ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారు. కానీ ఇక్కడ ఏ విధమైన అనుమతులు లేకుండానే యంత్రాలతో ఇసుక దర్జాగా తవ్వుకుపోతున్నారు. కాగా ఇసుకలపేటకు సమీపాన రోటరీ రూ.అరకోటి వెచ్చించి నిర్మించిన హిందూ శ్మశాన వాటిక ఇసుక తవ్వేస్తుండటంతో కిందకు దిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
రోజుకు 1500 ట్రాక్టర్లకు పైమాటే..
ఇంటి నిర్మాణం పేరుతో ఒక ట్రాక్టర్ ఇసుక కోసం రూ.133, ఎడ్లబండికి రూ.46 చెల్లించి పంచాయతీల నుంచి రశీదు తీసుకుంటున్నారు. అధికారికంగా ఒకటి, రెండు రశీదులు తీసుకుంటున్న అక్రమార్కులు వాటిపైనే 10 నుంచి 25 లోడులను తరలించుకుపోయి దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.133 చెల్లిస్తున్న అక్రమార్కులు మార్కెట్‌లో రూ.1000కు విక్రయిస్తున్నారు. తాండవ పరీవాహక ప్రాంతంలో రోజూ 1500 ట్రాక్టర్‌ల పైబడే ఇసుకను తరలించుకుపోతున్నట్టు అంచనా.
ఎడ్లబళ్లకు అయితే లెక్కేలేదంటున్నారు. మొత్తం మీద రోజుకు రూ.15 లక్షల చొప్పున అంటే నెలకు నాలుగున్నర కోట్లు తెలుగుతమ్ముళ్లు నొక్కేస్తున్నారు. తునిమండలంలో అధికారపక్షానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి, కోటనందూరు మండలంలో ఒక ప్రజాప్రతినిధి ఇసుక అక్రమ తవ్వకంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. మండల రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా కొంత వాటా ముట్టచెప్పడం, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డూఅదుపూ లేదు.
అడపాదడపా గనులశాఖ అధికారులు దాడులు నిర్వహించినా మొక్కుబడి కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. ఈ విషయమై తుని ఇన్‌చార్జి ఎంపీడీఓ శేషారత్నంను వివరణ కోరగా ట్రాక్టర్‌కు రూ.133 వంతున, ఎడ్లబండికి రూ.46 వంతున జమ చేసుకుని వే బిల్లు ఇచ్చిన తరువాతే ఇసుక తరలించేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. అనధికారికంగా ఇసుక తరలించే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.